Hair Fall Reasons: జుట్టు పెరగడం ఆగిపోయిందా? ఈ విటమిన్ల లోపమే కారణం కావచ్చు!
ABN , Publish Date - Aug 25 , 2025 | 09:40 AM
జుట్టు రాలడానికి లేదా జుట్టు పెరుగుదల పూర్తిగా ఆగిపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. కానీ, ప్రధాన కారణం మాత్రం శరీరంలో పోషకాహారం లోపించడమే. వెంట్రుకల పెరుగుదలకు సరైన పోషకారం అవసరం. ముఖ్యంగా ఈ కింది విటమిన్లు లభించనప్పుడే పెరుగుదల ఆగిపోతుంది.
Essential Vitamins for Hair Growth: ఒత్తైన, పొడవాటి మెరిసే జుట్టు పొందాలని ప్రతి ఒక్కరి కోరిక. నేటి బిజీ జీవితంలో అది సాధ్యం కావడం లేదు. పైగా జుట్టు రాలడం, పల్చబడటం అనేది చాలా సాధారణ సమస్యగా మారింది. ఆహారపు అలవాట్లలో మార్పులు, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా, ప్రతి ఇద్దరిలో ఒకరు హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. పురుషులు లేదా మహిళలు ఎవరైనా కావచ్చు. జుట్టు రాలినా, చుండ్రు లేదా జుట్టు పెరుగుదల ఆగిపోయినట్లు అనిపించినా కంగారు పడిపోతారు. కానీ, ఈ కింద విటమిన్ల లోపం వల్ల వెంట్రుకల పెరుగుదల ఆగిపోతుంది. కాబట్టి, ఏ విటమిన్ లోపిస్తే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
1.బయోటిన్(విటమిన్-B7)
బయోటిన్‌ను తరచుగా 'హెయిర్ విటమిన్' అని పిలుస్తారు. ఈ విటమిన్ జుట్టు, చర్మం, గోళ్లకు చాలా ముఖ్యమైనది. బయోటిన్ జుట్టు ప్రధాన నిర్మాణ యూనిట్ అయిన కెరాటిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ విటమిన్ లోపిస్తే జుట్టు పల్చబడటం ప్రారంభమవుతుంది, వేగంగా రాలిపోతుంది. పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది. అంతేకాకుండా, గోళ్లు విరగడం, చర్మంపై దద్దుర్లు కూడా రావచ్చు. ఈ సమస్యను తగ్గించుకునేందుకు గుడ్డు పచ్చసొన, గింజలు (బాదం, వాల్‌నట్‌లు), విత్తనాలు (పొద్దుతిరుగుడు విత్తనాలు), చిలగడదుంపలు, పాలకూర, కాలీఫ్లవర్ వంటివి తినాలి.
2.విటమిన్ డి
విటమిన్ డి ఎముకలకు మాత్రమే కాకుండా జుట్టు కుదుళ్ల ఆరోగ్యానికి కూడా ముఖ్యమైనది. ఈ విటమిన్ కొత్త జుట్టు కుదుళ్లను సృష్టించడంలో, ఉన్న కుదుళ్లను చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది తక్కువైతే జుట్టు విపరీతంగా రాలిపోతుంది. పెరుగుదల సైతం నెమ్మదిస్తుంది. అలోపేసియా వంటి సమస్యలు కూడా ఈ లోపంతో సంబంధం కలిగి ఉంటాయి. విటమిన్ డి కోసం ఉదయపు సూర్యకాంతిలో రోజూ 5-10 నిమిషాల పాటు గడపాలి. ఇంకా కొవ్వు చేపలు (సాల్మన్, మాకేరెల్), గుడ్లు, బలవర్థకమైన పాలు, పెరుగు కూడా తరచూ తినాలి.
3.ఇనుము
శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేయడానికి ఐరన్ అవసరం. ఇది శరీరం అంతటా ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్, పోషకాలను అందించడంలో ఐరన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో జుట్టు రాలడానికి ఐరన్ లోపం ఒక ప్రధాన కారణం. దీనివల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి జుట్టు పెరగడానికి బదులుగా రాలిపోతుంది. ఆకుకూరలు (పాలకూర), బీన్స్, కాయధాన్యాలు, టోఫు, ఎర్ర మాంసం, ఎండుద్రాక్షలు. విటమిన్ సి తీసుకోవడం వల్ల శరీరానికి ఐరన్ శోషించుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది.
4.విటమిన్ సి
విటమిన్ సి అనేది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా చాలా అవసరం. అలాగే, విటమిన్ సి శరీరం ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి లోపం వల్ల జుట్టు పొడిబారడం, చీలిపోవడం, బలహీనంగా మారడం జరుగుతుంది. దీని లోపం ఇనుము శోషణను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది పరోక్షంగా జుట్టు రాలడానికి కారణమవుతుంది. విటమిన్ సి కోసం తరచూ సిట్రస్ పండ్లు (నారింజ, నిమ్మ, బత్తాయి), కివి, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్, బ్రోకలీ తీసుకుంటూ ఉండాలి.
5.విటమిన్-ఇ
విటమిన్ E కూడా ఒక ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది . మెరుగైన రక్త ప్రసరణ అంటే జుట్టు కుదుళ్లకు ఎక్కువ పోషకాలు ఆక్సిజన్ చేరుతుంది. తలపై చర్మం ఆరోగ్యం సరిగా లేకపోవడం, జుట్టు పొడిబారడం,పెరుగుదల మందగించడం విటమిన్ E లోపానికి సంకేతాలు కావచ్చు. బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, అవకాడో, పాలకూర, కివి తినడం వల్ల విటమిన్- ఇ సమస్యను అదిగమించవచ్చు.
6.విటమిన్-ఎ
శరీరంలోని ప్రతి కణం పెరుగుదలకు విటమిన్ ఎ చాలా అవసరం. జుట్టు శరీరంలో వేగంగా పెరిగే కణాలలో ఒకటి. ఇది తలలో సెబమ్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. ఇది తలపై చర్మాన్ని తేమగా ఉంచుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ ఎ అధిక మోతాదు కూడా జుట్టు రాలడానికి కారణమవుతుందని గుర్తుంచుకోండి. చిలగడదుంపలు, క్యారెట్లు, పాలకూర, గుమ్మడికాయ, గుడ్లు తింటే హెయిర్ ఫాల్ సమస్య శాశ్వతంగా పోతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
పండుగ టైంలో ఇలా స్మార్ట్‌గా షాపింగ్ చేయండి.. మనీ సేవ్ చేసుకోండి
పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ ఇచ్చే ముందు చెప్పాల్సిన 5 'గోల్డెన్ రూల్స్'!