Sonu Sood Vows To Stay: సోనూసూద్ గొప్ప మనసు.. ప్రాణాలకు రిస్క్ అని తెలిసినా కూడా..
ABN , Publish Date - Sep 07 , 2025 | 01:27 PM
పంజాబ్‌లోని వరద ప్రభావిత గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు 1998 గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. 48 మంది ప్రజలు చనిపోయారు.
సోనూసూద్ మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ దేశాలను గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి సమయం నుంచి ఇప్పటి వరకు లేదనకుండా అడిగిన వారికి సాయం చేస్తూనే ఉన్నారు. తన అవసరం ఉన్న చోటుకు నేరుగా వెళుతున్నారు. స్వయంగా తన చేతుల్తోనే సాయం చేసి వస్తున్నారు. ప్రస్తుతం ఆయన పంజాబ్‌లో ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరదల కారణంగా నష్టపోయిన గ్రామాల్లో పర్యటించటమే కాకుండా సాయం కూడా అందించనున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..
‘భాగ్‌పూర్, సుల్తాన్ పూర్, లోధి, పిరోజ్‌పూర్, ఫలిల్కా, అజ్‌నాలకు వెళతాను. ఆ ప్రాంతాల్లో తిరిగి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటాను. వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోయాయి. ప్రజలు అన్ని రకాలుగా దెబ్బతిన్నారు. ఇక్కడి ప్రజలకు సాయం చేయటం అన్నది వారంలోనో.. పది రోజుల్లోనే అయ్యే పని కాదు. పంజాబ్ కోలుకోవటానికి కొన్ని నెలల సమయం పడుతుంది. పంజాబ్ కోసం నిలబడే వారు మాకు చాలా అవసరం. ఇళ్లు కూలిపోయి ఇబ్బంది పడుతున్నవారికి మేము ఇళ్లు కట్టించే ప్రయత్నం చేస్తాం.
నేను ఇప్పుడే వెనక్కు తిరిగి వెళ్లిపోవడానికి రాలేదు. వీలైనన్ని వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తాను’ అని స్పష్టం చేశారు. కాగా, పంజాబ్‌లోని వరద ప్రభావిత గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు 1998 గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. 48 మంది ప్రజలు చనిపోయారు. 1.45 లక్షల మంది ప్రజలపై వరద ప్రభావం పడింది. భారీగా పంట నష్టం కూడా సంభవించింది. 50 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. అక్కడ పరిస్థితులు ఇంకా సాధారణ స్థితిలోకి రాలేదు. వర్షం పడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో అక్కడికి వెళ్లటం రిస్క్ అని తెలిసినా సోనూసూద్ వెనకడుగు వేయటం లేదు.
ఇవి కూడా చదవండి
గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సక్సెస్ ఫుల్‌గా నిర్వహించాం: సీవీ ఆనంద్
2019లో బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ 6 వేల కోట్లు.. 2024లో ఎంతంటే..