Chief Minister Sidda Ramaiah: సినిమాల్లో సామాజిక స్పృహ కొరవడింది..
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:07 PM
కేవలం సబ్సిడీలకోసం సినిమా తీయవద్దని, ఇటీవల సినిమాల్లో సామాజిక స్పృహ కొరవడిందని, మంచి సినిమాలు తీసి రాయితీ పొందాలని సీఎం సిద్దరామయ్య పిలుపునిచ్చారు. ఇకపై ప్రతి ఏడాది సినిమా పురస్కారాలు ఇస్తామన్నారు.
- సినిమాల్లో సామాజిక స్పృహ కొరవడింది..
- మంచి చిత్రాలు తీసి రాయితీ పొందాలన్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య
- ఉత్తమ నటీనటులకు వార్షిక రాష్ట్ర సినిమా పురస్కారాల ప్రదానం
బెంగళూరు: కేవలం సబ్సిడీలకోసం సినిమా తీయవద్దని, ఇటీవల సినిమాల్లో సామాజిక స్పృహ కొరవడిందని, మంచి సినిమాలు తీసి రాయితీ పొందాలని సీఎం సిద్దరామయ్య(Chief Minister Sidda Ramaiah) పిలుపునిచ్చారు. ఇకపై ప్రతి ఏడాది సినిమా పురస్కారాలు ఇస్తామన్నారు. మైసూరులో సోమవారం ఏర్పాటైన 2018, 2019 వార్షిక రాష్ట్ర సినిమా పురస్కారాలు ప్రదానం చేశారు. సీఎం మాట్లాడుతూ కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్‌కుమార్ వెండితెరపైన మాత్రమే కాక నిజజీవితంలోనూ విలువలు పాటించారన్నారు.
ఈ కారణంగానే నేటికీ ఆయన ప్రజల హృదయాలలో ఉన్నారన్నారు. సినిమా అత్యంత ప్రభావమైన మాధ్యమమని సమాజంపై ఎంతో ప్రభావం చూపుతుందన్నారు. ఈ కారణంగా సినిమాతారలు తెరపై మాత్రమే కాకుండా నిజజీవితంలోనూ అంతే విలువలతో ఉండాలని అభిలషించారు. సమాజాన్ని తీర్చేటటువంటి సినిమాలు ఎక్కువగా రావాలన్నారు. తమ ప్రభుత్వం కన్నడ సినిమారంగానికి ఆరోగ్యకరమైన ప్రగతికి మద్దతు ఇస్తోందన్నారు. మంచి సినిమాలు తీసి ప్రజలు మెచ్చేలా ఉండాలని తద్వారా రాయితీ ఇచ్చినదానికి సార్థకత లభిస్తుందన్నారు.

బకాయిపడ్డ అన్ని సంవత్సరాల సబ్సిడీని ఒకేసారి విడుదల చేస్తామన్నారు. మైసూరులో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఫిలింసిటీ రూపొందించేందుకు 160 ఎకరాల స్థలాన్ని సమాచారశాఖకు అప్పగించామన్నారు. రెండు నెలల్లో చట్టప్రక్రియ పూర్తి చేసి ఫిలింసిటీ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. గత ప్రభుత్వం ఆయా సంవత్సరాలలో సినిమా పురస్కారాలు ఇవ్వకపోవడంతో 2018 నుంచి పురస్కారాల ప్రదానం సాధ్యం కాలేదన్నారు.
ఇకపై ఇలా పొరపాట్లు జరగకుండా ప్రతి ఏటా పురస్కారాలు ఇస్తామన్నారు. ఏ సంవత్సరం అవార్డులను మరుసటి ఏడాది ఇవ్వడం మాత్రమే అర్థపూర్ణం అవుతుందన్నారు. గతంలో సినిమాల సంఖ్య తక్కువగా ఉండేదని, తానుకూడా చూసినవాటినే చూసేవాడినన్నారు. ఇప్పుడు లెక్కకు మిక్కిలి సినిమాలు వస్తున్నాయని, అయితే సామాజిక స్పృహ, నాణ్యత తక్కువగా ఉన్నాయని అందుకే సినిమాలు చూసేది తగ్గించానన్నారు. కార్యక్రమంలో మంత్రి మహదేవప్ప పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు
Read Latest Telangana News and National News