OpenAI First Office: భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణకు ఓపెన్ ఏఐ కీలక నిర్ణయం
ABN , Publish Date - Aug 22 , 2025 | 03:25 PM
ఓపెన్ ఏఐ గురించి మీకు తెలుసు కదా. ChatGPTని సృష్టించిన ఈ కంపెనీ ఇప్పుడు ఇండియాలో తన తొలి ఆఫీస్‌ని ఓపెన్ చేయబోతోంది. అవును, మీరు విన్నది నిజమే. అది ఎక్కడ, ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ ఏఐ టెక్ సంస్థ OpenAI కీలక ప్రకటన చేసింది. ఈ సంవత్సరాంతంలో న్యూఢిల్లీలో తన తొలి ఆఫీస్ ప్రారంభించనున్నట్లు తెలిపింది. భారత్‌లో OpenAI టూల్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా తర్వాత, భారత్ ఈ కంపెనీకి రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ క్రమంలో కంపెనీ ఇప్పటికే స్థానిక సిబ్బందిని నియమించడాన్ని ప్రారంభించింది.
AIకి పెరుగుతున్న ఆదరణ
OpenAI అంచనాల ప్రకారం భారత్ AI అప్లికేషన్స్ ని వేగంగా అంగీకరిస్తోంది. గత సంవత్సరంలో భారతదేశంలో వారానికి 4 సార్లు ChatGPT వాడేవారిలో పెరుగుదల భారీగా నమోదైంది. అలాగే భారతదేశం ప్రపంచంలో టాప్ 5 డెవలపర్ మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. దీంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ChatGPTని వాడే విద్యార్థులు భారతదేశంలోనే అత్యధికంగా ఉన్నారు.
భారతదేశంలో AI అవకాశం
ఇండియాలో AIకి మంచి అవకాశాలు ఉన్నాయని CEO సామ్ ఆల్ట్‌మన్ తెలిపారు. ప్రపంచ స్థాయిలో AI ఎదిగేందుకు సాంకేతిక ప్రతిభ, అద్భుతమైన డెవలపర్ ఎకోసిస్టమ్ వంటివి ఇండియాలో ఉన్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వ మద్దతుతో మొదటి ఆఫీస్ ప్రారంభించి అందుబాటులోకి తెస్తామని సామ్ ధీమా వ్యక్తం చేశారు.
OpenAI తమ స్థానిక టీమ్‌ను ఏర్పరుచుకోవడం ద్వారా ప్రభుత్వ సంస్థలు, వ్యాపారాలు, విద్యా సంస్థలతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించబోతుంది. ఇందులో భాగంగా కొత్త ఫీచర్లు, టూల్స్ ని భారతదేశపు అవసరాలకు అనుగుణంగా రూపొందించేందుకు దృష్టి సారించబోతుంది. భారతదేశంలో ఇప్పటికే AI ఆధారిత వ్యవసాయ సేవలు, సమర్థవంతమైన పాలన వంటి రంగాలలో OpenAI టూల్స్ ఉపయోగపడుతున్నాయి.
ప్రభుత్వ అభిప్రాయం
OpenAI ఇక్కడ తన కేంద్రం ప్రారంభించడం ద్వారా ఇండియాలో AI ప్రతిభ, మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ప్రపంచంలో AI ప్రభావాన్ని పెంచేందుకు అవకాశం ఉందని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మంత్రి భారతదేశంలో IndiaAI Mission గురించి కూడా ప్రస్తావించారు. AI ప్రామాణికత, సమగ్ర అభివృద్ధిలో OpenAI భాగస్వామ్యం ఎంతో కీలకమని చెప్పారు.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి