2035 నాటికి ఇండియాకు సొంత స్పేస్ స్టేషన్.. ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:25 PM
జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించి ఒక ప్రతిష్టాత్మక రోడ్‌మ్యాప్‌ను వివరించారు. ఈ ప్రణాళిక ప్రకారం 2035 నాటికి ఇండియా సొంత అంతరిక్ష కేంద్రం భారతీయ అంతరిక్ష్ స్టేషన్ (BAS) ఏర్పాటు చేసుకుంటుందని అన్నారు.
ISRO Chief Reveals 2040 Roadmap: న్యూఢిల్లీలో జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ప్రసంగిస్తూ.. భారత అంతరిక్ష సంస్థ భవిష్యత్తులో చేపట్టనున్న మిషన్లకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. ఈ ప్లాన్ ప్రకారం 2035 నాటికి భారతదేశానికి సొంత అంతరిక్ష కేంద్రం, భారతీయ అంతరిక్ష స్టేషన్ (BAS) ఉంటుందని అన్నారు. ఇందులో భాగంగా 2028 నాటికి మొదటి మాడ్యూల్‌ను ప్రారంభించే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే, నెక్స్ట్ జనరేషన్ లాంచర్(NGL)కు ప్రధాని మోదీ ఆమోదం తెలిపారని.. 2040 నాటికి భారతదేశం చంద్రునిపై అడుగుపెడుతుందని ఆయన అన్నారు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుడిపై వ్యోమగామిని దించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. 2040 నాటికి ప్రపంచంలోని ఇతర దేశాలతో సమానంగా భారత్ స్పేస్ టెక్నాలజీలో అభివృద్ధి సాధిస్తుందని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర దిశానిర్దేశం, దార్శనికతతో ఇస్రో చంద్రయాన్-4 మిషన్‌తో పాటు వీనస్ ఆర్బిటర్ మిషన్‌ను చేపట్టిందని వెల్లడించారు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ (BAS), 2040 నాటికి, చంద్రునిపై భారత వ్యోమగామిని దింపడమే లక్ష్యంగా ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా, ప్రధాని మోదీ, తొలిసారి ISSపై అడుగుపెట్టిన భారతీయుడిగా రికార్డు సృష్టించిన శుభాంశు శుక్లాను ఇస్రో ఛైర్మన్ ప్రశంసలతో ముంచెత్తారు.
2040 నాటికి మన దేశపు వ్యోమగామిని చంద్రునిపై పర్యటింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇస్రో ఛైర్మన్ తెలిపారు. అంతరిక్ష పరిశోధనల్లో గగన్‌యాన్ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలవనుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన నలుగురు టెస్ట్ పైలట్లను వ్యోమగాములుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం వారు బెంగళూరులోని శిక్షణ కేంద్రంలో ప్రత్యేకంగా ట్రైనింగ్ పొందుతున్నారని వెల్లడించారు. తొలిసారిగా భారత వ్యోమగాములు భూమికి దగ్గర కక్ష్యలో ప్రయాణించి, మూడు రోజుల తర్వాత భూమిపైకి తిరిగి వస్తారని చెప్పారు. ఇక రానున్న కాలంలో శుక్రగ్రహ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించడంపైనా, అంగారకుడిపై ల్యాండర్‌ను దించేందుకు చర్యలు ప్రారంభించినట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్ష బీభత్సం.. కొట్టుకుపోయిన కార్లు, నీటమునిగిన ఇళ్లు
మా ఉత్పత్తులు నచ్చకపోతే కొనకండి.. ట్రంప్ ఆంక్షలపై జైశంకర్
For More National News And Telugu News