Overthinking Symptoms: ఓవర్ థింకింగ్ ట్రాప్‌లో పడ్డారా? పరిష్కార మార్గాలు ఇవే..
ABN , Publish Date - Aug 21 , 2025 | 07:27 AM
ఈ రోజుల్లో చాలా మంది అతిగా ఆలోచించడం అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి కారణం లేకుండా ఎక్కువసేపు దేని గురించైనా ఆలోచిస్తే మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి పరిస్థితి తరచుగా భయం, ఆందోళన లేదా గందరగోళానికి దారితీస్తుంది. ఈ ఓవర్ థింకింగ్ సమస్య నుంచి వీలైనంత త్వరగా బయటకపడకపోతే లేనిపోని అనర్థాలకు కారణమవుతుంది. కాబట్టి ఈ సమస్యను బయటపడేందుకు ఇలా చేయండి..
అందరూ దేని గురించైనా ఆలోచన చేయడం అన్నది అత్యంత సాధారణ విషయం. కొన్నిసార్లు ఒత్తిడి, ఆందోళన ఉండటమూ సహజమే. కానీ, కొంతమంది జరిగిన విషయాలనే కాక జరగని విషయాలను గురించే అదే పనిగా ఆలోచినస్తూ బుర్ర పాడుచేసుకుంటారు. ఏదేదో జరిగిపోతోందని ఊహించుకుంటూ ఆలోచనల వలలో చిక్కుకుంటారు. ఈ సుడిగుండం నుంచి బయటపడటం చెప్పినంత తేలిక కాదు. ఇంతకీ, అతిగా ఆలోచించే వారిలో ప్రధానంగా కనిపించే లక్షణాలేంటి? ఆలోచనల సునామీని నిలువరించాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నలకు మానసిక నిపుణులు చెబుతున్న సమాధానాలు ఇవే..
ఓవర్ థింకింగ్‌కు కారణాలేంటి?
లక్ష్యానికి చేరుకునే క్రమంలో విఫల ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారు అతిగా ఆలోచనలు చేస్తారు. కొంతమంది అనవసరమైన అంచనాలతో నిండిన సంచిని నెత్తికెత్తుకుని అది నా వల్ల అవుతుందా.. లేదా.. అని సతమవుతూ ఉంటారు. అంచనాలను అందుకోలేమనే భయం నిత్యం వెంటాడుతూ ఉంటుంది. తమను తాము నిరూపించుకోవడానికో, సురక్షితంగా ఉండటానికో, ప్రతి అంశాన్ని వెయ్యి విధాలుగా ఆలోచిస్తారు. తద్వారా అభద్రత భావం మరింత పెరుగుతుంది. కోరుకున్న వారిని కోల్పోవడం, జీవితంలో ఓడిపోయామనే బాధ, సమాజం నుంచి తరచూ ఎదురయ్యే అవహేళనలు, ఆర్థిక సమస్యలు, కెరీర్లో వెనుకబడిపోవడం, ఇలా అతిగా ఆలోచనలు చేయడానికి గల కారణాలు ఎన్నో..
ఓవర్ థింకింగ్ చేసేవారిలో కనిపించే లక్షణాలు?
ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించడం. ఆలోచన కారణంగా పదే పదే గొడవ పడటం అతిగా ఆలోచించేవారి ప్రధాన లక్షణాల్లో ఒకటి.
ఒకే విషయం గురించి పదే పదే కాల్ చేసి విసిగించడం.
పనిపైనా ఆసక్తి సన్నగిల్లడం. ఒకవేళ చేయాలని ప్రయత్నించినా ఏకాగ్రత కుదరకపోవడం.
ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో అని చింతిస్తూ సమయాన్ని వృథా చేయడం.
భావోద్వేగ ఉచ్చులో చిక్కుకుని నిత్యం ఒత్తిడి, ఆందోళన, ఆలోచనల వలయం నుంచి బయటికి రాలేకపోవడం.
మనస్సు పూర్తిగా అలసిపోయి ఒత్తిడి పెరిగినట్లు అనిపించడం. కొత్త ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోవడం.
ఓవర్ థింకింగ్ సమస్య ఉన్న వ్యక్తులు నిత్యం నెగెటివ్ మోడ్ లోనే ఉంటారు. వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల వ్యక్తిగత పురోగతికి ఆటంకం కలుగుతుంది.
ఈ సమస్య నిద్ర, ఆహారం, శ్రద్ధ, వ్యక్తిగత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మనశ్శాంతిని కోల్పోతారు. తమని తాము శక్తిహీనులుగా భావిస్తారు.
స్వంత నిర్ణయాలపై నమ్మకం లేక గందరగోళ స్థితికి చేరుకుంటారని మానసిక నిపుణులు అంటున్నారు.
ఎవరైనా ఏమైనా మాట్లాడినా లేదా మెసేజ్ చేసినా దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తారు.
నివారణా చిట్కాలు
మీ మనసులోకి వచ్చే ఆలోచనలను కాగితంపై రాసుకోండి. ముందుగా మీరు అతిగా ఆలోచించడానికి గల కారణాలను గుర్తించాలి. మీరు ఆందోళన చెందుతున్న సంబంధిత అంశానికి 15-20 నిమిషాలు కేటాయించాలి. ఆ తర్వాత దానిని అక్కడే వదిలేసి.. మీ దృష్టిని వేరే దానిపై కేంద్రీకరించండి అని నిపుణులు అంటున్నారు.
నడవడం, సంగీతం వినడం, నీటితో ముఖం కడుక్కోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించడం అంటే ఒక వృత్తంలో తిరగడం లాంటిది. మీరు ఎంతసేపు ఆలోచించినా మళ్లీ చుట్టూ తిరిగి మొదటికే వస్తారు. ఆ వృత్తం నుండి బయటపడి ముందుకు సాగడానికి ప్రయత్నించాలి.
ముఖ్యమైన విషయాలపై నిర్ణయాలు తీసుకునే ముందు 90:10 నిష్పత్తిని అనుసరించాలి. 90 శాతం స్వీయ విశ్లేషణ, 10 శాతం ఇతరుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
అతిగా ఆలోచించే వ్యక్తులు ఇతరులు చెప్పేదానికి ఎక్కువ విలువ ఇస్తారు. వారి స్వంత ఆలోచనలను పరిగణనలోకి తీసుకోరు. ఇది చివరికి సమస్యలకు దారితీస్తుంది.
సానుకూల దృక్పథం లేనివారే అధిక ఆలోచనలతో బాధపడేవారు. వారికి ఏదైనా చెడు జరుగుతుందనే ఆలోచనలు వారిని వెంటాడతాయి. కానీ అంతా మంచిగానే జరుగుతుందనే సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటే ఆలోచనల తీవ్రత తగ్గే అవకాశం ఉంది.
గతంలో ఏం జరిగిందో, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎక్కువగా ఆలోచించే బదులు.. వర్తమానంలోని క్షణాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగాలి. నలుగురితో కలవడం, స్నేహితులతో సమయం గడపడం వల్ల ఒంటరితనం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
మీ పార్ట్‌నర్‌కు ఈ లక్షణాలున్నాయా? అయితే, నార్సిసిస్టిక్ డిజార్డర్ ఉన్నట్టే..!
చాణక్యుని దృష్టిలో భార్య ఆశించే గుణాలు.. మీలో ఉన్నాయా?