MahaKumbh Mela 2025: పడవ నడిపి 45 రోజుల్లో రూ.30 కోట్లు సంపాదించాడు.. సీఎం యోగి..
ABN , Publish Date - Mar 06 , 2025 | 11:24 AM
MahaKumbh Mela 2025 Boatman : మహాకుంభమేళా నిర్వహణపై విపక్షాలు చేస్తున్న విమర్శలను అసెంబ్లీ సాక్షిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తిప్పికొట్టారు. 45 రోజుల పాటు మహాకుంభమేళాను కనివినీ ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించామని చెప్తూ.. ఈ ఆధ్యాత్మిక వేడుకలో పడవ నడపి రూ.30 కోట్లు సంపాదించిన స్ఫూర్తిదాయకమైన కథను పంచుకున్నారు.

MahaKumbh Mela 2025 Boatman Story : ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజులపాటు జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుక నిర్వహణ సరిగాలేదని, పడవ యజమానులు దోపిడీకి గురయ్యారనే సమాజ్‌వాదీ పార్టీ ఆరోపణలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మహా కుంభమేళాలో పడవ నడిపే పింటు మహారా కుటుంబ విజయగాథను సీఎం యోగి అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహాకుంభమేళా దోపిడీకి వేదికగా నిలిచిందని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండటంతో.. శాసనసభ వేదికగా మహాకుంభమేళా విజయగాథలను వివరించారు సీఎం యోగి. గంగా మాత ఆశీర్వాదంతో మహాకుంభమేళా సందర్భంగా 45 రోజుల్లో రూ.30 కోట్లు సంపాదించిన పడవల వ్యాపారి కుటుంబం గురించి ప్రత్యేకంగా వివరించారు.
రోజుకు రూ.50,000-52,000 సంపాదన.. యోగి
ప్రయాగ్‌రాజ్‌లో పడవ యజమానులు "దోపిడికి గురయ్యారు" అనే సమాజ్‌వాదీ పార్టీ ఆరోపణపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, "నేను ఒక పడవ యజమాని కుటుంబం విజయగాథను చెబుతున్నాను. వారి వద్ద 130 పడవలున్నాయి. 45 రోజుల్లో (మహా కుంభమేళా) వారు రూ. 30 కోట్ల లాభం పొందారు... అంటే ప్రతి పడవ రూ. 23 లక్షలు సంపాదించింది. రోజూ వారు ప్రతి పడవ నుండి రూ. 50,000-52,000 సంపాదించారు." మహా కుంభమేళా 2025 జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగిసింది. 65 కోట్లకు పైగా భక్తులు మహా కుంభమేళాను సందర్శించారని పేర్కొన్నారు.
45 రోజుల్లో రూ.30 కోట్లు..
మహా కుంభమేళా సందర్భంగా కోట్లాది మంది భక్తులు ప్రయాగ్‍రాజ్‌కు భారీగా తరలిరావడంతో స్థానికంగా పడవ నడిపేవారికి బంపర్ ఆఫర్ లభించినట్లయింది. భారీ ఆదాయానికి మార్గం ఏర్పడింది. ఈసారి యాత్రికుల సంఖ్య రికార్డు స్థాయిలో ఉంటుందని ప్రయాగ్‌రాజ్‌లోని అరయిల్ ప్రాంతానికి చెందిన పింటు మహారా ముందే అంచనా వేశారు. ఆ ఆలోచనతోనే, అతడు తన కుటుంబం కోసం మరో 70 కొత్త పడవలు కొన్నాడు. అప్పటికే పింటూ దగ్గర 60 పడవలు ఉన్నాయి. మొత్తంగా మహా కుంభమేళాలో 130 పడవల ద్వారా యాత్రికులకు గంగానదిలో ప్రయాణం చేసే కల్పించి.. కనివినీ ఎరుగని రీతిలో 45 రోజుల వ్యవధిలోనే రూ.30 కోట్లు సంపాదించగలిగాడు.
భార్య నగలమ్మి పడవ కొనుక్కున్నా.. పింటూ
నిజానికి పింటు మహారా కుటుంబం ఆర్థిక పరిస్థితి మహా కుంభమేళా ముందు వరకూ దారుణంగా ఉండేది. ఈ సారి ఎలాగైనా డబ్బు సంపాదించగలననే పూర్తి విశ్వాసంతో ఇంట్లో తమ మహిళల నగలమ్మి మరీ పడవలు కొన్నాడు. ఆ ధైర్యం, తెగువకు అదృష్టం కూడా తోడు కావడంతో మహాకుంభమేళాతో పింటూ కుటుంబం దశ తిరిగింది. తరతరాలుగా ఎవరూ సంపాదించని విధంగా గణనీయమైన ఆదాయం దక్కించుకున్నాడు. 2019 కుంభమేళా అనుభవంతో ఈసారి జరిగే కార్యక్రమం మరింత ఘనంగా ఉంటుందని ఆలోచించి ఈ ప్రయత్నం చేశాడు పింటు పహారా. అయితే, పడవ కొనుగోలుకు అయ్యే ఖర్చు, ఒక పడవను నడపడానికి రోజువారీ ఖర్చుతో సహా ఇతర వివరాలను వెల్లడించలేదు.
Read Also : రాహుల్‌గాంధీకి రూ.200 జరిమానా
ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి మాజీ ప్రియురాలి హత్య
Genetic Diseases: ఒకే కులంలో పెళ్లిళ్లతో జన్యు వ్యాధులు