Share News

CM Revanth On Assembly: అసెంబ్లీలో కాళేశ్వరం రచ్చ.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 31 , 2025 | 10:31 AM

కాళేశ్వరం డిజైన్‌, నిర్మాణ నాణ్యతలో లోపాలున్నాయని రిపోర్టులో వెలువడిందని సీఎం రేవంత్ తెలిపారు. అన్నారం బ్యారేజ్‌లో మట్టి అంచనాలు తప్పుగా ఉన్నాయని పేర్కొన్నారు. పనుల పర్యవేక్షణలో కూడా లోపాలున్నాయని విమర్శించారు.

CM Revanth On Assembly: అసెంబ్లీలో కాళేశ్వరం రచ్చ.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ(ఆదివారం) అసెంబ్లీలో జరుగుతున్న కాళేశ్వరం నివేదిక చర్చలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ది కల్వకుంట్ల కుటుంబం కాదు కలవకుండా చూసే కుటుంబం అని ఆరోపించారు. సరైన ప్రణాళిక లేకుండా మేడిగడ్డ నిర్మాణం చేపట్టారని తెలిపారు. 3 ప్రాజెక్టుల ప్రణాళిక, నిర్మాణంలో పూర్తి లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాళేశ్వరంలో తప్పిదాలున్నాయని నిపుణుల కమిటీ సూచలను కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. భూగర్భ పరిస్థితులు దృష్టిలో పెట్టుకోలేదని నివేదికలో ఉందని స్పష్టం చేశారు.


కాళేశ్వరం కాంట్రాక్టర్ల లబ్ధికే..

కాళేశ్వరం డిజైన్‌, నిర్మాణ నాణ్యతలో లోపాలున్నాయని రిపోర్టులో వెలువడిందని సీఎం రేవంత్ తెలిపారు. అన్నారం బ్యారేజ్‌లో మట్టి అంచనాలు తప్పుగా ఉన్నాయని పేర్కొన్నారు. పనుల పర్యవేక్షణలో కూడా లోపాలున్నాయని విమర్శించారు. ప్రాజెక్టు CWC అనుమతుల్లోనూ లోపాలున్నట్లు పీసీ ఘోష్‌ నివేదిక చెబుతున్నట్లు చెప్పుకొచ్చారు. కాంట్రాక్టర్ల లబ్ధికే అంచనాల పెంపు నిబంధనలు సడలించారని విమర్శించారు. ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చాలన్న దురుద్దేశంతో అంచనాలు సవరించారని ఆరోపించారు. అంచనాలు సవరించి ఖజానాకు నష్టం చేకూర్చారని నివేదికలో పేర్కొందని స్పష్టం చేశారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ నిర్వహణ సరిగా లేదని కమిషన్‌‌లో ఉందన్నారు. క్వాలిటీ కంట్రోల్‌ సరిగా లేదు, ఆనకట్టల డిజైన్లు, డ్రాయింగ్స్‌లో లోపాలు ఉన్నాయని ధ్వజమెత్తారు.


కేసీఆర్ అసెంబ్లీకి వస్తే బాగుండేది..

కాళేశ్వరం చర్చకు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే బాగుండేదని.. సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. అలాగే.. బీసీలకు అవమానంచేలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని బీఆర్ఎస్ నేతలకు సీఎం హితవు పలికారు. బీసీ కమిషన్ మొత్తం వివరాలు సేకరించి ప్రభుత్వానికి ఇచ్చిందని వివరించారు. బీసీల్లో అపోహలు సృష్టించేలా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీసీ బిల్లుపై గంగులకు పూర్తి అవగాహన ఉందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా గంగుల బీసీ బిల్లును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.


బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని ముందుకెళ్తున్నాం..

హైకోర్టు ఆదేశాలిచ్చిన తక్షణమే చిత్తశుద్ధితో రిజర్వేషన్ల హామీ నిలబెట్టుకున్నామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఆరు నూరైనా 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లకు డెడికేటెడ్ కమిషన్‌ను వేశామని చెప్పారు. బీసీ బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. బీసీ బిల్లుపై ఎమ్మెల్యే గంగుల అభినందిస్తారని తనకు తెలుసు.. కానీ ఆయన వెనకున్నవారు ఒత్తిడి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో BRS తెచ్చిన రెండు చట్టాలు గుదిబండగా మారాయని విమర్శించారు. అడ్డంకులు తొలగించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్‌కు పంపామని స్పష్టం చేశారు. ప్రస్తుత గవర్నర్, గత సీఎం మధ్య సాన్నిహిత్యంతో బిల్లులు ఆగాయని ఆరోపించారు. తెర వెనుక లాబీయింగ్ చేసి బిల్లును రాష్ట్రపతికి పంపేలా చేశామన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఢిల్లీలోని జంతర్ మంతర్‌ దగ్గర ధర్నా చేశామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం స్పందించలేదని తెలిపారు. ఐదు సార్లు ప్రధాని అపాయింట్‌మెంట్ కోరామని వివరించారు. గతంలో రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరిన ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.


ఇవి కూడా చదవండి

హీరో అసభ్య ప్రవర్తన.. హీరోయిన్‌పై ట్రోలింగ్స్..

జైల్లో స్టార్ హీరో అష్టకష్టాలు.. బెడ్ షీట్ కావాలంటూ వేడుకోలు..

Updated Date - Aug 31 , 2025 | 11:02 AM