Share News

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామం

ABN , Publish Date - Dec 26 , 2025 | 03:30 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ‘ఆరా’ పోల్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థాపకుడు ఆరా మస్తాన్‌ను శుక్రవారం విచారించారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామం
Ara Mastan

  • ఫోన్ ట్యాపింగ్ కేసుపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆరా మస్తాన్ విచారణ

  • హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని నూతన సిట్ విచారణ

  • 2020 నుంచి ఫోన్ ట్యాపింగ్‌పై అనుమానం

  • ఆరా మస్తాన్ కాల్ రికార్డింగ్స్ పరిశీలన

  • ఫోన్ ట్యాపింగ్ కేసు త్వరలో కొలిక్కి వస్తుంది: ఆరా మస్తాన్ ఆశాభావం

హైదరాబాద్, డిసెంబరు26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ‘ఆరా’ (AARAA) పోల్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థాపకుడు ఆరా మస్తాన్‌ను (Ara Mastan) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఇవాళ (శుక్రవారం) విచారణ జరిపింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన నూతన సిట్ ఈ విచారణ ప్రారంభించింది.


ఈ విచారణ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే రెండు సార్లు పోలీసులు ఆరా మస్తాన్‌ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈసారి విచారణలో భాగంగా ఆయన గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్లను తిరిగి పరిశీలించి, కన్ఫర్మేషన్ కోసం అదే ప్రశ్నలను మరోసారి అడిగినట్లు తెలుస్తోంది.


2020 నుంచి కాల్ రికార్డుల పరిశీలన

సిట్ అధికారులు 2020 సంవత్సరం నుంచి ఆరా మస్తాన్ వివిధ కీలక రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులతో మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డింగ్స్‌ను సమగ్రంగా పరిశీలించారు. ఈ కాల్ డేటా ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? జరిగితే ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? అనే అంశాలపై సిట్ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.


సిట్ అధికారుల విచారణ అనంతరం ఆరా మస్తాన్ మీడియాతో మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన సిట్ తనను ఈరోజు విచారణకు రావాలని పిలిచిందని అన్నారు. అధికారుల పిలుపు మేరకే తాను హాజరయ్యానని తెలిపారు. గతంలో అడిగిన ప్రశ్నలనే మరోసారి అడిగి, తన వాంగ్మూలాన్ని నిర్ధారించుకున్నారని వెల్లడించారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను స్పష్టమైన సమాధానాలు ఇచ్చానని చెప్పుకొచ్చారు.


ఫోన్ ట్యాపింగ్‌పై అనుమానం

తన ఫోన్ ట్యాపింగ్ 2020 సంవత్సరం నుంచే జరుగుతోందన్న అనుమానం ఉందని తెలిపారు. అప్పటి నుంచి తన కాల్స్, కమ్యూనికేషన్‌పై నిఘా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అంశాన్ని విచారణలో సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.


నూతన సిట్‌పై విశ్వాసం

నూతనంగా ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిందని ఆరా మస్తాన్ అభిప్రాయపడ్డారు. గతంతో పోలిస్తే ఇప్పుడు విచారణ మరింత సమగ్రంగా, స్పష్టంగా కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. నూతన సిట్ దర్యాప్తు ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసు త్వరలోనే ఒక స్పష్టమైన దశకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సిట్ అధికారులు తనకు చెప్పారని అన్నారు. తాను చట్టపరమైన ప్రక్రియలకు పూర్తిగా సహకరిస్తానని, నిజాలు బయటకు రావాలన్నదే తన ఆకాంక్ష అని ఆరా మస్తాన్ స్పష్టం చేశారు.


కేసు ప్రాధాన్యత

ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందా?, అధికార దుర్వినియోగం జరిగిందా? అనే ప్రశ్నలు ఈ కేసుతో ముడిపడి ఉన్నాయి. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడైన ఆరా మస్తాన్ పేరు ఈ కేసులోకి రావడంతో మరింత ప్రాధాన్యం ఏర్పడింది.


రాజకీయాలపై ప్రభావం

ఈ కేసులో సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తోండటంతో రానున్న రోజుల్లో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని రాజకీయ, న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది ఫలితం రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విమాన ప్రయాణం.. ప్రయాణికుల్లో కలవరం

క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితిలో నిలుపుతుంది: ఆర్ఎస్ఎస్ చీఫ్

For More TG News And Telugu News

Updated Date - Dec 26 , 2025 | 04:02 PM