Former Minister Pitala Sujatha: వైఎస్ భారతి కూడా ఫ్రీ బస్సులో ప్రయాణించవచ్చు.. మాజీమంత్రి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:51 PM
మహిళలకు అవకాశాలు కల్పిస్తే ఏదైనా చేస్తారని, అద్భుతాలు సృష్టిస్తారని పీతల సుజాత ధీమా వ్యక్తం చేశారు. మహిళల కోసం స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు రాష్ట్ర మహిళల తరఫున ఆమె ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి: ఆడబిడ్డలను వృద్ధిలోకి తీసుకురావాలన్న సిద్ధాంతమే తెలుగుదేశం పార్టీ విధానమని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఛైర్ పర్సన్, మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ మహిళల హక్కుల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు డ్వాక్రా అనే విత్తనం వేసి.. నేడు కోటి మంది మహిళలు వాళ్ల కుటుంబాలకు ఆసరగా నిలిచేలా చేశారని ఆమె కొనియాడారు.
మహిళలకు అవకాశాలు కల్పిస్తే ఏదైనా చేస్తారని, అద్భుతాలు సృష్టిస్తారని పీతల సుజాత ధీమా వ్యక్తం చేశారు. మహిళల కోసం స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు రాష్ట్ర మహిళల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి మహిళలకు ఇచ్చిన కానుక స్త్రీ శక్తి పథకమని పేర్కొన్నారు. రాఖీ పండుగలా ఈ స్త్రీ శక్తి పథకాన్ని కూడా మహిళలంతా చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల కోసం ఇలాంటి మంచి పథకాన్ని ప్రవేశపెడితే వైసీపీ పేటీఎం బ్యాచ్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీ శక్తి పథకంపై విమర్శలు చేయడం వైసీపీ నాయకుల దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు.
వైఎస్ భారతి కూడా జీరో ఛార్జీతో పులివెందుల నుంచి అమరావతికి రావొచ్చని సుజాత చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం అందజేశామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పి.. ఒక్కరికే పరిమితం చేశారని ఆరోపించారు. అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణం, రహదారుల విస్తరణ వంటి అనేక కార్యక్రమాలను వేల కోట్లతో చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాబోయే నాలుగేళ్లలో మరిన్ని పథకాలను అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తామని సుజాత స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వరద పోటుకు దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్ట్ ఎగువ కాఫర్ డ్యాం సీపేజ్