AP Terrorist Arrest: 30 ఏళ్లుగా ఏపీలో ఉగ్రవాదులు.. అరెస్ట్ చేసిన ఐబీ అధికారులు
ABN , Publish Date - Aug 16 , 2025 | 04:37 PM
ధర్మవరంలో నూర్ మహమ్మద్ షేక్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మహమ్మద్‌కు పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) గుర్తించింది.
సత్యసాయి: జిల్లా కేంద్రంలో ఉగ్ర కదలికలతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అయితే.. ఇప్పటికే ఉగ్రవాది నూర్ మహమ్మద్ షేక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఏపీలో ఉగ్ర కదలికలపై నిఘావర్గాలు, ఏపీ పోలీసులు ఫోకస్ పెట్టారు.
ఇంకా ఉగ్రవాదులు ఉన్నారు..
ధర్మవరంలో నూర్ మహమ్మద్ షేక్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మహమ్మద్‌కు పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) గుర్తించింది. భారతదేశంలో నిషేధించిన ఉగ్రవాద సంస్థలకు చెందిన వాట్సప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్లు ఐబీ అధికారులు పేర్కొన్నారు. ముస్లిం యువతను అతడు ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్ కాల్స్ ద్వారా పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్, ఇతరులతో మాట్లాడినట్టు వివరించారు. అలాగే.. ఏపీలో ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సీమీ) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న స్టూడెంట్స్‌ను గుర్తించినట్లు అధికారులు చెప్పారు.
ఏసీ మెకానిక్‌లుగా ఉగ్రవాదులు..
ఏప్రిల్ 25న పది మంది అనుమానితులను నిఘా వర్గాలు గుర్తించాయని ఐబీ అధికారులు తెలిపారు. విజయవాడలో నలుగురు.. శివారు ప్రాంతాల్లో మరో ఆరుగురిని గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. ఏసీ మెకానిక్లుగా, మసీదుల దగ్గర భిక్షాటన, బడ్డీకొట్లలో పనులు చేస్తూ.. సీమీకి పని చేస్తున్నారని పేర్కొన్నారు. జులై 2న అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు గుర్తు చేశారు. 30 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలోనే మకాం వేసి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించినట్లు చెప్పుకొచ్చారు.
తెరవెనక కుట్రలు..
రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో ఇళ్లు అద్దెకు తీసుకుని చీరల వ్యాపారం చేసుకుంటున్న సోదరులు అబూబకర్ సిద్ధిఖీ, మహమ్మద్ అలీ తెరవెనక భారీ బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు ఐబీ అధికారులు వెల్లడించారు. 2011లో బీజేపీ అగ్రనేత ఎల్కే ఆడ్వాణీ రథయాత్ర సందర్భంగా మధురైలో బాంబులు పేల్చడానికి కుట్ర చేశారని పేర్కొన్నారు. 1995లో చెన్నైలోని చింతాద్రిపేట హిందూ మున్నాని కార్యాలయంపై బాంబు దాడి కేసులోనూ ఇద్దరు సోదరులు నిందితులుగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. అదే ఏడాది పార్సిల్ బాంబు పేల్చిన కేసులోనూ.. 1999లో చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూర్, కేరళ ప్రాంతాల్లో వరసగా ఏడు చోట్ల బాంబు పేలుళ్లు జరిపిన ఘటనలో వీరిద్దరూ ప్రధాన నిందితులను తెలిపారు.
నిఘా పెంచిన ఏపీ పోలీసులు...
మే 18న విజయనగరంలో ఉగ్ర కుట్రలను ఏపీ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న సిరాజ్, సమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఉగ్ర కార్యకలాపాలపై ఏపీ పోలీసులు , NIA సంయుక్తంగా విచారణ చేపట్టింది. విజయనగరం, హైదరాబాద్, బెంగుళూరు, తమిళనాడులో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు గుర్తించినట్లు చెప్పారు. అహీం అనే సంస్థతో ఉగ్ర కార్యకలాపాల విస్తృతికి సిరాజ్, సమీర్ స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేశారని దర్యాప్తు బృందాలు గుర్తించినట్లు పేర్కొన్నారు. ముస్లిం మహిళలను వివాహం చేసుకున్న ఇతర మతస్తులను హతమార్చాలి అన్నది సిరాజ్ పథకంలో ఓ భాగమని నిర్ధారణలో తేలిందని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదం వైపు యువతను మళ్లేంచేందుకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశారని ఐబీ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
13 వ రోజుకు టాలీవుడ్ షూటింగ్స్ బంద్, నేడు ఫిల్మ్ ఛాంబర్లో మరో దఫా చర్చలు