Supreme Court: నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం!
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:56 AM
కేంద్రానికి, ఈసీకి సుప్రీం ఆదేశం శిక్షపడిన వారిని పార్టీ పదవుల్లో ఉండరాదని చెబితే వారు తమ భార్యల ద్వారానో, మరెవరి ద్వారానో రిమోట్ కంట్రోల్‌తో పార్టీని నడిపిస్తారు.
మీ అభిప్రాయం చెప్పండి.. కేంద్రానికి, ఈసీకి సుప్రీం ఆదేశం శిక్షపడిన వారిని పార్టీ పదవుల్లో ఉండరాదని చెబితే వారు తమ భార్యల ద్వారానో, మరెవరి ద్వారానో రిమోట్ కంట్రోల్‌తో పార్టీని నడిపిస్తారు. అందువల్ల అన్ని రకాల పరిస్థితులను ఊహించి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మేం తీసుకునే నిర్ణయం లోపభూయిష్ఠంగా ఉండరాదు. అలా ఉంటే తీర్పు ఎలాంటి ప్రభావం చూపకపోగా, వ్యవస్థపై ప్రజలు మరింతగా విశ్వాసం కోల్పోతారు.
- సుప్రీంకోర్టు
రాజకీయాలు నేరమయం కావడం తీవ్ర అంశమని ధర్మాసనం వ్యాఖ్య
క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలినవారు పార్లమెంటుకు ఎలా వస్తారని విస్మయం
42 శాతం మంది సిటింగ్ సభ్యులపై పెండింగ్ కేసులుండడం సిగ్గుచేటు
శిక్ష పడ్డ ప్రజాప్రతినిధులపై కేవలంఆరేళ్ల పాటే అనర్హత వేటు వేస్తారా?
వారిపై శాశ్వత వేటు వేయాలి.. చట్టాలు చేసేవారు పవిత్రంగా ఉండాలి
దోషిగా తేలిన వ్యక్తి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండడం సరైనదేనా?
ప్రజాప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 8కి రాజ్యాంగబద్ధత ఉందా: అమికస్ క్యూరీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): నేరాలకు పాల్పడి శిక్ష పడ్డ రాజకీయ నేతలు చట్టసభల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా నిషేధం విధించడంపై మూడు వారాల్లోగా అభిప్రాయాన్ని తెలపాలంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని, ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. రాజకీయాలు నేరమయం కావడం తీవ్రమైన అంశమని ఆందోళన వెలిబుచ్చింది. చట్టసభల ప్రతినిధులపై కేసుల విచారణ వేగవంతం చేయాలని, శిక్ష పడ్డవారిపై శాశ్వత వేటు వేయాలని కోరుతూ.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 8, 9 సెక్షన్ల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ 2016లో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ఏదైనా క్రిమినల్ కేసులో దోషిగా తేలినవారు అసలు చట్టసభలకు ఎలా తిరిగొస్తారని విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్టు తేలినా, ప్రభుత్వానికి
అవిధేయుడుగా ఉన్నట్టు తేలినా ఆ వ్యక్తిని సర్వీసులో కొనసాగడానికి అనర్హుడుగా భావిస్తారని.. కానీ, అదే వ్యక్తి మంత్రిగా కొనసాగొచ్చని ఆశ్చర్యం వెలిబుచ్చింది. నేరచరిత్ర ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలను శాశ్వతంగా చట్టసభల్లో ప్రవేశించకుండా వేటువేయాలనే ప్రతిపాదనపై కేంద్రం, ఎన్నికల కమిషన్ స్పందించాలని కోరింది. కేంద్రం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాది సానియా మాథుర్‌ను ఆదేశించింది. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని కోర్టుకు వచ్చి వెల్లడించాలని సుప్రీం అటార్నీ జనరల్ ఎస్.వెంకటరమణిని కోరుతూ.. తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. అఫిడవిట్ దాఖలుకు తమకు మరింత సమయం కావాలని ఎన్నికల కమిషన్(ఈసీ) తరఫు న్యాయవాది సిద్ధాంత కుమార్ కోరగా.. జస్టిస్ దీపాంకర్ దత్తా తీవ్రంగా స్పందించారు. ‘‘రాజకీయాలు నేరమయం కావడం ఎంతో తీవ్రమైన అంశం. ఇప్పటికే ఈసీ దీనిపై దృష్టి కేంద్రీకరించి మెరుగైన పరిష్కారం కనుక్కుని ఉంటే బాగుండేది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో మూడువారాల్లో ఈ అంశంపై తమ వైఖరి తెలిపేందుకు ఈసీ సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే.. ప్రజా ప్రతినిధులపై కేసులను వేగవంతంగా పరిష్కరించే విషయాన్ని హైకోర్టులే పర్యవేక్షించాలని 2023లో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం నిర్ణయించినందువల్ల.. ఆ అంశాన్ని తమ ద్విసభ్య బెంచ్ రీ-ఓపెన్ చేయడం సరైంది కాదని, దీన్ని విస్తృత ధర్మాసనానికి అప్పజెప్పాల్సిందిగా సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు నివేదించాలని న్యాయమూర్తులు నిర్ణయించారు. అయితే, హైకోర్టులు నివేదికలు తెప్పించుకోవడం, వాయిదాలు వేయడం తప్ప ఏమీ చేయడం లేదని, దీని వల్ల ప్రజా ప్రతినిధుల పై కేసుల్లో నిరంతర ఆలస్యం జరుగుతోందని వారు అభిప్రాయపడ్డారు.
ఆర్టికల్ 14 ఉల్లంఘనే!
