TG GOVT: గుడ్ న్యూస్.. ఆ పోస్టుల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Aug 20 , 2025 | 07:26 PM
డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ అప్‌గ్రేడేషన్ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన మందులు, క్వాలిటీ ఫుడ్ అందించే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తోందని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఆగస్టు20 (ఆంధ్రజ్యోతి): త్వరలో మరిన్ని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను మంజూరు చేసి, రిక్రూట్ చేస్తామని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Rajanarasimha) ప్రకటించారు. ఈ పోస్టుల భర్తీతో తద్వారా డ్రగ్ కంట్రోల్ అథారిటీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులతో ఇవాళ(బుధవారం) రాష్ట్ర సచివాలయంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. 2024 - 2025లో డీసీఏ వర్క్ ప్రోగ్రెస్‌ను మంత్రికి డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం వివరించారు. 2024లో 25,939 తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన 4142 సంస్థలపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. 2025లో జనవరి నుంచి జూలై నెల వరకు 16,481 తనిఖీలు చేశామని, నిబంధనలు ఉల్లంఘించిన 2827 సంస్థలపై చర్యలు తీసుకున్నామని వివరించారు. 2024 జనవరి నుంచి 2025 జులై వరకు 7200 మందుల శాంపిల్స్‌ను పరిక్షించగా, అందులో 186 నాసిరకం (Not Standard Quality) మెడిసిన్లుగా తేలాయని, సంబంధిత సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని తెలిపారు.
దోషులకు శిక్ష పడేలా చర్యలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

సుమారు 700 కేసులు బుక్ చేశామని, ప్రతి కేసులోనూ దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. జనాలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తూ, మెడిసిన్ అమ్మకాలు జరుపుతున్న కంపెనీలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేశారు. స్పూరియస్, నాట్ స్టాండర్డ్ డ్రగ్స్ తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, అమ్మకదారులపై కఠినంగా వ్యవహారించాలని నిర్థేశించారు. మెడిసిన్ అనేది ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశమని, ఈ విషయంలో ఎలాంటి ఉపేక్ష పనికిరాదని హెచ్చరించారు. పదే పదే నిబంధనలు ఉల్లఘింస్తున్న సంస్థలను చట్టప్రకారం పర్మినెంట్‌గా మూసివేయాలని ఆదేశించారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.
ప్రజలకు నాణ్యమైన మందులు..
నకిలీ, నిషేధిత మందుల తయారీ, అమ్మకం దారులపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ దిశానిర్థేశం చేశారు. మెడిసిన్‌ను ఆహార పదార్థాలుగా చూపిస్తూ, వాటి తయారీ, అమ్మకాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని నిర్థేశించారు. యాంటిబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెద్ద ముప్పుగా పరిణమిస్తోందని, నిబంధనలు ఉల్లంఘించి యాంటిబయాటిక్స్ అమ్మకాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు ప్రేరేపిత మెడిసిన్ అమ్మకాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీసీఏ డీజీని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ అప్‌గ్రేడేషన్ పనుల్లో వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన మందులు, క్వాలిటీ ఫుడ్ అందించే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తోందని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్
హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి
Read latest Telangana News And Telugu News