Khazana Robbery Case: ఖజానా జ్యువెలర్స్ దోపిడీ మిస్టరీకి తెరదించిన పోలీసులు.. బిహార్ గ్యాంగ్ అరెస్ట్..
ABN , Publish Date - Aug 16 , 2025 | 05:54 PM
హైదరాబాద్ చందానగర్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసు మిస్టరీ వీడింది. దొంగతనానికి పాల్పడిన బిహార్ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Khazana Robbery Case Cracked: హైదరాబాద్ చందానగర్‌లో జరిగిన ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో సంబంధమున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నాటు తుపాకులు, బులెట్లు, గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 7గురు నిందితులు ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 12న చందానగర్ ఖజానా జ్యువెలరీలో దోపిడీకి పాల్పడిన ముఠాలో ముఖ్య నిందితులు దీపక్, ఆశిష్‌లను పుణెలో పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను గుర్తించగా.. వీరంతా బీహార్‌కు చెందిన సివాన్ గ్యాంగ్, సారక్ గ్యాంగ్ అని ఆయన పేర్కొన్నారు. ఈ ముఠా ఇరవై రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి సుమారు 10 నగల దుకాణాల్లో రెక్కీ నిర్వహించింది. ఖజానాలో వందల కోట్ల రూపాయల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించిన గ్యాంగ్ రెక్కీ చేసి రూట్ మ్యాప్ ని కూడా ట్రయల్ వేసుకుంది. హైదరాబాద్ నుంచి బీదర్ వరకు వాహనాల్లో ఆటోల్లో బస్సుల్లో వెళ్లి రెక్కీ పూర్తి చేసింది. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా సెల్ ఫోన్లు వాడొద్దని రూల్ పెట్టుకుని మరీ దోపిడీకి పాల్పడింది. చోరీ చేసిన నిమిషాల్లోనే సిటీ దాటారు. దోచుకున్న ఆభరణాలను నాలుగు భాగాలు చేసుకొని ముఠా సభ్యులు తలో దారిన పారిపోయారు. బిహార్లో 5వేల రూపాయల చొప్పున తుపాకుల కొన్న ఈ గ్యాంగ్..దోపిడీ చేసే టైంలో అడ్డం వస్తే కాల్చి వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ అరెస్ట్‌లతో కేసు ఛేదనలో ముందడుగు పడిందని.. మిగిలిన నిందితుల పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
ఆగస్టు 12న చందానగర్‌లో ఖజానా జ్యువెలరీలో భారీగా చోరీ జరిగింది. ఈ దోపిడీలో మొత్తం ఏడుగురు వ్యక్తులు పాల్గొన్నారు. నిందితులు భద్రతా సిబ్బంది తక్కువగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుని బైకులపై వచ్చారు. షాపులోకి చొరబడి స్టాఫ్‌ను తుపాకులతో బెదిరించారు. కీ ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్‌పై కాల్పులు జరిపారు. ఆయన కాలికి గాయమైంది. తర్వాత దుండగులు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి స్టాల్స్‌ను విరగొట్టారు. పోలీసుల రాకముందే సుమారు 10 కిలోల వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను చోరీ చేసి అదే బైకులపై పారిపోయారు. నకిలీ నంబర్ ప్లేట్లు ఉన్న బైకులు వినియోగించడం, మొబైల్స్ వాడకుండా ఉండటంతో పోలీసులు వెంటనే గుర్తించలేకపోయారు. 10 ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టి ఇద్దరు ప్రధాన నిందితులను పూణేలో అరెస్ట్ చేశారు. గతంలో ఈ ముఠాలకు కోల్‌కతా, బీహార్, కర్ణాటకలో దోపిడీలకు పాల్పడిన చరిత్ర ఉంది. హైదరాబాద్‌లో ఇదే తొలి దొంగతనం. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఈ భారీ దోపీడీకి స్కెచ్ వేశారు. ఈ ఘటనతో ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వ్యక్తులను పనిలో చేర్చుకునేటప్పుడు యజమానులు వారి నేపథ్యం పరిశీలించాలని డీసీపీ వినీత్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రోడ్ల డ్యామేజీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష..
మరికాసేపట్లో భారీ వర్షం.. బయటకు రావొద్దన్న అధికారులు
Read Latest Telangana News and National News