ప్రజాప్రతినిధులపై కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. హైకోర్టులు ఆయా కేసులను పర్యవేక్షిస్తున్నప్పటికీ .. దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన దాదాపు ఐదు వేల క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సీనియర్ న్యాయవాది, అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా కోర్టుకు తెలిపారు. ‘‘నేరాలకు శిక్షపడ్డ ప్రజా ప్రతినిధులపై ఆరేళ్లపాటు మాత్రమే అనర్హత వేటు వేయాలన్న ప్రజాప్రాతినిధ్యచట్టంలోని సెక్షన్ 8కి రాజ్యాంగబద్ధత ఉందా? శిక్ష పడ్డ ఒక వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి, దానికి పదాధికారిగా కొనసాగడం సరైనదేనా?’’ అనే ప్రశ్నలను ఈ పిల్ లేవనెత్తిందని ఆయన పేర్కొన్నారు. పది రాష్ట్రాల్లో 12 ప్రత్యేక కోర్టులను నెలకొల్పాలని సుప్రీంకోర్టు 2017లో ఆదేశించిందని, నోడల్ ప్రాసిక్యూషన్ అధికారులను నియమించాలని, కేసుల విచారణ వాయిదా వేయకూడదని, ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించేలా పర్యవేక్షిస్తుండాలని 2023 వరకూ అనేక ఆదేశాలు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు. ‘‘అయినప్పటికీ 42ు సిటింగ్ సభ్యులపై పెండింగ్ కేసులు కొనసాగడం సిగ్గు చేటు. పలు కేసులు 30 ఏళ్లుగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘చట్టాలు చేసేవారు ఆయాచట్టాల కింద పదవులు నిర్వహిస్తున్న వ్యక్తుల కంటే చాలా పవిత్రంగా, మచ్చలేకుండా ఉండాలి. ఒకసారి వారు నైతిక ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలితే, వారు ఆ పదవిని నిర్వహించడానికి శాశ్వతంగా అనర్హులు కావాలి. అనర్హత కాలాన్ని పరిమితం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14లో పేర్కొన్న సమానత్వ నిబంధనను ఉల్లంఘించడమే’’ అని హన్సారియా వాదించారు.
దీనికి జస్టిస్ దీపాంకర్ దత్తా.. ‘‘కేసులను పరిష్కరించడంలో జరుగుతున్న ఆలస్యానికి నిర్దిష్ట కారణాలేమిటి?’’ అని ప్రశ్నించారు. ప్రత్యేక కోర్టులు ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులను కాకుండా ఇతర కేసులు విచారిస్తున్నాయని, అవి కూడా తరచూ వాయిదాలు పడుతున్నాయని, నిందితులు హాజరు కావడం లేదని, కోర్టులు సాక్షులకు సమన్లు జారీ చేసినప్పటికీ సరైన సమయంలో, అవసరమైన సమన్లను జారీ చేయడం లేదని ధర్మాసనానికి అమికస్ క్యూరీ తెలిపారు. ఆయన వాదనను జస్టిస్ మన్మోహన్ అంగీకరించలేదు. ప్రత్యేక కోర్టులు ప్రజాప్రతినిధుల కేసుల విచారణకు ప్రాధాన్యం ఇవ్వడంలేదన్న విషయం సరైంది కాదని, దేశమంతా అలా జరుగుతున్నట్టు అమికస్ క్యూరీ చెబుతున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కావాలంటే రౌజ్ ఎవెన్యూ కోర్టుల పనితీరును పరిశీలించాలని ఆయన చెప్పారు. ఆయా కోర్టుల్లో మధ్యాహ్నానికే విచారణలు ముగుస్తున్నాయని గుర్తుచేశారు. ప్రతి రాష్ట్రంలోనూ పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయని, ఒక్కో రాష్ట్రం పరిస్థితి గురించి వివరించాలని ఆయన అమికస్ క్యూరీని కోరారు.
అన్ని పార్టీలూ!
అత్యాచారం, హత్య వంటి తీవ్ర నేరాల్లో దోషులుగా తేలిన 46-48 శాతం మంది 2-3 ఏళ్ల శిక్ష అనంతరం ఎంపీ/ఎమ్మెల్యేగా ఎన్నికై తిరిగి చట్టసభలకు వస్తున్నారని.. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 8, 9 సెక్షన్లకు సవాల్‌గా పరిణమించిందని పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ పేర్కొన్నారు. అన్ని పార్టీలూ నేరచరితులను పార్లమెంటుకు పంపుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. అసలు క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలినవారు చట్టసభలకు ఎలా తిరిగి వస్తున్నారని.. నేరాలకు శిక్షపడ్డ వారిని చట్టసభల్లో ప్రవేశించేందుకు ఎలా అనుమతిస్తున్నారని.. వారే చట్టాలను రూపొందించడం ఎలా జరుగుతోందని జస్టిస్ దత్తా ప్రశ్నించారు. ప్రస్తుత చట్టాల ప్రకారం హత్యానేరానికి శిక్ష పడ్డ వ్యక్తి కూడా ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు కావచ్చని, ఆ పార్టీకి ఈసీ గుర్తు కేటాయిస్తుందని అమికస్ క్యూరీ హన్సారియా తెలిపారు. శిక్ష పడ్డవారు పార్టీ పదవుల్లో ఉండరాదంటూ ఈసీ మార్గదర్శకాలను జారీ చేయవచ్చన్నారు. దీనిపై జస్టిస్ మన్మోహన్ స్పందిస్తూ.. శిక్షపడిన వారు పార్టీ పదవుల్లో ఉండొద్దని చెబితే వారు తమ భార్యల ద్వారానో, మరెవరి ద్వారానో రిమోట్ కంట్రోల్‌తోనో పార్టీని నిర్వహిస్తారని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..
Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!
For More National News and Telugu News..