Share News

Sam Altman-Google: నేను గూగుల్‌ను చివరిసారిగా ఎప్పుడు వాడానో గుర్తు కూడా లేదు: ఓపెన్ ఏఐ సీఈఓ

ABN , Publish Date - Aug 16 , 2025 | 05:10 PM

తాను గూగుల్ సెర్చ్‌ను వాడి చాలా కాలం అయ్యిందని ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తెలిపారు. చివరిసారి గూగుల్ సెర్చ్‌ను ఎప్పుడు వాడిందీ తనకు గుర్తు లేదని తెలిపారు. సెర్చ్ ఇంజన్ భవిష్యత్తు ఏఐ సాంకేతికతదే అని కూడా ఆయన స్పష్టం చేశారు.

Sam Altman-Google: నేను గూగుల్‌ను చివరిసారిగా ఎప్పుడు వాడానో గుర్తు కూడా లేదు: ఓపెన్ ఏఐ సీఈఓ
Sam Altman Google Search Replacement

ఇంటర్నెట్ డెస్క్: తాను గూగుల్ సెర్చ్ వాడటం మానేసి చాలా కాలమే అయ్యిందని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తాజాగా పేర్కొన్నారు. తాను చివరి సారిగా గూగుల్‌ను ఎప్పుడు వాడిందీ కూడా గుర్తు లేదని చెప్పారు. ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్‌జీపీటీ-5 జనాల ఆదరణతో దూసుకుపోతున్న నేపథ్యం శామ్ ఈ కామెంట్స్ చేశారు.

చాట్‌జీపీటీ వీక్లీ యూజర్ల సంఖ్య ఇటీవలే 700 మిలియన్‌లకు చేరుకుంది. రెండు దశాబ్దాలుగా సెర్చ్ ఇంజెన్ మార్కెట్‌పై గూగుల్‌కు ఉన్న ఆధిపత్యాన్ని సవాలు చేసే దశలో చాట్‌జీపీటీ ఉంది. సెర్చ్ ఇంజెన్ మార్కెట్ విలువ 175 బిలియన్ డాలర్లు. దీంతో, ఓపెన్ ఏఐ, చాట్‌జీపీటీలపై అందరి దృష్టి నెలకొంది.

టెక్ రంగంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయని శామ్ ఆల్ట్‌మన్ వ్యాఖ్యానించారు. చాట్‌జీపీటీ ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద వెబ్‌సైట్ అని అన్నారు. యూజర్లతో చాట్‌జీపీటీ రోజూ బిలియన్‌ల కొద్దీ సంభాషణలు జరుపుతోందని, తమ సందేహాలు తీర్చుకునేందుకు జనాలు గూగుల్ సెర్చ్ నుంచి క్రమంగా ఏఐ ఆధారిత మోడల్స్ వైపు మళ్లుతున్నారని తెలిపారు.


సంప్రదాయిక సెర్చ్ విధానాలకు తెరపడుతున్నట్టేనా..

చాట్‌జీపీటీ-5 కొత్త మోడల్ లాంచ్ చేశాక చాట్‌జీపీటీ ఏపీఐకి ట్రాఫిక్ ఏకంగా రెండింతలైంది. ట్రాఫిక్ పెరగడంతో జీపీయూ కొరత కూడా ఎక్కువవుతోందంటే డిమాండ్ ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయిక సెర్చ సాధనాల్లో ఇంతటి డిమాండ్ ఎప్పుడూ చూడలేదని కూడా అంటున్నారు.

వెబ్‌ర్యాకింగ్స్‌లో చాట్‌జీపీటీ త్వరలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను అధిగమిస్తుందని సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, గూగుల్‌ను అధిగమించడం మాత్రం పెను సవాలని అన్నారు. అయితే, ఓపెన్ ఏఐ ఇప్పటికే డాటా సెంటర్ల ఏర్పాటుపై ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యింది. తద్వారా గూగుల్‌ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు పరోక్షంగా తేల్చి చెప్పింది.

ఏఐ ఆధారిత సెర్చ్ మార్కెట్‌తో అనేక సవాళ్లు కూడా ఉన్నాయని శామ్ ఆల్ట్‌మన్ అంగీకరించారు. వెబ్‌సైట్ సందర్శించే వారి సంఖ్య తగ్గే క్రమంలో డిజిటల్ పబ్లిషర్లు, కంటెంట్ క్రియేటర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారని అన్నారు. అదే సమయంలో, జనాలు మెచ్చేలా మనుషులు రూపొందించే కంటెంట్‌కు భారీగా డిమాండ్ పెరుగుతుందని చెప్పారు.


ఇవి కూడా చదవండి:
చాట్‌జీపీటీ-5పై విమర్శలు.. అది పెద్ద తప్పేనన్న సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్

చాట్‌జీపీటీలో స్టడీ మోడ్ ఫీచర్.. స్టూడెంట్స్‌కు బంపర్ ఆఫర్

Read Latest and Technology News

Updated Date - Aug 16 , 2025 | 05:26 PM