Maharashtra Farmer: లక్షన్నర రావాల్సింది.. రూ. 2 నష్ట పరిహారం.. కన్నీళ్లు పెట్టుకున్న రైతన్న!
ABN , Publish Date - Nov 04 , 2025 | 04:48 PM
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా శిలోత్తర్ గ్రామానికి చెందిన రైతు మధుకర్ బాబూరావు పాటిల్ ఈ చేదు అనుభవం ఎదుర్కొన్నారు. ఆగ్రో అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన రసీదు ప్రకారం.. పీఎం ఫసల్ బీమా యోజన కింద పాటిల్ తన 2.51 హెక్టార్ల భూమికి రూ.1,53,110 పరిహారం పొందాల్సి ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: రేయింబవళ్లు కష్టపడి రైతులు పంటలను పండిస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఇక చేతికి వచ్చిన పంట.. వర్షం కారణంగా దెబ్బతింటుంది. దీంతో రైతుల వేదన వర్ణనాతీతం. వారి బాధలో కొంతైనా తీర్చేందుకు ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేస్తుంటాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు నష్టపరిహారం విడుదల చేసింది. అయితే ఓ రైతు((Maharashtra Farmer)కు కేవలం రూ. 2.30 మాత్రమే రావడంతో కన్నీరు పెట్టుకున్నాడు. అంతేకాక ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. వాస్తవానికి సదరు రైతుకు రూ.1.5 లక్షలకు పైగా పంట బీమా పరిహారం రావాల్సి ఉన్నా.. ఇంత తక్కువ మొత్తం జమ కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా శిలోత్తర్ గ్రామానికి చెందిన రైతు మధుకర్ బాబూరావు పాటిల్ ఈ చేదు అనుభవం ఎదుర్కొన్నారు. ఆగ్రో అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన రసీదు ప్రకారం.. పీఎం ఫసల్ బీమా యోజన(PM Fasal Bima Yojana) కింద పాటిల్ తన 2.51 హెక్టార్ల భూమికి రూ.1,53,110 పరిహారం పొందాల్సి ఉంది. ఈ ఏడాదికి గాను రూ.1,148.32 ప్రీమియం కూడా ఆ రైతు చెల్లించాడు. ఈ క్రమంలో ఇటీవల కొన్ని రోజుల నుంచి పంట నష్టపరిహారంకు సంబంధించిన డబ్బులు రైతుల అకౌంట్లలో పడుతున్నాయి. అలానే శుక్రవారం పాటిల్‌కు డబ్బులు క్రెడిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అయితే ఆ సందేశం చూసిన పాటిల్ షాకయ్యాడు. ఆయనకు కేవలం రూ.2.30 మాత్రమే తన ఖాతాలో జమ అయినట్లు అందులో చూపింది.
తనకున్న ఆరు నుంచి ఏడు ఎకరాల్లోని వరి పంట నిరంతర వర్షాల కారణంగా పూర్తిగా నీటమునిగి కుళ్లిపోయిందని పాటిల్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇంత భారీ నష్టం జరిగినా.. కేవలం రూ.2.30( Farmer Compensation) జమ కావడంతో షాకయ్యానని ఆయన వాపోయారు. ఇది తనకు మరో సంక్షోభాన్ని తెచ్చిపెట్టిందని సదరు రైతు(Farmer Protest) తెలిపారు. ఈ వ్యవహారంపై దుమారం రేగడంతో పాల్ఘర్ జిల్లా వ్యవసాయ అధికారి నిలేష్ భాగేశ్వర్ స్పందించారు. కేవలం టెక్నికల్ ఇష్యూ కారణంగానే జరిగిందని ఆయన వివరించారు. 2023 ఖరీఫ్ సీజన్‌లో వరి పంట నష్టం కోసం పాటిల్‌కు మొత్తం రూ.72,466 పంట బీమా పరిహారం(Crop Insurance) రావాల్సి ఉంది. మే 2024లోనే రూ.72,464 మొత్తం రైతుకు అందిందని, మిగిలిన రూ.2.30 పైసలు అక్టోబర్ 31న టెక్నికల్ ఇష్యూ వల్ల ఇప్పుడు జమ అయ్యాయని వివరించారు. తాము రైతును కలిసి పూర్తి సమాచారాన్ని వివరించామని వ్యవసాయ అధికారి భాగేశ్వర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
సినిమాల్లో సామాజిక స్పృహ కొరవడింది..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి