Jobless Husband: ఉద్యోగం లేని భర్తను ఎగతాళి చేయడం క్రూరత్వమే.. కోర్టు కీలక తీర్పు
ABN , Publish Date - Aug 25 , 2025 | 07:30 AM
భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం. కానీ చిన్న కారణాలతోనే అర్థం చేసుకోలేక విడిపోయిన జంటలు అనేకం ఉన్నాయి. అచ్చం అలాంటి సంఘటనపై కోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
భార్య భర్తల మధ్య చిన్న విభేదాలు రావడం సహజం. కానీ అవే ఏదో ఒక రోజు పెద్దగా మారి, వారి మధ్య గొడవకు దారి తీస్తాయి. అర్థం చేసుకునే ఓపిక కోల్పోయిన ప్రతిసారీ గొడవలు పెరుగుతాయి. సరిగ్గా మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే చిన్న కారణాలే ఎన్నో జంటల విభేదాలకు, చివరికి విడాకులకు దారి తీస్తున్నాయి. ఇలాంటి సంఘటన ఇటీవల జరిగింది.
ఛత్తీస్‌గఢ్ హైకోర్టు (Jobless Husband Chhattisgarh High Court) ఇలాంటి ఒక కేసులో సంచలన తీర్పు వెలువరించింది. భర్తను ఉద్యోగం లేదని ఎగతాళి చేయడం మానసిక క్రూరత్వంగా పరిగణించి, 52 ఏళ్ల లాయర్‌కు విడాకులు మంజూరు చేసింది. ఈ తీర్పు మన జీవితంలో సంబంధాలు, గౌరవం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేస్తోంది.
అసలు ఏం జరిగింది?
డిసెంబర్ 26, 1996న భిలైలో వివాహం చేసుకున్న ఒక జంట కథ ఇది. వీరికి 19 ఏళ్ల కూతురు, 16 ఏళ్ల కొడుకు ఉన్నారు. ఈ భర్త ఒక లాయర్, తన భార్యకు PhD పూర్తి చేయడంలో సహాయం చేశాడు. అంతేకాదు, ఆమె ఒక స్కూల్ ప్రిన్సిపాల్‌గా ఉద్యోగం సంపాదించేలా చేశాడు. కానీ, ఇక్కడే ట్విస్ట్ ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత, ఈ జంట మధ్య సమస్యలు మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాలకు గొడవలు పెరిగాయి. ముఖ్యంగా, కోవిడ్ సమయంలో కోర్టులు మూతపడడంతో భర్త ఆదాయం ఆగిపోయింది.
ఆ క్రమంలోనే..
అలాంటి కష్ట సమయంలో, భార్య ఆయనకు ఉద్యోగం లేనందుకు ఎగతాళి చేసింది. ఈ ఎగతాళి ఆయనకు మానసికంగా ఎంతో బాధ కలిగించింది. 2020 ఆగస్టులో ఒక వాగ్వాదం తర్వాత, ఆమె తన కూతురితో కలిసి ఇంటిని వదిలి వెళ్లిపోయింది. భర్త, కొడుకు ఆమెను తిరిగి ఇంటికి రప్పించేందుకు ప్రయత్నించినా, ఆమె తిరిగి రాలేదు. 2020 సెప్టెంబర్ 16 నుంచి వీరు విడిగా జీవిస్తున్నారు.
ఇది ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ముందుకు రాగా, జస్టిస్ రజనీ దుబే, జస్టిస్ అమితేంద్ర కిశోర్ ప్రసాద్‌ల డివిజన్ బెంచ్ ఈ కేసును విచారించింది. 2023 అక్టోబర్‌లో ఫ్యామిలీ కోర్టు ఈ భర్త విడాకుల పిటిషన్‌ను తిరస్కరించింది. కానీ, హైకోర్టు ఆ తీర్పును తిరిగి సమీక్షించి, భర్తకు విడాకులు మంజూరు చేసింది.
మానసిక క్రూరత్వం: భర్త ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సమయంలో ఆయనను ఎగతాళి చేయడం మానసిక క్రూరత్వంగా పరిగణించింది. ఒకరినొకరు గౌరవించడం, అర్థం చేసుకోవడం సంబంధంలో చాలా ముఖ్యం. కానీ, ఈ భార్య చేసిన ఎగతాళి ఆయన గౌరవాన్ని దెబ్బతీసిందని కోర్టు ప్రస్తావించింది.
విడిపోవడం: భార్య ఎలాంటి కారణం లేకుండా ఇంటిని వదిలి వెళ్లిపోయింది. భర్త, కొడుకు ఆమెను తిరిగి రప్పించేందుకు ప్రయత్నించినా, ఆమె రాలేదు. ఇది విడిపోవడంగా హిందూ మ్యారేజ్ యాక్ట్, 1955 కింద పరిగణించారు.
వివాహం బ్రేక్‌డౌన్
ఈ జంట వివాహం పూర్తిగా బ్రేక్‌డౌన్ అయిందని కోర్టు గుర్తించింది. భార్య కోర్టు విచారణకు కూడా హాజరు కాలేదు, ఇది ఆమె వివాహాన్ని కొనసాగించే ఉద్దేశం లేనట్టు చూపిస్తుంది. ఈ కారణాలతో కోర్టు భర్తకు విడాకులు మంజూరు చేసింది. ఒక జీవిత భాగస్వామి ప్రవర్తన, మాటల ద్వారా లేదా అనవసర డిమాండ్ల ద్వారా మానసికంగా క్రూరత్వం చేస్తే, అది విడాకులకు ఆధారం అవుతుందని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పు ఎందుకు ముఖ్యం?
ఈ తీర్పు మనకు కీలక విషయాలను గుర్తు చేస్తుంది. మొదటిది సంబంధాల్లో ఒకరినొకరు గౌరవించడం చాలా ముఖ్యం. ఆర్థిక కష్టాలు, ఉద్యోగం లేని సమయాలు ఎవరికైనా రావచ్చు. అలాంటి సమయంలో జీవిత భాగస్వామికి సపోర్ట్ చేయాలి కానీ ఎగతాళి చేయకూడదు. రెండవది, వివాహం తర్వాత ఇద్దరి మధ్య అనుబంధం చాలా ప్రధానం. ఒకరు ఆ అనుబంధాన్ని కొనసాగించే ఉద్దేశం లేకపోతే, ఆ సంబంధం కొనసాగడం చాలా కష్టం. దీని గురించి ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి. అయినా కుదరకపోతే అప్పుడు నిర్ణయించుకోవాలి.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి