Chinnaswamy Stampede: చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకు నిర్వాహకులే ప్రధాన కారణం: మంత్రి జి. పరమేశ్వర
ABN , Publish Date - Aug 22 , 2025 | 09:16 AM
ఐపీఎల్ టైటిల్ గెల్చుకున్న తర్వాత ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియం వద్ద 'విక్టరీ సెలబ్రేషన్స్' ఏర్పాటు చేయగా తొక్కిసలాటకు దారితీసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర వివరణ ఇచ్చారు. ఈ విషాదానికి నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
కర్ణాటక: ఆర్సీబీ 'విక్టరీ సెలబ్రేషన్స్' సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ విషాద ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 33 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటనపై అసెంబ్లీ చర్చ సందర్భంగా కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర మాట్లాడారు. కర్ణాటక చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని.. ఈ తొక్కిసలాటకు నిర్వాహకులే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. శాసనసభలో రూల్ 69 కింద చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట కేసుపై జరిగిన చర్చకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు.
మంత్రి మాట్లాడుతూ, 'తొక్కిసలాట సంఘటన ఒక చీకటి దినం. ఈ సంఘటన చాలా బాధాకరం. మన ఇళ్లలో ఎవరైనా చనిపోతే కలిగే బాధ కంటే ఇది చాలా బాధాకరం. అందుకే, మేము RCB, KSCA, DNA లపై FIR నమోదు చేసాము. RCB జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు, వారు మే 29న ఏమి చేయాలో చర్చించారు. బెంగళూరుకు వచ్చి KSCAతో చర్చించారు. విజయోత్సవ జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. తొక్కిసలాట జరుగుతుందని ఎవరూ ముందుగానే ఊహించలేరు. దేశంలో చాలా చోట్ల తొక్కిసలాటలు జరిగాయి. నేను దీనిని సమర్థించడం లేదు. మా పోలీసు అధికారులు తప్పు చేశారు. అందుకే మేము వారిపై కూడా చర్యలు తీసుకున్నాము. ఒక పోలీసు అధికారిని సస్పెండ్ చేసాము. శాఖాపరమైన విచారణ కూడా జరుగుతోంది' అని ఆయన వివరించారు.
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తొలిసారి ఐపీఎల్ టైటిల్ కల నెరవేర్చుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. ట్రోఫీ గెల్చుకున్న వెంటనే పోలీసులు భద్రతాపరమైన సమస్యలు వస్తాయని వారించినప్పటికీ 'విక్టరీ సెలబ్రేషన్స్'కు ఏర్పాట్లు చేసింది. సోషల్ మీడియాలో అందరూ ఆహ్వానితులే అని పోస్ట్ చేయడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సంబరాల్లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం పాల్గొన్నారు. భారీ ఎత్తున అభిమానులంతా ఒకచోట గుమికూడటంతో పరిస్థితులు తొక్కిసలాటకు దారితీశాయి. ఈ దుర్ఘటన తర్వాత క్రీడల్లో ఇకపై జోక్యం చేసుకోకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి జి.పరమేశ్వర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
నేడు బిహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన..
నటి ఆరోపణ.. కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
For More National News