Share News

Minister Prabhakar: ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం

ABN , Publish Date - May 05 , 2025 | 12:13 PM

Minister Ponnam Prabhakar : ఆర్టీసీ సమస్యలు పరిష్కరించడానికి తాను, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. తమ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం చాలా కార్యక్రమాలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

Minister Prabhakar: ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం
Minister Ponnam Prabhakar

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. గత పది సంవత్సరాలుగా ఒక్క బస్సు కొనుగోలు చేయలేదని ,ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేయలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో సీసీఎస్, పీఎఫ్ పైసలు వాడుకున్నారని విమర్శించారు. ఇవాళ(సోమవారం) మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ని ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ని కలిసిన వారిలో ఆర్టీసీ జేఏసీ చైర్మన్ టీఎంయూ జనరల్ సెక్రెటరీ అశ్వద్ధామరెడ్డి, ఎన్ఎంయూ జనరల్ సెక్రెటరీ నరేందర్, కార్మిక సంఘ్ జనరల్ సెక్రెటరీ ఎర్ర స్వామి కుమార్ , ఎస్టీఎంయూ జనరల్ సెక్రెటరీ పున్న హరికృష్ణ, తదితరులు ఉన్నారు. ఆర్టీసీ సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి ఆర్టీసీ సంఘాల నేతలు తీసుకువచ్చారు.


ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమస్యలపై ఉద్యోగులు ఎప్పుడైనా తనను కలవవచ్చని.. వారికి తానేప్పుడు అందుబాటులోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమస్యలు పరిష్కరించడానికి తాను, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నామని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల కోసం తమ కార్యాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం , ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని..సమస్యలు పరిష్కారమవుతున్నాయని చెప్పారు. సమ్మె చేయొద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వంలో ఆర్టీసీ అభివృద్ధి కోసం 16 నెలలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామని.. ఒక్కరినైనా ఇబ్బంది పెట్టలేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు.


ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) ఉద్యోగులకు 2013 నుంచి చెల్లించాల్సిన బాండ్ రూ.400 కోట్లు చెల్లించామని తెలిపారు. 2017 ప్రకారం పే స్కేల్ 21 శాతం ఇచ్చామని.. సంవత్సరానికి రూ.412 కోట్ల భారం తమ ప్రభుత్వంపై పడుతోందని చెప్పారు. పీఎఫ్ ఆర్గనైజేషన్ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.1039 కోట్లు చెల్లించామని వెల్లడించారు. నెలవారీ పీఎఫ్ కంట్రిబ్యూషన్ జనవరి-2024 నుంచి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని తెలిపారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీఎస్ బకాయిలు ఉద్యోగులకు రూ. 345 కోట్లు చెల్లించామని అన్నారు. 1500 మందిని కారుణ్య నియామకాల కింద విధుల్లోకి తీసుకున్నామని వివరించారు. తమ ప్రభుత్వం టీజీఎస్ ఆర్టీసీలో(TGSRTC) 3038 మంది ఉద్యోగులను నియమించనుందని చెప్పారు. కొత్త బస్సులు కొనుగోలు చేశామని, తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ‌గా మార్చామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Uttam: ఏపీ నీటి దోపిడీకి బీఆర్‌ఎస్‌ మద్దతు

72nd Miss World pageant: మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబు..

Harish Rao: డిగ్రీ పరీక్షలు చేపట్టకపోవడం ప్రభుత్వ అసమర్థత

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 05 , 2025 | 12:19 PM