Parenting Tips: పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ ఇచ్చే ముందు చెప్పాల్సిన 5 'గోల్డెన్ రూల్స్'!
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:02 PM
నేటితరం పిల్లలు ఊహ తెలియక ముందు నుంచే స్మార్ ఫోన్‌తో కనెక్ట్ అయిపోతున్నారు. మొబైల్ చేతికివ్వందే మాట వినకుండా మారాం చేస్తుంటారు. స్మార్ట్‌ఫోన్ వారి ముఖంలో ఆనందాన్ని తీసుకురావచ్చు. కానీ, దాని వల్ల పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోననే తల్లిదండ్రుల ఆందోళనలోనూ నిజముంది. కాబట్టి, పిల్లలకు ఫోన్ ఇచ్చేముందు తల్లిదండ్రులు ఈ 5 'గోల్డెన్ రూల్స్' తప్పక చెప్పాలి.
మారుతున్న కాలంతో పాటు, ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమే కాదు. పిల్లలు చదువుకునే విధానం కూడా పూర్తిగా మారిపోయింది. నేడు పిల్లల చదువు, వినోదం, గేమ్స్ అన్నీ స్మార్ట్‌ఫోన్ చుట్టూనే తిరుగుతున్నాయి. పిల్లల కోసం మొబైల్ కొనాలని పేరెంట్స్ భావిస్తే.. కచ్చితంగా కొన్ని ముఖ్యమైన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే పిల్లల కోసం స్మార్ట్‌ఫోన్ కొనడం అనేది సాధారణ విషయం కాదు. వారి చిన్న మనస్సు ప్రపంచంతో కనెక్ట్ అయ్యే విధానాన్ని రూపొందించే అతిపెద్ద మార్పు. పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇస్తే వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోవచ్చు. కానీ, ఏ మాత్రం తేడా జరిగినా వారి ఫ్యూచర్ ప్రమాదంలో పడుతుందని పేరెంట్స్ గుర్తుంచుకోవాలి. పిల్లలకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వకపోతే ఇంటర్నెట్, సోషల్ మీడియా, గేమ్స్ వ్యసనం వారిని చదువులు, మానసిక ఆరోగ్యం, నైతిక ప్రవర్తనకు దూరం చేస్తుంది. దీనిని నివారించడానికి, తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇచ్చే ముందు ఈ 5 రూల్స్ తప్పక పెట్టాల్సిందే.
పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇచ్చే పెట్టాల్సిన 5 రూల్స్
1.పరిమిత స్క్రీన్ సమయం
పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చేటప్పుడు వారి స్క్రీన్ టైమ్‌ను పేరెంట్స్ సెట్ చేయాల్సిందే. ఎక్కువసేపు మొబైల్ వాడటం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ముందుగానే వివరించాలి. ఇది వారి చదువులపైనే కాకుండా వారి ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుందని సున్నితంగా చెప్పాలి.
2.డివైజ్ కేర్
పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా వాడమని కూడా చెప్పాలి. నీరు, దుమ్ము ఫోన్‌లను ఎలా దెబ్బతీస్తాయో వారికి వివరించాలి. మొబైల్ ఫోన్‌లను సరిగ్గా నిర్వహిస్తే అవి చాలా కాలం పాటు సురక్షితంగా ఉంటాయని తెలపాలి.
3.ఆన్‌లైన్ భద్రతా సమాచారం
పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇచ్చే ముందు అపరిచితులతో ఫోన్‌లో చాట్ చేయకూడదని వారికి వివరించండి. దీనితో పాటు, ఏదైనా తెలియని లింక్‌పై క్లిక్ చేయడం వల్ల కలిగే ప్రమాదం గురించి కూడా వారికి అవగాహన కల్పించండి. ఫోన్‌లో వారి వ్యక్తిగత వివరాలను ఏ అపరిచితుడితోనూ పంచుకోకూడదని చెప్పండి.
4.సోషల్ మీడియాపై నిఘా
సోషల్ మీడియాలో ఏమి షేర్ చేయాలో, ఏమి చేయకూడదో పిల్లలకు వివరించండి. తప్పుడు పోస్ట్‌లు, ఫోటోలు లేదా వీడియోలు భవిష్యత్తులో వారికి ఎలా సమస్యలను కలిగిస్తాయో వివరించండి.
5.నిజ జీవితానికి, సామాజిక జీవితానికి మధ్య సమతుల్యత
ఈ రోజుల్లో పిల్లలు బయట స్నేహితులతో ఆడుకోవడం లేదా తల్లిదండ్రులతో మాట్లాడటం కంటే ఫోన్‌లో సమయం గడపడానికి ఇష్టపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఫోన్‌కు బదులుగా స్నేహితులతో ఆడుకోవడం, పుస్తకాలు చదవడం, కుటుంబంతో సమయం గడపడం వంటి అంశాల ప్రాముఖ్యతను పిల్లలకు వివరించండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
ఓవర్ థింకింగ్ ట్రాప్‌లో పడ్డారా? పరిష్కార మార్గాలు ఇవే..
బాత్రూం బకెట్లు పసుపుగా మారాయా? ఈ సింపుల్ చిట్కాలతో కొత్త వాటిలా మెరుస్తాయ్!