Mahakumbh 2025: రేపే మాఘ పూర్ణిమ రాజ స్నానం.. ట్రాఫిక్ నియంత్రణపై యూపీ సీఎం యోగి సమావేశం
ABN , Publish Date - Feb 11 , 2025 | 12:15 PM
Mahakumbh 2025 : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో రేపే (ఫిబ్రవరి 12) మాఘ పూర్ణిమ రాజస్నానం. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం. ఇందుకు చేయాల్సిన సన్నాహాలు, ట్రాఫిక్ నియంత్రణ మార్గదర్శకాలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశం ఏర్పాటు చేశారు.
Mahakumbh 2025 : ప్రపంచంలో అతిపెద్ద ఆధ్మాత్మిక కార్యక్రమం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో రేపే (ఫిబ్రవరి 12) మాఘ పూర్ణిమ రాజస్నానం. ఈ ఐదో అమృతస్నానం కోసం భక్తుల దేశ విదేశాల నుంచి త్రివేణి సంగమానికి తరలి వెళ్తున్నారు. ఈ కారణంగా ప్రయాగ్‌రాజ్ చుట్టుపట్ల రెండు రోజుల ముందు నుంచే వేల కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితిలో ప్రయాణీకులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. అమృత స్నానం మరీ ప్రత్యేకం కాబట్టి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం. ఈ సారి అలాంటి ప్రమాదాలకు తావు లేకుండా భక్తుల భద్రత కోసం తగిన సన్నాహాలు చేస్తోంది. ఈ విషయమై సీఎం యోగి అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ సమావేశం నిర్వహించారు.
ప్రత్యేక సన్నాహాలు, ట్రాఫిక్ సమస్యపై సీఎం యోగి సమీక్ష..
మహా కుంభమేళాలో రేపే (ఫిబ్రవరి 12) మాఘ పూర్ణిమ రాజస్నానం. బుధవారం పెద్ద ఎత్తున భక్తులు త్రివేణి సంగమానికి వచ్చే అవకాశం ఉన్నందున సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జనసమూహ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ ఏర్పాట్లపై నిరంతరం నిఘా ఉంచాలని పరిపాలన, పోలీసు అధికారులకు ముఖ్యమైన సూచనలు ఇచ్చారు.
షటిల్ బస్సుల సంఖ్య పెంచుతూ నిర్ణయం..
భక్తులు పార్కింగ్ స్థలం నుంచి జాతర ప్రాంతానికి సులభంగా చేరుకునేలా షటిల్ బస్సుల సంఖ్యను పెంచుతోంది యూపీ ప్రభుత్వం. జాతర ప్రాంతంలో జనసమూహ ఒత్తిడిని నియంత్రించడానికి ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్, దాని పరిసర జిల్లాల్లో వాహనాలు కిలో మీటర్ల పొడవున నిలిచిపోకుండా ట్రాఫిక్ వ్యవస్థను మెరుగ్గా నిర్వహించాలని ముఖ్యమంత్రి యోగి అధికారులను ఆదేశించారు. ప్రయాగ్‌రాజ్ సరిహద్దులో నిర్మించిన పార్కింగ్ స్థలాలను సక్రమంగా ఉపయోగించుకోవాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికార వాహనాలు జాతర ప్రాంగణంలోకి ప్రవేశించకూడదని సూచించారు. పిల్లలు, వృద్ధులు, మహిళలను జాగ్రత్తగా చూసుకోవాలని కూడా యోగి అధికారులను కోరారు.
పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ..
మహాకుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద భక్తులు పరిశుభ్రమైన వాతావరణంలో స్నానం చేయగలిగేలా నిరంతరం పర్యవేక్షించేందుకు యూపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనితో పాటు జాతర జరిగే ప్రాంతంలో పోలీసు పెట్రోలింగ్ పెంచారు. క్రేన్లు, అంబులెన్స్‌ల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఫిబ్రవరి 26తో మహాకుంభమేళా పూర్తికానుంది.
ఇవి కూడా చదవండి..
Mahakumbh 2025 : కుంభమేళాకు వెళ్తున్నారా? ఈ పని చేస్తే క్యూలో నిలబడే అవసరమే రాదు..!
Supreme Court:నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం!
Misleading Drug ads: మా ఆదేశాలు ఎందుకు పాటించలేదు?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.