Bharatiya Vigyan Sammelan: సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే హనుమంతుడు బలవంతుడు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 26 , 2025 | 11:52 AM
భారత్‌లో నాలెడ్జ్‌కు కొదవ లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం తిరుపతిలోని సంస్కృతి యూనివర్సిటీలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్‌ను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతి, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
తిరుపతి, డిసెంబర్ 26: భారత్‌లో నాలెడ్జ్‌కు కొదవ లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం తిరుపతిలోని సంస్కృతి యూనివర్సిటీలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్‌ను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. హాలీవుడ్‌లో హీరోల కంటే మన పురాణాల్లోని పురుషులు గొప్ప వారని మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని వారికి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని నొక్కి చెప్పారు. బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మహాభారతంలో అర్జునుడు మహాయోధుడని వారికి చెప్పాలన్నారు.
కృష్ణుడు, మహాశివుడి మహత్యాల గురించి పిల్లలకు వివరించాలని తెలిపారు చంద్రబాబు. శ్రీరాముడిని మించిన మర్యాద పురుషోత్తముడు లేడని వారికి అర్థమయ్యేలా వివరించాలన్నారు. అవతార్ సినిమా కంటే మన మహాభారతం గొప్పదని మన పిల్లలకు చెప్పాల్సి ఉందని సూచించారు. కంసుడు లాంటి రాక్షసుల గురించి కూడా వారికి తెలియాల్సి ఉందన్నారు. అప్పుడే మన పిల్లలు మంచికి, చెడుకి మధ్య ఉన్న వ్యత్యాసం తెలుసుకోగలరని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మైథాలజీ గురించి అందరూ మరిచిపోయే సమయంలో ఎన్టీఆర్ పోషించిన పాత్రలో మళ్లీ విలువల గురించి సమాజానికి తెలియజేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడంలో యోగాది కీలకపాత్ర అని చెప్పారు.
యోగా ద్వారా భారతదేశం యూనివర్సల్ హెల్త్‌ను అందించిందన్నారు. జీరోను భారతీయులే కనిపెట్టారని గుర్తు చేశారు. చెస్ ఆట సైతం మనదేనని వివరించారు. భారతీయ కుటుంబ జీవితం మన దేశంలో మాత్రమే ఉందన్నారు. ఇది భద్రతతో పాటు జీవితాల్లో వెలుగునిస్తోందని పేర్కొన్నారు.
ప్రతి జంట ముగ్గురు పిల్లలను కనేలా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. సౌర, పవన విద్యుత్తుపై అధికంగా దృష్టి పెడుతున్నామని వివరించారు. ఆరు నెలల్లో క్వాంటమ్ కంప్యూటర్ అమరావతి నుంచి ఆపరేట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. క్వాంటమ్ కంప్యూటర్‌ను తయారు చేయడానికీ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఏపీకి ఇప్పటికే గూగుల్ వచ్చిందని.. మైక్రోసాఫ్ట్ కూడా రావాలని చూస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇలా అనేక అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌కు రాబోతున్నాయని వివరించారు. ఇది దేశ అభ్యున్నతికి కూడా కారణమవుతోందన్నారు. టెక్నాలజీలో మనం ప్రపంచంలో ఎవరికి తక్కువ కాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పుష్యమాసంలో ఇలా చేస్తే కష్టాలు తొలుగుతాయి..!
భూ ప్రకంపనలు.. భయంతో ఇళ్ల నుంచి జనం పరుగు
For More AP News And Telugu News