KTR: కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ సంచలన లేఖ.. అసలు కారణమిదే..
ABN , Publish Date - Aug 19 , 2025 | 06:51 PM
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం బుధవారం జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బహిరంగ లేఖ రాశారు. జీఎస్టీ స్లాబ్ రద్దు లేదా మార్పు అంటూ కేంద్రం గత వారం రోజులుగా ప్రచారం చేసుకుంటుందని చెప్పుకొచ్చారు. వీటి ద్వారానే ప్రజల జీవితాల్లో నిజమైన దీపావళి వస్తుంది అంటూ ప్రాపగాండ చేస్తుందని విమర్శించారు.
హైదరాబాద్, ఆగస్టు19 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ కౌన్సిల్ సమావేశం రేపు (బుధవారం) జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి (Central Government) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఇవాళ(మంగళవారం) బహిరంగ లేఖ రాశారు. జీఎస్టీ స్లాబ్ రద్దు లేదా మార్పు అంటూ కేంద్రం గత వారం రోజులుగా ప్రచారం చేసుకుంటుందని చెప్పుకొచ్చారు. వీటి ద్వారానే ప్రజల జీవితాల్లో నిజమైన దీపావళి వస్తుంది అంటూ ప్రాపగాండ చేస్తోందని విమర్శించారు. గత పుష్కరకాలంగా లక్షల కోట్ల రూపాయలు పెంచిన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ రేట్ల రూపంలో ప్రజల నుంచి దోచుకుందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి కేటీఆర్.
ఒకవైపు ప్రతినెల వేలాది రూపాయలు పెట్రోల్, ఎల్పీజీ, డీజిల్ రూపంలో భారం మోపుతూ… జీఎస్టీ స్లాబ్ మార్పుతో కేవలం పదుల రూపాయల భారం తగ్గిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ధరల తగ్గింపుపైన చిత్తశుద్ధి ఉంటే దానికి ప్రాథమిక కారణమైన పెట్రో ధరలను తగ్గించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ తగ్గితే రవాణా భారం తగ్గి దాదాపు అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయని వివరించారు మాజీ మంత్రి కేటీఆర్.
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపైన పన్నులు తగ్గించి.. సెస్సులను పూర్తిగా ఎత్తివేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని.. లేకపోతే మీ మాటలు అసత్యాలుగానే మిగిలిపోతాయని విమర్శించారు. చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని సూచించారు. విద్యకు సంబంధిత ఫీజులపై విధించే జీఎస్టీని పూర్తిగా తొలగించాలని కోరారు. క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందులు, ప్రాణాలు కాపాడే జీవనావశ్యక ఔషధాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ.. సీఎం రేవంత్ ఫైర్
For More Telangana News and Telugu News..