Hyderabad: ఫ్లాట్ అద్దెకు కావాలంటూ.. రూ.12.75 లక్షలు కాజేశారుగా..
ABN , Publish Date - Aug 21 , 2025 | 06:46 AM
సామాన్యులనే కాదు.. విద్యావంతులనూ బురిడీ కొట్టిస్తూ రోజుకో కొత్త మార్గంలో సైబర్ నేరగాళ్లు డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా ఫ్లాట్ అద్దె కావాలంటూ ఆర్మీ అధికారుల్లా మాట్లాడి నమ్మించిన కేటుగాళ్లు.. అద్దె అడ్వాన్స్ చెల్లిస్తామంటూ ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.12.75 లక్షలు కాజేశారు.
- సైబర్ కేటుగాళ్ల బురిడీ..
- బాధితుడి ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ: సామాన్యులనే కాదు.. విద్యావంతులనూ బురిడీ కొట్టిస్తూ రోజుకో కొత్త మార్గంలో సైబర్ నేరగాళ్లు(Cyber criminals) డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా ఫ్లాట్ అద్దె కావాలంటూ ఆర్మీ అధికారుల్లా మాట్లాడి నమ్మించిన కేటుగాళ్లు.. అద్దె అడ్వాన్స్ చెల్లిస్తామంటూ ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.12.75 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. డీసీపీ ధార కవిత కథనం మేరకు.. బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఫ్లాట్‌ను అద్దెకిచ్చేందుకు ఆ వివరాలను ఓ వెబ్‌సైట్‌లో పోస్టు చేశాడు.
అది చూసి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తనను ఆర్మీ అధికారి ఆశీష్ కుమార్‌గా పరిచయం చేసుకున్నాడు. తనకు పశ్చిమబెంగాల్ నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయిందని, ఫ్లాట్ బాగా నచ్చిందంటూ నమ్మబలికాడు. దీంతో బాధితుడు అద్దె అడ్వాన్స్ ముందే ఇవ్వాలన్నాడు. అందుకు ఒప్పుకొన్న ఆగంతకుడు.. అడ్వాన్స్ డబ్బులు తమ అధికారులు ఆన్‌లైన్‌లో చెల్లిస్తారని చెప్పాడు. ఆ తర్వాత మరో వ్యక్తి బాధితుడికి ఫోన్ చేశాడు. ‘ఫ్లాట్ అద్దె అడ్వాన్స్ కింద రూ.80 వేలు చెల్లించాలని మా అధికారి చెప్పారు.

అయితే ఆర్మీ ప్రొటోకాల్ ప్రకారం.. పుల్వామా దాడులు జరిగిన తర్వాత యూపీఐ, ఐఎంపీఎస్ చెల్లింపులు నిలిపేశారు. మొదట మీరు డబ్బులు చెల్లింపులు చేస్తే వాటిని మా అధికారులకు చూపించి రెట్టింపు డబ్బు పంపిస్తాం’ అని తెలిపాడు. ఇది నమ్మిన బాఽధితుడు ముందుగా రూ.80 వేలు చెల్లించాడు. అయితే సాంకేతిక కారణాలతో డబ్బులు అందలేదని.. మరోసారి పంపితే అన్ని కలిపి చెల్లిస్తామని అవతలి వ్యక్తి సూచించాడు. అలా విడతల వారీగా బాధితుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.12.75 లక్షలు దోచుకున్నారు. కాగా, అపరిచితుల మాటలు అస్సలు నమ్మొద్దని, నేరుగా సంప్రదించి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాతనే ఇల్లు అద్దెకు ఇవ్వాలని డీసీపీ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు
శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక
Read Latest Telangana News and National News