BJP VS Revanth Reddy Govt: బీజేపీ మరో యాక్షన్ ప్లాన్.. విద్యాసంస్థల పక్షాన పోరాడాలని నిర్ణయం
ABN , Publish Date - Oct 23 , 2025 | 07:48 PM
ఫీజు బకాయిలపై తెలంగాణ బీజేపీ నేతలు పోరుబాటకి సిద్ధమయ్యారు. లక్షలాది విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలతో కలిసి నవంబర్ తొలి వారంలో ‘చలో హైదరాబాద్’ చేపట్టడానికి కార్యచరణ రూపొందిస్తున్నట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt) నిర్లక్ష్య ధోరణితోపాటు విజిలెన్స్ దాడుల పేరుతో బెదిరించడాన్ని తెలంగాణ భారతీయ జనతా పార్టీ (Telangana BJP) తీవ్రంగా పరిగణిస్తోందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బందితో నవంబర్ తొలి వారంలో ‘చలో హైదరాబాద్’ నిర్వహించేదుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
బీజేపీ కసరత్తు..
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లించేదాకా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. గత రెండురోజులుగా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావులను కలిసి మద్దతు కోరుతున్నాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు(గురువారం) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని బండి సంజయ్ నివాసంలో పలువురు ఇంజనీరింగ్, బీఈడీ, ఇతర ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు సమావేశం అయ్యాయని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌తోపాటు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రూ.10 వేల కోట్ల బకాయిలు ఇవ్వాలి: ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు
ఈ సందర్భంగా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తమ గోడును వెళ్లబోసుకున్నాయి. ‘తెలంగాణలో సుమారు 2500 ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, బీఈడీ, డిగ్రీతో సహా 15 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి ప్రైవేట్ కాలేజీల్లో చదువుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా బకాయిలు ఇవ్వడం లేదు. దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. కాలేజీల్లో చదువు చెప్పే అధ్యాపకులతోపాటు బోధనేతర సిబ్బందికి జీతభత్యాలు ఇవ్వలేకపోతున్నాం. కాలేజీ అద్దెలు, మెయింటెనెన్స్ ఛార్జీలూ చెల్లించలేకపోతున్నాం.
జీతాలు రాకపోవడంతో అధ్యాపకులు సైతం నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నారు. కాలేజీల నిర్వహణ పెనుభారంగా మారింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆయా విద్యార్థులు ఉన్నత కోర్సులకు వెళ్లలేక, ఉద్యోగాలు పొందలేక ఇబ్బంది పడుతున్నారు. అంతిమంగా 15 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదివే విద్యార్థులంతా పేదరికం నుంచి వచ్చిన వాళ్లేనని, వాళ్లు సొంతంగా ఫీజులు కూడా చెల్లించే పరిస్థితి లేదు’ అని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశారు.
విజిలెన్స్ టీమ్ లతో బెదిరిస్తున్నారు: ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు
‘ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఇస్తున్న హామీలేవీ అమలు కావడం లేదు. పోయిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇకపై ప్రతినెలా రూ.500 కోట్ల చొప్పున ఏడాదిలో రూ.6వేల కోట్లు చెల్లిస్తానని, వీటితోపాటు మిగిలిన బకాయిలన్నీ చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అయినా నేటి వరకూ ఒక్క నెల బకాయి కూడా చెల్లించలేదు. మాటను నిలబెట్టుకోనందుకు తాము సమ్మె నోటీసు ఇస్తే కాలేజీల్లో తనిఖీల పేరుతో విజిలెన్స్ టీమ్ లను పంపి బెదిరిస్తున్నారు. బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లిస్తే తనిఖీలు చేసినా తమకు ఇబ్బంది లేదు. మేము పొరపాట్లు చేస్తే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పేర్కొన్నాయి.
యాజమాన్యాలతో కేంద్రమంత్రి బండి సంజయ్ చర్చలు..
కాలేజీల యాజమాన్యాల ఆవేదన విన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్‌తో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించేలా విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల పక్షాన బీజేపీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. ఈ విషయంలో కాలేజీ యాజమాన్యాలు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తక్షణమే బకాయిలన్నీ చెల్లించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు భవిష్యత్తు కార్యాచరణపై కాలేజీ యాజమాన్యాలతో బండి సంజయ్, లక్ష్మణ్ చర్చించారు. రెండు, మూడు రోజుల్లో నగదు చెల్లించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో వివిధ రూపాల్లో నిరసనలు తెలపడంతోపాటు నవంబర్ మొదటి వారంలో రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో చదివే లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు బోధన, బోధనేతర సిబ్బందితో కలిసి ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించే విషయంపై చర్చలు జరిపారు. ఒకటి, రెండు రోజుల్లో బీజేపీ పక్షాన రాష్ట్ర నాయకత్వం యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్‌తో బీఆర్ఎస్ కీలక నేతల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
రాజకీయ పార్టీ ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News