Harish Rao Fires ON Congress: మాగంటి సునీతని అవమానిస్తారా.. మంత్రులపై హరీశ్‌రావు ధ్వజం
ABN , Publish Date - Oct 15 , 2025 | 03:15 PM
తెలంగాణకి కాంగ్రెస్, బీజేపీలు ద్రోహం చేశాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ బిహార్‌లో ఓటు చోరీ అంటున్నారని... జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మాత్రం ఓటు చోరీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): భర్తను కోల్పోయి దుఖంలో ఉన్న ఆడబిడ్డను అవమానించే విధంగా కాంగ్రెస్ (Congress) మంత్రులు మాట్లాడటం దుర్మార్గమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో మాగంటి గోపీనాథ్ గెలిచారని తెలిపారు. దురదృష్టవశాత్తూ గోపీనాథ్ (Maganti Gopinath) చనిపోయారని... ఆ కుటుంబాన్ని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills Bye Election)లో గెలిపించాలని కోరారు. మాగంటి గోపీనాథ్‌కి పెళ్లికాని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని పేర్కొన్నారు హరీశ్‌రావు.
చిల్లర రాజకీయాలు చేస్తున్నారు..
భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎంతో దుఖంలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో కాంగ్రెస్ మంత్రులు మాగంటి సునీత (Maganti Sunitha)ని అవమానించే విధంగా నానా మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విజ్ఞత మరిచి, విచక్షణ లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు విజ్ఞులని.. మంచి, చెడులని ఆలోచిస్తారని తెలిపారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపించాలని కోరారు హరీశ్‌రావు.
ఇవాళ (బుధవారం) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ (BJP) నుంచి బీఆర్ఎస్ (BRS)లోకి నేతలు భారీగా చేరారు. హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయకులు, కార్యకర్తలకి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఒక ఆడబిడ్డను ఆశీర్వదించాలనే పలువురు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీ ఏం చేసింది అనేది ఒకసారి ప్రజలు ఆలోచించాలని సూచించారు. తెలంగాణ (Telangana)కి కాంగ్రెస్, బీజేపీ ద్రోహం చేశాయని విమర్శించారు హరీశ్‌రావు.
పేదల ఇళ్లు కూలగొడుతున్నారు..
కాంగ్రెస్, బీజేపీలు చెప్పేదొకటి, చేసేదొకటని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) మొహబ్బత్‌కి దుకాణ్ అని అంటారని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటారని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోంది ఏమిటి..?.. హైడ్రా (Hydra) పేరిట పేదవారి ఇళ్లు కూలగొట్టడం మొహబ్బత్ దుకాణ్ ఆ..? అని ప్రశ్నించారు. బడా బాబుల ఇళ్లు ఎందుకు కూలగొట్టడం లేదని నిలదీశారు. గరీబోళ్ల ఇల్లు కూలగొట్టి వేల కుటుంబాలను రోడ్డుమీదకి సీఎం రేవంత్‌రెడ్డి తెచ్చారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డిని రాహుల్ గాంధీ ఎందుకు ప్రశ్నించడం లేదు..? అని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ బిహార్‌లో ఓటు చోరీ అంటున్నారని... జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మాత్రం ఓటు చోరీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో రేవంత్‌రెడ్డి ఓటు చోరీ చేయకుండా నిజాయితీగా ఉండాలని చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీకి లేదా అని ప్రశ్నించారు హరీశ్‌రావు.
కాంగ్రెస్ దొంగ ఓట్లని కూడగట్టింది
‘జూబ్లీహిల్స్‌లో భర్తను కోల్పోయిన సునీతని ఒడగొట్టాలని.. 20 వేల దొంగ ఓట్లను కాంగ్రెస్ కూడగట్టింది. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని అన్నారు. ప్రతి అక్కకు, చెల్లెకు కాంగ్రెస్ రూ.55,000 బాకీ పడింది. జూబ్లీహిల్స్‌లో మహిళలకు ఒక్కొక్కరికీ రూ.55,000 ఇచ్చి రేవంత్‌రెడ్డి సర్కార్ ఓటు అడగాలి. వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇస్తా అన్నారని.. ఇవ్వకుండా మోసం చేశారు. ఒక అవ్వకు, తాతకు రూ.44,000 రేవంత్‌రెడ్డి బాకీపడ్డారు. రేవంత్‌రెడ్డి చేసిందేముంది.. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టుడు తప్పా. కేసీఆర్ ప్రతి బస్తీకి బస్తీ దవాఖాన పెట్టారు. హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానాలని కేసీఆర్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాల్లో రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం మందులు ఇవ్వలేని పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో గర్భిణులు డెలివరీకి పోతే ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటోలో ఇంటికాడ దిగబెట్టాం. రేవంత్‌రెడ్డి సర్కార్‌లో బతుకమ్మ చీరలు, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు ఇవ్వట్లేదు. కేసీఆర్ హయాంలో 20,000 లీటర్ల నీళ్లు ఉచితంగా ఇస్తే.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి నల్లా బిల్లు వసూలు చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో గరీబోళ్లకి నీళ్లు ఉచితంగా ఇచ్చాం. భాగ్యనగరంలో నల్లా సమస్యలు పెరిగాయి. అధికారులు నల్లా బిల్లులు వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ని జూబ్లీహిల్స్ ఎన్నికలో ఓడిస్తేనే బుద్ధి వస్తుంది’ అని హరీశ్‌రావు విమర్శించారు.
