GST Reforms: గుడ్ న్యూస్.. వీటి ధరలు భారీగా తగ్గనున్నాయ్..
ABN , Publish Date - Aug 16 , 2025 | 05:07 PM
దేశంలో దీపావళికి ‘జీఎస్టీ’ పండగ రానుందని.. ఆ రోజున గొప్ప బహుమతి ఇవ్వబోతున్నామంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన.. ఇప్పుడు యావత్ దేశాన్ని ఆకట్టుకుంటోంది. జీఎస్టీలో భారీ సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చేసిన ప్రకటన..
న్యూఢిల్లీ, ఆగస్టు 16: దేశంలో దీపావళికి ‘జీఎస్టీ’ పండగ రానుందని.. ఆ రోజున గొప్ప బహుమతి ఇవ్వబోతున్నామంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన.. ఇప్పుడు యావత్ దేశాన్ని ఆకట్టుకుంటోంది. జీఎస్టీలో భారీ సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చేసిన ప్రకటన.. ప్రజలందరిలో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. కారణం.. ప్రధాని చేసిన ప్రకటన అమల్లోకి వస్తే.. సాధారణ ప్రజలు వినియోగించే నిత్యావసరాల ధరలు భారీగా తగ్గనున్నాయి. పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సైతం ఊతమిచ్చినట్లు అవుతుంది. అందుకే.. దేవ ప్రజలంతా ఎంతో ఆశతో ఉన్నారు.
వాస్తవానికి ప్రస్తుతం 5, 12, 18, 28 శాతంతో నాలుగు రకాల జీఎస్టీ శ్లాబ్‌లు ఉన్నాయి. వీటిలో 12 శాతం, 28 శాతం శ్లాబ్‌లను తొలగించి.. 5, 18 శ్లాబ్‌లలో సర్దుబాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో వెల్లడించారు. ఈ ప్రసంగం తరువాత కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర ఆర్థిక శాఖ ఏం చెప్పిందంటే..
ప్రధాని ప్రసంగం తరువాత కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏయే పన్ను రేట్లు ఉంటాయన్నది డైరెక్ట్‌గా వెల్లడించకుండా.. సాధారణ, మెరిట్ శ్లాబులు, కొన్నిరకాల వస్తువులపై ప్రత్యేక పన్నురేట్లను ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. జీఎస్టీలో నిర్మాణాత్మక మార్పులు, పన్నురేట్ల హేతుబద్ధీకరణ, పన్నులు-రీఫండ్స్ విధానాలను సులభతరం చేసే లక్ష్యంతో ఈ సంస్కరణలు చేపట్టినట్లు కేంద్రం పేర్కొంది. మరి ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనల ప్రకారం.. వేటి ధర తగ్గనుంది.. వేటి ధర పెరగనుంది.. పూర్తి వివరాలు ఇవే.
ధరలు తగ్గేవి..
ప్యాకేజ్ చేసిన పాలు, బటర్, పనీర్, నెయ్యి, పళ్లరసాలు, బాదాం ఇతర డ్రైఫ్రూట్స్, పచ్చళ్లు, జామ్, సబ్బులు, టూత్‌పేస్టులు, హెయిర్ ఆయిల్, గొడుగులు, ప్రాసెస్ చేసిన ఆహారం, కుట్టు మిషన్లు, సాధారణ వాటర్ ఫిల్టర్లు (ఎలక్ట్రిక్ కానివి), అల్యూమినియం, స్టీలు పాత్రలు, కుక్కర్లు, ఇస్త్రీపెట్టెలు, గీజర్లు, చిన్న వాక్యూమ్ క్లీనర్లు, రూ.1000 కన్నా ఖరీదైన రెడీమేడ్ వస్త్రాలు, రూ.1000 ధరలోపు పాదరక్షలు, రబ్బర్ బ్యాండ్‌లు, హ్యాండ్ బ్యాగులు, వైద్య పరీక్షల కిట్లు, సైకిళ్లు, వ్యవసాయ యంత్రాల ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే.. ఆరోగ్యం, బీమా పాలసీల ప్రీమియం కూడా భారీగా తగ్గనుంది. సిమెంటు, రెడీమిక్స్ కాంక్రీట్, ఏసీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లు, 32 అంగుళాలకుపైన ఉన్న ఎల్‌ఈడీ టీవీలు, ప్రింటర్లు, రేజర్లు, వాణిజ్యపరమైన ప్లాస్టిక్ ఉత్పత్తులు, కార్లు, ఖరీదైన ద్విచక్రవాహనాల ధరలు తగ్గనున్నాయి.
ధరలు పెరిగేవి..
ఖరీదైన రెడీమేడ్ దుస్తులు, వాచీలు, బూట్లు, కూల్ డ్రింకులు, ఖరీదైన కార్లు, వజ్రాలు, ఇతర రత్నాలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు, మధ్యస్థాయి లాడ్జీలు, హోటళ్లలో గదుల అద్దె వంటి వాటి ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Also Read:
సిద్ధార్థ్ రెడ్డిపై అఖిల ప్రియ సెటైర్లు..
వైఎస్ భారతిపై మాజీ మంత్రి సుజాత కీలక వ్యాఖ్యలు..
For More Business News and Telugu News..