Share News

KTR VS CM Revanth: వారిద్దరూ రాహుల్‌‌‌ని ఆటలో అరటిపండుగా మార్చారు: కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

ABN , Publish Date - Aug 25 , 2025 | 04:35 PM

పెద్ద మోదీ, చిన్న మోదీ ఒకే రకంగా ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇద్దరూ కలిసి రాహుల్‌కు పెద్ద షాక్‌ ఇవ్వటం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు.

KTR VS CM Revanth: వారిద్దరూ రాహుల్‌‌‌ని ఆటలో అరటిపండుగా మార్చారు: కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు
KTR VS CM Revanth Reddy

హైదరాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): బడే భాయ్‌, చోటే భాయ్‌ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi), సీఎం రేవంత్‌‌రెడ్డి (CM Revanth Reddy) కలిసి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌‌గాంధీని (Rahul Gandhi) ఆటలో అరటిపండుగా మార్చారని ఎద్దేవా చేశారు. ఇవాళ(సోమవారం) తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు.


పెద్ద మోదీ, చిన్న మోదీ (రేవంత్ రెడ్డి) ఒకే రకంగా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. ఇద్దరూ కలిసి రాహుల్‌కు పెద్ద షాక్‌ ఇవ్వటం ఖాయమని జోస్యం చెప్పారు. దేశంలో ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని మోదీ, తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలని సీఎం రేవంత్‌‌రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని ధ్వజమెత్తారు. పేదల ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామని మోదీ.. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని రేవంత్‌ చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఇద్దరూ కలిసి ఒక్క హామీని కూడా ఎందుకు అమలు చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నల వర్షం కురిపించారు.


కాంగ్రెస్, బీజేపీ తెలంగాణకు ద్రోహం చేశాయి...

‘ఉస్మానియాలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వం పునాది వేసిన భవనాలను ప్రారంభించారు. రేవంత్ రెడ్డి వికృత మాటలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. గత ముఖ్యమంత్రులతో పోల్చి చూస్తూ ప్రజలు రేవంత్ రెడ్డిని బండ బూతులు తిడుతున్నారు. రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారు. మా ప్రభుత్వం నిర్మించిన భవనాలకు రిబ్బన్ కట్ చేయడానికి తాపత్రయ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ. రెండూ దొందూ దొందే. పెట్టుబడులు, పరిశ్రమలు, విభజన హామీలు - అన్నింటిలోనూ బీజేపీ తెలంగాణకు మోసం చేసింది’ అని ధ్వజమెత్తారు మాజీ మంత్రి కేటీఆర్.


రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు..

‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్నికల హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తోంది. 20 నెలల కాంగ్రెస్ పాలన నచ్చకుంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులు ఈ ప్రభుత్వం చేయించడం లేదు. మోదీ, చంద్రబాబు ఆదేశాల మేరకు గోదావరి నీళ్లను దిగువకు పంపించేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు. గోదావరి నీళ్లు బకనకచెర్ల ప్రాజెక్టుకు, అక్కడి నుంచి తమిళనాడుకు వెళ్లాలని బీజేపీ ప్రభుత్వం రేవంత్‌కు ఆదేశాలిచ్చింది. అందుకే రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పగ పట్టారు. మోదీకి, రేవంత్‌కి అనేక పోలికలు ఉన్నాయి. కాంగ్రెస్ పాలన వల్లే తెలంగాణలో యూరియా సంక్షోభం వచ్చింది. ఒకవైపు యూరియా సంక్షోభం ఉంటే, రేవంత్ రెడ్డి సినిమా వాళ్లతో మీటింగ్ పెట్టుకున్నారు. రేవంత్‌పై మాట పడకుండా బీజేపీ కాపాడుతోంది’ అని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం

యాచారంలో భూదాన్ భూముల అన్యాక్రాంతంపై సీఎం సీరియస్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 25 , 2025 | 05:37 PM