బనకచర్ల ప్రాజెక్టుకి బీజేపీ మద్దతు..
‘తెలంగాణలో ఆరు గ్యారెంటీలని 100 రోజుల్లో అమలు చేస్తామని సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీతో చెప్పించారు. ఇప్పుడు ఆరు గ్యారెంటీలని పూర్తిగా అమలు చేయడం లేదు. చదువుకున్న పిల్లలని, అవ్వ తాతలని, నిరుద్యోగులను, మహిళలను కాంగ్రెస్ మోసం చేసింది. జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ రావడమే కష్టం. భర్తను కోల్పోయిన ఆడబిడ్డను మీరందరూ దీవించాలి. బీజేపీ సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటుంది. కానీ గోదావరి పుష్కరాలకు.. ఆంధ్రప్రదేశ్‌కి రూ.100కోట్లు ఇచ్చి తెలంగాణకు గుండు సున్నా ఇచ్చింది. ఇది సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ ఎలా అవుతోంది..?. తెలంగాణ నీటిని దోపిడీ చేసే బనకచర్ల ప్రాజెక్టుకి బీజేపీ ప్రభుత్వం మద్దతిస్తోంది. అనుమతులు ఇస్తోంది. తెలంగాణకు ఏమి ఇస్తున్నారో బీజేపీ నాయకులు చెప్పాలి. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ప్రకటిస్తే ఒక్క మెడికల్ కాలేజీని కూడా తెలంగాణకు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌కి బడ్జెట్‌లో ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిన.. తెలంగాణకు పది పైసలు కూడా మోదీ ప్రభుత్వం ఇవ్వలేదు’ అని ధ్వజమెత్తారు హరీశ్‌రావు.
తెలంగాణకు బీజేపీ అన్యాయం..
‘తెలంగాణలో బీజేపీకి 8 ఎంపీలను గెలిపిస్తే.. రాష్ట్రానికి మీరు చేసిన మంచి ఇదేనా. గోధుమలకు రూ.2,585, వడ్లకు రూ.2,369 ఇస్తున్నారని... గోధుమలకు ఓ నీతి వడ్లకు మరో నీతి ఉంటుందా..?. ఉత్తర భారతదేశంలో అయినా తెలంగాణలో అయినా రైతు రైతే. 2014లో బీజేపీ అధికారంలో వచ్చిన నాడు గోధుమలకు, వడ్లకు రూ.1400 మద్దతు ధర ఉండేది. గోధుమలకు మద్దతు ధర పెంచి వడ్లకు పెంచకపోవడం తెలంగాణ రైతులకు అన్యాయం చేయడమే. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటే గోధుమలు పండించే రైతైనా వడ్లు పండించే రైతైనా రైతే. వడ్లు పండించడం తెలంగాణ రైతులకు శాపమా. ఇలా అన్ని విషయాల్లో బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తోంది. తెలంగాణ గొంతు నొక్కడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. ఆడపిల్ల పెళ్లికి కల్యాణలక్ష్మి, గర్భిణులకి కేసీఆర్ కిట్టు ఇచ్చాం. రూ.2000ల పెన్షన్ ఇచ్చి అవ్వాతాతల గౌరవం పెంచాం. షీ టీమ్స్‌తో ఆడపిల్లల భద్రత పెంచాం. కాంగ్రెస్‌వి మొసలి కన్నీళ్లు, ఆపద మొక్కులు తప్పా ప్రజల సంక్షేమం పట్టదు. కాంగ్రెస్‌కి నిజాయితీ ఉంటే బాకీ కార్డు పంపిస్తాం. మీరు పడ్డ బాకీని చెల్లించి జూబ్లీహిల్స్‌లో ఓటు అడగాలి’ అని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రుల మధ్య వివాదాలు లేవు: శ్రీధర్ బాబు
బీసీల వాదన వినకుండా కోర్టు ఏకపక్షంగా స్టే ఇచ్చింది: ఆర్.కృష్ణయ్య
Read Latest Telangana News And Telugu News