Delhi Telangana Bhavan ON Bathukamma: ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ABN , Publish Date - Sep 30 , 2025 | 10:07 AM
యావత్ ప్రపంచంలో వివిధ రకాల పూలతో ప్రకృతిని పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ.. అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణ బిడ్డలందరీ జీవితాల్లో వెలుగు నింపేదని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: యావత్ ప్రపంచంలో వివిధ రకాల పూలతో ప్రకృతిని పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ (Bathukamma).. అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి ( AP Jitender Reddy) అన్నారు. తెలంగాణ బిడ్డలందరీ జీవితాల్లో వెలుగు నింపేదని ఈ బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు. అంతటి ముఖ్యమైన ఈ పండుగను.. ప్రజా ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని అన్నారు. బతుకమ్మ పండుగ సందర్బంగా తెలంగాణ భవన్‌కు వచ్చిన అతిథులకు, తెలంగాణ భవన్ ఉద్యోగులు, సిబ్బందికి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయులకు ఆయన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు న్యూఢిల్లీ సహాయక సంచాలకులు, తెలంగాణ సమాచార కేంద్రం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
అస్తిత్వానికి గొప్ప ఉదాహరణ
ఈ సందర్భంగా ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 'బతుకమ్మ పండుగ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, అస్తిత్వానికి గొప్ప ఉదాహరణ. తెలంగాణ ప్రజల జీవితంలో, కల్చర్‌లో అంతర్భాగం. బతుకమ్మ అంటే ‘తల్లి.. బ్రతికి రా!’ అని అర్థం. యువతులు, మహిళలు తొమ్మిది రోజుల పాటు వివిధ పూలతో శక్తి స్వరూపిణిని పూజించి.. గౌరీ దేవికి అంకితం చేస్తారు. ఈ పండుగ మహిళా శక్తిని, ఐక్యతను చాటిచెబుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ.. బతుకమ్మ పండుగ మన ప్రాంత ప్రజల ప్రత్యేక అస్తిత్వాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడంలో కీలక పాత్ర పోషించింది' అని ఆయన వివరించారు.

అరుదైన పూల పండుగ
'ప్రకృతిని పూజించే అరుదైన పూల పండుగ మన బతుకమ్మ. వర్షాకాలం చివరిలో.. శీతాకాలం ప్రారంభంలో రంగురంగుల ప్రాంతీయ పూలు విరిసినప్పుడు.. దీనిని జరుపుకోవడం మరో ప్రత్యేకత. బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే పూలకు ఔషధ గుణాలు ఉంటాయి. చెరువులు, కుంటలు నిండి ఉండే ఈ సమయంలో.. బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తాం. దీని ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. అంతేకాదు.. భూమి - నీరు - మానవుడి మధ్య అనుబంధం పెరుగుతుంది' అని ఏపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రానికి ఊపిరి పోసిన కాంగ్రెస్
'బతుకమ్మ పండుగకు మరో ప్రత్యేకత ఉంది. వివిధ దేశాల్లో స్థిరపడిన మన తెలంగాణ బిడ్డలు.. అక్కడ బతుకమ్మ పండుగను చేసుకోవడం ద్వారా దీని ప్రత్యేకత యావత్ ప్రపంచానికి తెలుస్తోంది. అలాగే మన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు బతుకమ్మ ప్రత్యేకత తెలిసేలా.. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహిస్తున్నాం. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఊపిరి పోసిన కాంగ్రెస్.. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి బంగారు బాటలు వేస్తోంది. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం.. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుతూ.. ప్రజా సేవలో పయనిస్తోంది. నేటి యువతరం.. మన చరిత్ర గురించి, మన పండుగల ప్రత్యేకతల గురించి తెలుసుకొని రేపటి తరాలకు స్పూర్తిగా నిలవాలని.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు వారసులుగా వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నాను' అని జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగకు గుర్తింపు:డా. శశాంక్ గోయెల్
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. శశాంక్ గోయెల్ (Shashank Goel) మాట్లాడారు. బతుకమ్మ పండుగ గొప్పదనాన్ని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. ఈ వేడుకలకు ఢిల్లీలో ఉన్న తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ వేడుక కన్నులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో.. కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..
కృష్ణా, గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
Read Latest National News And Telugu News