Fake Doctor Tragedy: వైద్య డిగ్రీ లేని వ్యక్తి ప్రసవం..తల్లి, బిడ్డ మృతి, డాక్టర్, నర్సులు అరెస్ట్
ABN , Publish Date - Aug 25 , 2025 | 08:15 AM
మన దేశంలో ఇంకా చాలా చోట్ల వైద్య అర్హత లేని వ్యక్తులు చికిత్సల పేరుతో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సరైన వైద్య విద్య లేకుండానే చికిత్స పేరుతో ప్రాణాంతక ప్రయోగాలు చేస్తున్నారు. ఇటీవల కూడా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
దేశంలో వైద్య రంగం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఇంకా అనేక ప్రాంతాల్లో అర్హత లేని వ్యక్తులు డాక్టర్ల ముసుగులో నకిలీ వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలు కోల్పోయేలా చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో చోటుచేసుకుంది. ఒక నర్సింగ్ హోమ్‌లో, వైద్య అర్హత లేని వ్యక్తి డెలివరీ చేయడంతో ఒక తల్లి, ఆమె నవజాత శిశువు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. గంజాం జిల్లాలోని డెంగౌస్తాలో మంగులు చరణ్ ప్రధాన్ అనే 35 ఏళ్ల వ్యక్తి ఒక నర్సింగ్ హోమ్ (Fake Doctor Tragedy) నిర్వహిస్తున్నాడు.
సహాయక నర్సులు
ఆయనకు ఎలాంటి వైద్య అర్హత లేదు. కానీ మే 11న ఒక మహిళ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరినప్పుడు, అతను ఇద్దరు సహాయక నర్సులతో కలిసి డెలివరీ చేశాడు. ఈ ఇద్దరు సహాయక నర్సులు మధుస్మితా పట్టనాయక్, ప్రమోదిని గమాంగో. వీళ్లకు కూడా డెలివరీ చేసే అనుభవం, అర్హత సరిగ్గా లేవు. అసలు ఆ నర్సింగ్ హోమ్‌లో రిజిస్టర్డ్ డాక్టర్ ఎవరూ లేరు.
సౌకర్యాలు ఉన్నాయని..
ఈ ఘటనలో బాధితురాలు రోజీ నాయక్. ఆమె భర్త బాబు నాయక్ చెప్పిన ఫిర్యాదు ప్రకారం, నర్సింగ్ హోమ్ వాళ్లు తమకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని, సురక్షితంగా డెలివరీ జరుగుతుందని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ మాటలు నమ్మి, రోజీని మే 11న అక్కడ చేర్పించారు. నాలుగు గంటల ప్రసవ వేదన తర్వాత డెలివరీ జరిగింది. కానీ దురదృష్టవశాత్తూ, పుట్టిన బిడ్డ కొద్దిసేపటికే మరణించింది. రోజీ కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో MKCG మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే కన్నుమూసింది.
పోలీసులకు ఫిర్యాదు
ఈ ఘటన తర్వాత, బాబు నాయక్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. డిగపహండి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ప్రశాంత్ కుమార్ చెప్పినట్టు, మంగులు చరణ్ ప్రధాన్‌ను ఆదివారం అరెస్ట్ చేశారు. ఇద్దరు సహాయక నర్సులను కూడా మే 19, ఆగస్టు 10 తేదీల్లో అరెస్ట్ చేశారు. ఈ నర్సింగ్ హోమ్ వాళ్లు తప్పుడు హామీలతో ఆ కుటుంబాన్ని మోసం చేశారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన నేపథ్యంలో ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లలో చేరే ముందు వాటి విశ్వసనీయత గురించి తప్పక తెలుసుకోవాలి. అక్కడ రిజిస్టర్డ్ డాక్టర్లు ఉన్నారా, సరైన సౌకర్యాలు ఉన్నాయా లేదో చూడాలి. మరోవైపు ప్రభుత్వం కూడా ఇలాంటి నర్సింగ్ హోమ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి