S Jai Shankar: మా ఉత్పత్తులు నచ్చకపోతే కొనకండి.. ట్రంప్ ఆంక్షలపై జైశంకర్
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:04 PM
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిలా విదేశాంగ విధానాన్ని ఇంత బహిరంగంగా నిర్వహించిన ఏ అధ్యక్షుడిని గతంలో చూడలేదని జైశంకర్ అన్నారు. వాణిజ్య అంశాలతో పాటు వాణిజ్యేతర వ్యవహారాలకు టారిఫ్‌లు వినియోగిస్తుండటం కొత్తగా ఉందని ఉన్నారు.
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు విధించడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) ఘాటుగా స్పందించారు. భారత్ నుంచి చమురు, రిఫైన్డ్ ఉత్పత్తులు కొనుగోలుపై ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడి ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యాపార అజెండాతో సాగుతున్న అమెరికా యంత్రాంగానికి మద్దతిస్తున్న కొన్ని దేశాలు ఇతరులపై నిందలు వేసే ప్రయత్నాలు చేయడం హాస్యాస్పదమని అన్నారు.
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిలా విదేశాంగ విధానాన్ని ఇంత బహిరంగంగా నిర్వహించిన ఏ అధ్యక్షుడిని గతంలో చూడలేదన్నారు. వాణిజ్య అంశాలతో పాటు వాణిజ్యేతర వ్యవహారాలకు టారిఫ్‌లు వినియోగిస్తుండటం కొత్తగా ఉందని ఉన్నారు. ఒక్క భారత్‌తోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలతో ఆయన డీల్ చేస్తున్న విధానం ఇలాగే ఉందన్నారు. వాణిజ్య సుంకాలను 50 శాతానికి పెంచుతున్నట్టు ట్రంప్ ప్రకటించడానికి ముందు రష్యా చమురు అంశం గురించి అమెరికాతో తామెలాంటి చర్చలు జరపలేదని ఎనకానిక్ టైమ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన 'వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో జైశంకర్ తెలిపారు.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. 'మనకంటూ కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. రైతులు, చిన్న ఉత్పత్తిదారుల ప్రయోజనాలు రక్షించుకోవడం మనకు ప్రధానం. దీనిపై రాజీ ఉండదు' అని స్పష్టం చేశారు. చమురు అంశానికి వచ్చినప్పుడు ఇండియా టార్గెట్‌గా చేస్తున్న వాదనలు (సుంకాల పెంపు) అతిపెద్ద ఆయిల్ దిగుమతిదారు అయిన చైనాకు కానీ, యూరోపియన్ యూనియన్‌కు కానీ వర్తింపజేయక పోవడాన్ని మంత్రి ప్రశ్నించారు. రష్యా నుంచి అతిపెద్ద చమురు కొనుగోలుదారు భారత్ కాదని, ఇతరులు కూడా ఆ పనిచేస్తున్నారని, మనకే ఎందుకు వీటిని వర్తింపజేస్తున్నారని అన్నారు. భారతదేశ అవసరాలు, గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే తాము మాస్కో నుంచి చమురును కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ల స్థిరీకరణకు గతంలో అమెరికా ప్రోత్సహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి..
ప్రధానిపై సోషల్ మీడియాలో కామెంట్స్.. తేజస్వి యాదవ్‌పై మహారాష్ట్ర పోలీసుల కేసు
అనిల్ అంబానీ నివాసాల్లో CBI సోదాలు
For More National News And Telugu News