Happy Ganesh Chaturthi: వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రులు..
ABN , Publish Date - Aug 26 , 2025 | 09:30 PM
రెండు తెలుగు రాష్ట్రాలు వినాయక చవితి శోభతో కళకళలాడుతున్నాయి. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని విఘ్నేశ్వరుడుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. వాడ వాడల వెలిసే గణేష్ మండపాలలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సంవత్సరం కూడా వినాయకుని మండపాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
గణనాథుడు అనుగ్రహించాలి: చంద్రబాబు
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ఆ గణనాథుడు అందరినీ అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా మండపాలను ఏర్పాటు చేసి, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య గణేశుడిని పూజిస్తున్న భక్తులకు సకల శుభాలు కలగాలని వినాయకుడిని కోరుకుంటున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు
ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..