RSS Chief Mohan Bhagwat: క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితిలో నిలుపుతుంది: ఆర్ఎస్ఎస్ చీఫ్
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:33 PM
కొందరిలో ఎంత ఎదిగితే అంత అహంకారం పెరుగుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. ప్రపంచానికి భారత్ ఎంతో కొంత ఇవ్వాలని పేర్కొన్నారు. మనుషులందరికీ సౌఖ్యం, సదుపాయాలు కావాలని చెప్పారు.
తిరుపతి, డిసెంబర్ 26: మనిషిలోని క్షమాగుణమే అతడిని ఉన్నత స్థితిలో నిలుపుతుందని ఆర్ఎస్ఎస్ చీప్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. శుక్రవారం తిరుపతిలోని సంస్కృతి యూనివర్సిటీలో నాలుగు రోజుల పాటు జరగనున్న భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్‌ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రారంభించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. మనమంతా ఈ ప్రపంచానికి ఎంతో కొంత రుణపడి ఉన్నామన్నారు. మానసిక సంతృప్తి లేకపోతే ఎంత పొందినా సుఖం కలగదని పేర్కొన్నారు.
కొందరిలో ఎంత ఎదిగితే అంత అహంకారం పెరుగుతుందని చెప్పారు. ప్రపంచానికి భారత్ ఎంతో కొంత ఇవ్వాలన్నారు. మనుషులందరికీ సౌఖ్యం, సదుపాయాలు కావాలని చెప్పారు. సుఖమనేది కేవలం భౌతికపరమైనదని ఆయన అభివర్ణించారు. సుఖ దు:ఖాలు తాత్కాలికమైనవన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అభివృద్ధితోపాటే వినాశనం సైతం వచ్చేసిందంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్ర విజ్ఞానంతోనే మానవాళికి సదుపాయాలు కలుగుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మనం పొందుతున్న వాటిలో రెండో కోణం కూడా ఉంటుందన్నారు.
కచ్చితంగా ప్రపంచంలోనే భారత్ గొప్ప దేశం అవుతుందన్నారు. ప్రపంచంలో భారతదేశం ఉన్నత స్థితిలోకి రావడంతోపాటు.. ప్రపంచానికి మన దేశం ఏమి ఇవ్వగలమే అంశంపై దృష్టి పెట్టాలని ప్రజలకు ఆయన సూచించారు. సృష్టిలో ప్రతి ఒక్కరికీ సుఖం కావాలన్నారు. మనిషి సాధించే జ్ఞానంతో సుఖాన్ని సాధించాల్సి ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ అభిప్రాయపడ్డారు. ఆహారం, నిద్ర, మైధునం జంతువులకు ఆనందాన్ని ఇస్తాయని.. జంతువు కంటే మనిషి భిన్నమైన వాడని తెలిపారు. ఏ జంతువు ఆత్మహత్య చేసుకోదన్నారు. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ఉన్నదని తెలిసిన వాడు మనిషని ఆయన తెలిపారు.
భౌతిక అవసరాలు తీర్చుకోవడం మాత్రమే వికాసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో సుఖంగా ఉన్నవాళ్లు దుఃఖంతో ఉన్నవారంటూ రెండు వర్గాలుగా తయారు కాకూడదని హితవు పలికారు. మనుషులంతా సుఖంగా ఉండాలని కోరుకోవాలని.. అహంకారంతో ఉండకూడదని ఆయన సూచించారు. భౌతిక అంశాల జ్ఞానాన్ని విజ్ఞానమని.. అంతర్ జ్ఞానాన్ని జ్ఞానమని అంటారని వివరించారు. విజ్ఞానంతో మాత్రమే కొట్టుకుపోకూడదని చెప్పారు.
భారతీయ విజ్ఞాన సమ్మేళనం లక్ష్యం జ్ఞానమని.. దీనిని ప్రపంచంలోని అందరికీ దగ్గర చేయాల్సి ఉందన్నారు. ఎవరికి ఏ భాష వచ్చొ ఆ భాషను ప్రజలకు అందుబాటులోకి తీసుకుపోవాల్సి ఉందని తెలిపారు. అప్పుడే అందరిలో బుద్ధి వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. భారతీయుల డీఎన్ఏలో మాత్రమే ధర్మ దృష్టి ఉందని ఆయన స్పష్టం చేశారు. భారత్ విశ్వ గురువు కావాలని ఆకాంక్షించారు. ఆర్థిక, సామాజిక, ధర్మ జ్ఞానాల్లో సంపూర్ణంగా మనం ప్రపంచానికి శక్తిని..దృష్టిని.. ఇవ్వాల్సి ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే హనుమంతుడు బలవంతుడు: సీఎం చంద్రబాబు
పుష్యమాసంలో ఇలా చేస్తే కష్టాలు తొలుగుతాయి..!
For More AP News And Telugu News