Sridhar Babu on Trump: ట్రంప్ నిర్ణయాలపై కేంద్రం మౌనమెందుకు.. మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నల వర్షం
ABN , Publish Date - Sep 20 , 2025 | 08:07 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో మారు భారతీయులకు నష్టం కలిగించారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. వీసా ఛార్జీల పెంపు నిర్ణయం యువతి యువకులకు, పారిశ్రామిక వేత్తలకు ఇబ్బంది కలిగించే అంశమని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ , సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) మరోమారు భారతీయులకు నష్టం కలిగించారని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసా ఛార్జీల పెంపు నిర్ణయం యువతి యువకులకు, పారిశ్రామిక వేత్తలకు ఇబ్బంది కలిగించే అంశమని చెప్పుకొచ్చారు. ఇవాళ(శనివారం) హైదరాబాద్ వేదికగా మీడియాతో మాట్లాడారు మంత్రి శ్రీధర్ బాబు.
వీసా చార్జీలు లక్ష డాలర్లకు పెంచి చాలా నష్టం కలిగించారని తెలిపారు. 85 వేల H1B వీసాల్లో టెక్‌వన్ కంపెనీల వారు H1B వీసాలు ఎక్కువ పొందుతున్నారని చెప్పుకొచ్చారు. ఎక్కువ వీసాలు పొందిన దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉందని ఉద్ఘాటించారు. ఆ దేశానికి వన్నె తెచ్చిన మన మేధావుల విషయంలో ట్రంప్ నిర్ణయం బాధాకరం, దురదృష్టకరమని అన్నారు. ట్రంప్ నిర్ణయాలపై తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని పేర్కొన్నారు మంత్రి శ్రీధర్ బాబు.
ట్రేడింగ్ టారిఫ్ ఫీజు పెంచడం కూడా మంచి పరిణామం కాదని తెలిపారు. H1B వీసా ఫీజు కట్టాలంటే ప్రముఖ ఐటీ కంపెనీలకు ఎంత భారం పడుతుందని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌన పాటిస్తుంది..? అని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రానికి పట్టింపు లేదా? అని ప్రశ్నించారు మంత్రి శ్రీధర్ బాబు.
టెక్ ఇండస్ట్రీ సంతోషంగా ఉందని ట్రంప్ చెబుతున్నారని అన్నారు. అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పొందాలనుకునే వారికి ట్రంప్ నిర్ణయాలు ప్రమాదమని హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ట్రంప్ నిర్ణయాలతో రియల్ ఎస్టేట్, విద్యారంగం, ఐటీ రంగంపై ప్రభావం పడనుందని తెలిపారు. ట్రంప్ నిర్ణయం - దాని ప్రభావంపై కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఉద్ఘాటించారు. ట్రంప్ నిర్ణయాలపై వెను వెంటనే కేంద్రప్రభుత్వం రంగంలోకి దిగి చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్
Read Latest Telangana News And Telugu News