Share News

TikTok: టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతోంది.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు

ABN , Publish Date - Aug 23 , 2025 | 09:15 AM

భారత్, చైనా దౌత్య బంధం పునరుద్ధరణ వేళ టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తేశారంటూ వస్తున్న వార్తలపై కేంద్రం తాజాగా క్లారిటీ ఇచ్చింది. టిక్‌టాక్‌పై నిషేధం ఇంకా అమల్లోనే ఉందని పేర్కొంది.

TikTok: టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతోంది.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు
TikTok still Banned India

ఇంటర్నెట్ డెస్క్: టెక్‌టాక్‌పై నిషేధం ఎత్తేసారన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఈ నిషేధం ఇంకా కొనసాగుతోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. టిక్‌టాక్ కొందరికి అందుబాటులోకి వచ్చినట్టు మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ వర్గాలు ఈ మేరకు స్పందించాయి. ‘టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేస్తూ భారత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అలా జరిగినట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే’ అని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. టిక్‌టాక్ వెబ్‌సైట్ కొందరికి అందుబాటులోకి వచ్చిందని, వీడియోలు కూడా అప్‌లోడ్ చేయగలిగారన్న వార్తలు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే, యాప్‌ స్టోర్స్‌లో మాత్రం ఇది ఇంకా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ఈ వెబ్‌సైట్‌‌ను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌లు ఇప్పటికీ బ్లాక్ చేసి ఉంచారని టెలికాం శాఖ పేర్కొంది. అంతేకాకుండా, ఆన్‌లైన్ షాపింగ్ వేదిక అలీ ఎక్స్‌ప్రెస్‌ కూడా కొందరికి అందుబాటులోకి వచ్చినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ట్రంప్ సుంకాల నేపథ్యంలో భారత్, చైనాలు దౌత్యపరంగా, వాణిజ్యపరంగా ప్రస్తుతం దగ్గరవుతున్న విషయం తెలిసిందే. అయితే, 2020 నాటి గల్వాన్ ఘర్షణల తరువాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పాతాళానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో టిక్‌టాక్‌పై భారత్ నిషేధం విధించింది. మొత్తం 59 చైనా యాప్‌లను నిషేధించింది. ఇటీవల చైనా విదేశాంగ మంత్రి భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు మధ్య సంబంధాల బలోపేతానికి పలు చర్యలు ప్రకటించారు. సరిహద్దు వెంబడి వాణిజ్యాన్ని పునరుద్ధరించడం, పెట్టుబడులకు ప్రోత్సాహం, డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసుల పునరుద్ధరణ, సరిహద్దు వెంబడి శాంతియుత వాతావరణ పరిరక్షణ వంటి చర్యలను ప్రకటించారు.

ఈ క్రమంలోనే ప్రధాని టియాన్‌జిన్‌లో జరగనున్న షాంఘాయ్ కొఆపరేషన్ సదస్సులో పాల్గొనేందుకు ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ మళ్లీ అందుబాటులోకి వచ్చిందన్న వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది. కానీ కేంద్రం మాత్రం అలాంటిదేమీ లేదని తాజాగా స్పష్టత ఇచ్చింది.


ఇవి కూడా చదవండి:

‘శ్రీరామ్‌’ బ్యాగ్‌తో తాజ్‌మహల్ చూసేందుకు అనుమతించలేదు.. పర్యాటకుడి ఆరోపణ

కాలాపానీ ప్రాంతం మీదుగా చైనాతో వాణిజ్యంపై నేపాల్ అభ్యంతరాలు.. ఖండించిన భారత్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 23 , 2025 | 10:01 AM