RS Praveen Kumar Fires Revanth Govt: గూండాలకి రక్షణ కల్పిస్తున్న రేవంత్ ప్రభుత్వం.. ప్రవీణ్ కుమార్ ఫైర్
ABN , Publish Date - Oct 25 , 2025 | 02:46 PM
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గూండాలకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత బాబా ఫసీయుద్ధీన్‌కు ఇద్దరు గన్‌మెన్‌లను ఎందుకు ఇచ్చారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
హైదరాబాద్ అక్టోబరు25 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గూండాలకి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Govt) రక్షణ కల్పిస్తోందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత బాబా ఫసీయుద్ధీన్‌కు ఇద్దరు గన్‌మెన్‌లను ఎందుకు ఇచ్చారు..? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ర్యాలీలో వ్యభిచార గృహం నడిపిన అఖిల్ ఫైల్వాన్ ఎందుకు ఉన్నారని నిలదీశారు. ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలి..
ఐఏఎస్ అధికారి రిజ్వీ విషయం అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలకు పట్టదా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. దయచేసి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అక్రమ ఆదేశాలని పాటించవద్దని సూచించారు. అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలని కోరారు. ఓ గురుకుల పాఠశాలలో అమ్మాయి చనిపోతే కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అసలు మానవత్వం లేదని ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ మంత్రులు జోరుగా తిరుగుతున్నారని.. గురుకులాల్లో ఉండే పిల్లల పరిస్థితి ఏంటి.. వారి సమస్యలను పట్టించుకోరా..? అని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
గురుకులాల్లో ఇప్పటివరకు 110 మంది పిల్లలు చనిపోతే వాళ్ల కుటుంబాల వద్దకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెళ్లే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలన గాలికి వదిలేశారని మండిపడ్డారు. గురుకులాల్లోని 110మంది విద్యార్థుల సమస్యలని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఓ జూవైనల్ హోమ్‌లో 10మంది చిన్నారులపై అత్యాచారం జరిగితే మంత్రి సీతక్క ఎందుకు స్పందించలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నలవర్షం కురిపించారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలు చిల్లరగా మాట్లాడొద్దు: కౌశిక్ రెడ్డి

కాంగ్రెస్, బీజేపీ నాయకులు చిల్లరగా మాట్లాడొద్దని.. తమ జోలికి వస్తే తాట తీస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి (Kaushik Reddy) హెచ్చరించారు. ఇవాళ(శనివారం) కౌశిక్‌రెడ్డి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థిని సూసైడ్ చేసుకొని చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంత్రులు ఒక్కరైనా స్పందించారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు గురుకులాల్లో 110మంది విద్యార్థులు చనిపోయారని వాపోయారు. కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలపై రేవంత్‌రెడ్డికి అంత కోపం ఎందుకని ప్రశ్నించారు. గురుకులాల్లో ఉండే విద్యార్థుల సమస్యలని సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!
నాగుల చవితి.. తెల్లవారే పుట్టలో పాలు పోసిన మండలి బుద్ధ ప్రసాద్
Read Latest Telangana News And Telugu News