Infant Loss: ఎందుకమ్మా ఇంత నిర్దయ
ABN , Publish Date - Sep 30 , 2025 | 06:48 AM
బిడ్డకు జన్మనించిన తల్లో.. లేదా ఆమె సంబంధీకులో.. ఎవరి నిర్దయ నిర్ణయమో కానీ.. అప్పుడే పుట్టిన ఓ ఆడశిశువు మృత్యుఒడి చేరింది.
పసికందును ఇసుకలోంచి కుక్కలు లాగుతుండగా గుర్తించిన కార్మికులు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాప మృతి
వరదయ్యపాళెం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): బిడ్డకు జన్మనించిన తల్లో.. లేదా ఆమె సంబంధీకులో.. ఎవరి నిర్దయ నిర్ణయమో కానీ.. అప్పుడే పుట్టిన ఓ ఆడశిశువు మృత్యుఒడి చేరింది. ఈ హృదయ విదారక ఘటన తిరుపతి జిల్లా వరదయ్యపాళెంలో వెలుగుచూసింది. వరదయ్యపాళెం బస్టాండు సమీపంలోని ఓ దుకాణం వద్ద ఓ యువతి ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆడశిశువుకు జన్మనిచ్చింది. అక్కడి పరిస్థితిని బట్టి ఆ దుకాణం ముందే ఆమె ప్రసవించినట్లు తెలుస్తోంది. అక్కడికి సమీపంలోనే రోడ్డు పక్కన నిర్మాణానికి సంబంధించిన ఇసుక కుప్ప ఉండగా, ఎవరు చేశారోకానీ.. ఆ పసికందును అందులో పైపైకి కప్పిపెట్టి వెళ్లిపోయారు. సోమవారం ఉదయాన్నే ఓ కుక్క ఆ పసికందు చేతిని ఇసుకలో నుంచి లాగుతుండగా పారిశుధ్య కార్మికులు గమనించి కొన ఊపిరితో ఉన్న పసికందును పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సూళ్లూరుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పాప పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పాప మృతి చెందినట్టు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శిల్ప తెలిపారు.