Tejaswi Yadav: ప్రధానిపై సోషల్ మీడియాలో కామెంట్స్.. తేజస్వి యాదవ్‌పై మహారాష్ట్ర పోలీసుల కేసు
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:15 PM
మహారాష్ట్రలోని గడ్చిరోలీ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధానిపై అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ ఎమ్మెల్యే తేజస్విపై ఆయన ఫిర్యాదు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో కేసు నమోదైంది. ప్రధాని మోదీపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ స్థానిక ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. గడ్చిరోలీ ఎమ్మెల్యే మిలింద్ నరోటే ఫిర్యాదు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రధాని బిహార్ పర్యటన నేపథ్యంలో తేజస్వి యాదవ్ అభ్యంతరకర పోస్టు పెట్టారని నరోటే ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
ఎమ్మెల్యే నరోటే ఫిర్యాదు మేరకు పోలీసులు తేజస్వి యాదవ్‌పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 196 (వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం), సెక్షన్ (పరువుకు భంగం కలిగించడం), 352 (శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశంతో అవమానించడం), సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే యూపీలో కూడా తేజస్విపై కేసు నమోదైంది. షాజహాన్‌పూర్ బీజేపీ మెట్రోపాలిటన్ అధ్యక్షురాలు శిల్పి గుప్తా ఫిర్యాదు మేరకు ఆయనపై బజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తేజస్వి అభ్యంతరకర పోస్టు పెట్టారని శిల్పి గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక బిహార్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ.. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల పాలనపై మండిపడ్డారు. వారి పాలనను చీకటి యుగంగా అభివర్ణించారు. విద్య, ఉపాధి లేక ఎన్నో తరాలు ఉన్న ఊరిని వదులుకొని పొరుగు ప్రాంతాలకు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిహార్‌ను ఆర్జేడీ కేవలం తన ఓటు బ్యాంకుగా మార్చుకుందని మండిపడ్డారు యావత్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని ప్రధాని అన్నారు. ప్రధాని ఆరోపణలపై తేజస్వి ప్రతి విమర్శలు చేశారు. గయాలో ప్రధాని అసత్యాలు పలికారని అన్నారు. ప్రజలు మాత్రం వీటిని నమ్మరని తేల్చి చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలన వివరాలను కూడా చెప్పాలని సవాలు విసిరారు.
ఇవి కూడా చదవండి:
టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతోంది.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు
‘శ్రీరామ్’ బ్యాగ్‌తో తాజ్‌మహల్ చూసేందుకు అనుమతించలేదు.. పర్యాటకుడి ఆరోపణ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి