Raja Raghuvanshi Murder Case: భర్త రఘువంశీ హత్యకు సోనమ్ ఎలా ప్లాన్ చేసింది? ఛార్జ్‌షీట్‌లో విస్తుపోయే నిజాలు..
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:31 PM
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో అసలు నిందితులు ఎవరో వెల్లడైంది. భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనమ్ ఎలా ప్లాన్ చేసింది? హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను షిల్లాంగ్ పోలీసులు కోర్టుకు సమర్పించారు.
హనీమూన్ మర్డర్‌గా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రాజారఘువంశీ (Raja Raghuvanshi Murder Case) కేసులో మేఘాలయ పోలీసుల సిట్ దర్యాప్తు పూర్తయింది. భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనమ్ ఎలా ప్లాన్ చేసింది? హత్యకు పాల్పడ్డ నిందితులు ఎవరు? తదితర పూర్తి వివరాలతో కూడిన 790 పేజీల ఛార్జ్‌షీట్‌ను పోలీసులు షిల్లాంగ్ కోర్టులో దాఖలు చేశారు. రాజా రఘువంశీ భార్య సోనమ్ (Sonam Raghuvanshi), ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాతో పాటు మరో ముగ్గురిని ఛార్జ్‌షీట్‌లో నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం ఐదుగురు నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సుదీర్ఘ దర్యాప్తు అనంతరం కోర్టులో 790 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దర్యాప్తులో, పోలీసులు కాల్ రికార్డులు, లొకేషన్ డేటా, సాక్షుల వాంగ్మూలాలతో సహా అనేక ఆధారాలను సేకరించారు. వీటితో పాటు ఫోరెన్సిక్ నివేదికలను ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజా భార్య సోనమ్ రఘువంశీ, ఆమె ప్రేమికుడు రాజ్ కుష్వాహా ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారులుగా ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. కుట్ర అమలుకు సహకరించిన ఆకాష్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మి, విశాల్ సింగ్ చౌహాన్ అనే మరో ముగ్గురు నిందితులపై అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ ఐదుగురిపై భారత శిక్షాస్మృతి ప్రకారం హత్య, సాక్ష్యాలను నాశనం చేయడం, నేరపూరిత కుట్ర అనే ఆరోపణల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రాజా హత్య తర్వాత సోనమ్ దాక్కున్న ఇంటి యజమాని లోకేంద్ర తోమర్, సెక్యూరిటీ గార్డు బల్బీర్ అహిర్బర్, జేమ్స్ అనే వ్యక్తులను పోలీసులు ఈ కేసులో సహనిందితులుగా చేర్చారు.
ఈ ఏడాది మే 11న రాజా రఘువంశీకి, సోనమ్‌కు వివాహం జరిగింది. పెళ్లైన పది రోజుల తర్వాత (మే 20న) హనీమూన్ కోసం కొత్త దంపతులు మేఘాలయ వెళ్లారు. ఆ తర్వాత ఎన్ని రోజులు గడిచినా కొడుకు, కోడలు తిరిగిరాకపోవడంతో రాజా కుటుంబసభ్యులు ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత జూన్ 1న సోహ్రా ప్రాంతంలోని ఓ లోయలో రాజా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో హత్యగా పోలీసులు అనుమానించారు. అనంతరం సోనమ్ కోసం గాలించడం మొదలుపెట్టారు. అయితే, హఠాత్తుగా జూన్ 7న ఆమె ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్‌లో కనిపించింది. పోలీసులు ఏమైందని ప్రశ్నించగా.. తనను ఎవరో అపహరించి అక్కడ వదిలేశారని సోనమ్ కల్లబొల్లి కబుర్లు చెప్పింది. అప్పటికే ఆమెపై అనుమానాలు ఉండటంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. దీంతో తన ప్రియుడు రాజ్ కుశ్వాహాతో కలిసి రాజాను హత్య చేయించినట్లు సోనమ్ ఒప్పుకుంది. ఆ తర్వాత వీరిద్దరితో పాటు హత్యకు సహకరించిన ఇతరులను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 11న నిందితులను కోర్టు కస్టడీకి అప్పగించింది.
ఇవి కూడా చదవండి
సోనూసూద్ గొప్ప మనసు.. ప్రాణాలకు రిస్క్ అని తెలిసినా కూడా..
దుబాయ్‌లో రూ.2500 కోట్ల డ్రగ్స్ రాకెట్ సూత్రధారి.. హై ప్రొఫైల్ లింకులు బహిర్గతం..
For More National News