Share News

Hyderabad: హైదరాబాద్‌లో స్వాతంత్య్రానికి ముందు నుంచి ఉన్న ఫేమస్ ఫుడ్ స్పాట్స్..

ABN , Publish Date - Aug 14 , 2025 | 04:20 PM

చూపు తిప్పుకోనివ్వని చారిత్రాత్మక కట్టడాలు, నోరూరించే ఆహారాలతో హైదరాబాద్ నగరం ప్రపంచ పర్యాటక ప్రియులను ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే, దశాబ్దాల చరిత్రకు తార్కాణంగా నిలిచే ఫేమస్ ఫుడ్ స్పాట్స్ కొన్ని ఇప్పటికీ ఆహార ప్రియులను ఊరిస్తూనే ఉన్నాయంటే నమ్ముతారా.. స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఉన్న..

Hyderabad: హైదరాబాద్‌లో స్వాతంత్య్రానికి ముందు నుంచి ఉన్న ఫేమస్ ఫుడ్ స్పాట్స్..
Pre-Independence Food Spots Hyderabad

హైదరాబాద్ సిటీలో గల్లీకో ఫేమస్ ఫుడ్ స్పాట్ ఉండొచ్చు. కానీ, నిజాం కాలం నుంచి ఆహార ప్రియులకు చేరువైన హోటల్స్, కెఫేలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. దశాబ్దాలు గడుస్తున్నా వాటి బ్రాండ్ విలువ పెరుగుతూ పోతుందే తప్ప తగ్గడం లేదంటే కచ్చితంగా ఆశ్చర్యపోక మానరు. 1947కి ముందు ప్రారంభమై.. ఇప్పటికీ అదే అభిరుచితో భాగ్యనగర వాసులకు సేవలందిస్తున్న రుచి రెస్టారెంట్లు, కేఫ్‌లు, బేకరీలు సజీవ మైలురాళ్లు. వాటిలోకి అడుగుపెడితే చరిత్రను స్వయంగా అనుభూతి చెందినట్లే అనిపిస్తుంది. భారత్ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో.. హైదరాబాదీలు సగర్వంగా చెప్పుకునేలా తమ రుచులతో అలరిస్తున్న ఫేమస్ ఫుట్ స్పాట్స్ విశేషాలు మీకోసం..


1. హమీదీ కన్ఫెక్షనర్స్

1913లో టర్కిష్ వలసదారుడు మహమ్మద్ హుస్సేన్ స్థాపించిన హమీదీ కన్ఫెక్షనర్స్ ప్రస్థానం.. మొదట ఓ సాధారణ వీధి బండి నుంచి మొదలైంది. అప్పుడు ప్రసిద్ధి చెందిన జౌజీ హల్వాను స్పెషల్ గా విక్రయించేవారు. ఈ రుచికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఎంతలా అంటే.. కొన్నాళ్లలోనే ఈ బండి రుచులు చివరి నిజాం వంటశాల వరకూ పాకాయి. ఆ తర్వాత జౌజీ హల్వా నిజాంకి ఇష్టమైన డెజర్ట్‌గా మారింది. ప్రత్యేక సందర్భాలలో దీన్ని ఆర్డర్ చేయించుకుని తినేవాడు. తర్వాత ఈ స్వీట్ షాపునకు ఆనాటి నిజాం తన స్నేహితుడు, టర్కిష్ రాజు సుల్తాన్ హమీద్ పేరును పెట్టాడు. శతాబ్దం తర్వాత కూడా హమీది ఇప్పటికీ ఈ సిగ్నేచర్ డిలైట్‌ను బాదం హల్వా, ఫిర్ని ఇతర సంప్రదాయ స్వీట్‌లతోపాటు అందిస్తోంది. వంటకాల రుచీ మారలేదు.


2. గ్రాండ్ హోటల్

1935లో 12మంది ఇరానియన్ వలసదారులు హైదరాబాద్ అబిడ్స్‌లో గ్రాండ్ హోటల్ ప్రారంభించారు. ప్రజలకు హైదరాబాదీ బిర్యానీని అందించిన మొట్టమొదటి హోటల్ ఇదే. సాధారణ ప్రజలకు ప్యాలెస్ స్థాయి రుచులను పరిచయం చేశారు. ప్రస్తుతం జలీల్ ఫరోఖ్ రూజ్ అదే కమ్మటి బిర్యానీని అందిస్తున్నారు. చికెన్/మటన్ బిర్యానీ, వీకెండ్స్ లో మటన్ నిహారీ, స్ట్రాంగ్ ఇరానీ చాయ్, బన్ మస్కా వంటకాలు ఈ హోటల్ ప్రత్యేక రుచులు. దశాబ్దాలుగా స్థానికులు, హైదరాబాదీ రుచులను కోరుకునే వారికీ ఇది ఒక బెస్ట్ డెస్టినేషన్ గా మారిపోయింది.


3. గార్డెన్ కేఫ్, సికింద్రాబాద్

రెండో ప్రపంచ యుద్ధం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో.. అంటే1941లో గార్డెన్ కేఫ్ ప్రారంభమైంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విద్యార్థులు, సైనికులు, స్థానికులకు ఇష్టమైన ప్రదేశంగా మారింది. ప్రఖ్యాత కళాకారుడు MF హుస్సేన్ తరచుగా ఇక్కడకు వచ్చేవాడు. చిత్రాలను గీస్తూ ఉండేవాడు. అయితే, మెట్రో లైన్ నిర్మాణ సమయంలో ఈ కేఫ్ తన స్థలాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఒక చిన్న బేకరీ తరహాలో కొనసాగుతోంది. అయినప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.


4. సుభాన్ బేకరీ

సుభాన్ బేకరీ 1948లో అధికారికంగా మొదలైంది. కానీ, స్వాతంత్ర్యానికి పూర్వం ఇది నాంపల్లిలోని ఓ చిన్న ఇంటి నుంచి మొదలైంది. ఇప్పుడు ఈ బేకరీకి నగరం అంతటా ఎన్నో ఫ్రాంచైజీలు నడుపుతూ హైదరాబాద్ లో ప్రధాన వ్యాపార సంస్థగా ఎదిగింది. ఉస్మానియా బిస్కెట్లు, ప్లం కేకులు, బ్రెడ్లకు ప్రసిద్ధి చెందిన ఈ బేకరీ నుంచే 1950లలో అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ అల్పాహారం కోసం బ్రెడ్‌ను తెప్పించుకునేవారు. ప్రతి ఉత్పత్తిని ఇప్పటికీ ఎంతో జాగ్రత్తగా తయారు చేస్తూ ముందు తరాల నుంచి ఒకే రుచిని ప్రజలకు అందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ జోస్యం

పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 14 , 2025 | 08:45 PM