Election Commission: ఓటర్ల సమస్యకు సత్వర పరిష్కారం
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:48 AM
ఓటర్ల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది.
పోలింగ్ బూత్ స్థాయి అధికారికి ఫోన్‌లో సమస్యలు చెప్పొచ్చు
సైట్‌లో ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్‌వో’ ఆప్షన్.. 48 గంటల్లో ఫోన్ కాల్
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ వెల్లడి
అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ఓటర్ల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్‌వో’ అనే కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్లు జ్ట్టిఞట://్ఛఛిజీుఽ్ఛ్ట.్ఛఛిజీ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్, లేదా ఈసీఐ మొబైల్ యాప్‌లోని హోంపేజీలో ఉన్న ఓటరు సేవల విభాగంలోకి వెళ్లి ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్‌వో’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఈసీ వద్ద ఓటరు రిజిస్టర్ చేసిన మొబైల్ నంబరు, ఈ-మెయిల్ లేదా ఎపిక్ నంబర్ ద్వారా లాగిన్ కావొచ్చు. తర్వాత రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గాన్ని ఎంచుకుని, పార్ట్ నంబర్‌ను సెలెక్ట్ చేయాలి. దీంతో సంబంధిత బీఎల్‌వో వివరాలు కనిపిస్తాయి, అక్కడ బీఎల్‌వో పేరు, మొబైల్ నంబరు ఇచ్చి ‘సెండ్ ఓటీపీ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఓటీపీ ధ్రువీకరించిన వెంటనే కాల్ అభ్యర్థన బీఎల్‌వోకు చేరుతుంది. తర్వాత 48 గంటలలోపు బీఎల్‌వో స్వయంగా ఓటరును సంప్రదించి సమస్య తెలుసుకుని పరిష్కరిస్తారు. ఈ ఫీచర్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. ఓటర్ల నుంచి వచ్చిన ప్రతి అభ్యర్థనకు తక్షణమే స్పందన ఇవ్వాలని, 48 గంటల్లో సమస్యను పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.