US Lifestyle: భారత్‌కు వచ్చి తప్పు చేశా.. లైఫ్ దిగజారుతోంది.. టెకీ ఆవేదన
ABN , Publish Date - Aug 22 , 2025 | 02:52 PM
హెచ్-1బీ వీసా గడువు ముగియడంతో మూడేళ్ల క్రితం ఇండియాకు తిరిగొచ్చిన నాటి నుంచీ తన జీవితం తిరోగమనంలోనే ఉందంటూ ఓ టెకీ నెట్టింట ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా నుంచి తిరిగొచ్చిన ఓ భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇక్కడి ఉద్యోగ పరిస్థితులకు తట్టుకోలేక తన ఆవేదనను నెట్టింట వెళ్లబోసుకున్నాడు. అక్కడి లైఫ్ మెరుగ్గా ఉందంటూ కామెంట్ చేశాడు. ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కొందరు అతడితో ఏకీభవిస్తే మరికొందరు మాత్రం సున్నిత విమర్శలు చేశారు.
‘అమెరికాలో మాస్టర్స్ చేశా. ఆ తరువాత నాలుగేళ్లు అక్కడే పని చేశా. కానీ అదృష్టం బాగాలేక హెచ్-1బీ వీసా కోల్పోయా.2022లో తిరిగి వెనక్కు రావాల్సి వచ్చింది. నాటి నుంచీ నా లైఫ్ తిరోగమనంలోనే ఉంది. చేసే పని ఒకటే అయినా ఇక్కడి కంటే అమెరికాలో ఎనిమిది రెట్లు ఎక్కువ సంపాదించే వాడిని. అక్కడి పొదుపు కూడా ఎక్కువగా ఉండేది. అమెరికాలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మౌలిక వసతులు, నాణ్యత అన్నీ మెరుగ్గా ఉండేవి. కానీ ఇక్కడ చిల్లర కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. నా మాస్టర్స్ డిగ్రీ, అమెరికా పని అనుభవాన్ని కంపెనీలు ఖాతరు చేయడం లేదు. ఆశించిన మేర జీతం ఇవ్వట్లేదు’ అని అన్నారు. ఇక్కడికి వచ్చి పెద్ద తప్పు చేసినట్టు అయ్యిందని కామెంట్ చేశారు.
ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. ‘అమెరికా ప్రభుత్వమే ఇంటికి పంపించేస్తే నువ్వు చేసిన తప్పిదం ఏముంది’ అని కొందరు ఆయన పోస్టుపై లాజికల్ ప్రశ్నలు సంధించారు. అనేక మందికి ఇలాంటి భ్రమే ఉందని కొందరు అన్నారు. అమెరికా స్థాయిలో ఇక్కడ జీతాలు ఉండవని పేర్కొన్నారు. ఏటా రూ.60 లక్షల జీతం ఉంటే కానీ భారత్‌లో సుఖంగా జీవించలేమని తేల్చి చెప్పారు. కొందరేమో అతడికి కెనడా లేదా ఐరోపా దేశాల్లో ఉద్యోగాలకు ప్రయత్నించాలని సూచించారు.
ఇదిలా ఉంటే ట్రంప్ సర్కారు వలసలపై ఉక్కుపాదం మోపుతోంది. చిన్న చిన్న తప్పులకే విదేశీయుల వీసాల రద్దు చేసి స్వదేశానికి డిపోర్టు చేస్తోంది. తాజాగా అక్కడుంటున్న సుమారు 55 మిలియన్‌ల మంది విదేశీయుల వీసాలను సమీక్షించేందుకు ట్రంప్ సర్కారు నిర్ణయించింది. ట్రంప్ నిర్ణయంతో స్టూడెంట్స్ మొదలు టూరిస్టుల వరకూ అన్ని వర్గాల వారిపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోందని నిపుణులు కామెంట్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
అంతరిక్షం నుంచి తీసిన టైమ్ లాప్స్ వీడియో.. శుభాన్షూ శుక్లా షేర్ చేసిన ఈ దృశ్యాన్ని చూస్తే..
పుతిన్ అంటే ఇదీ.. ఈ అమెరికా వ్యక్తికి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో చూస్తే