Road Accidents: చావు మలుపులుగా.. రోడ్డు మార్గాలు..
ABN , Publish Date - Aug 21 , 2025 | 07:30 AM
కదిరి నుంచి జిల్లా సరిహద్దుగా ఉన్న తనకల్లు మండలంలోని చీకటిమానుపల్లి వరకు అనేక మలుపులున్నాయి. ఈమలుపుల్లో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడంలేదు. ముఖ్యంగా నల్లచెరువు మండలంలోని పెద్దయల్లంపల్లి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు పూర్తిగా కనిపించవు.
కదిరి/ తనకల్లు నల్లచెరువు, (ఆంధ్రజ్యోతి): కదిరి నుంచి, చీకటిమానుపల్లి వరకు ఉన్న జాతీయ రహదారి మలుపులు అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దీంతో ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. కదిరి నుంచి చీకటిమానుపల్లి వరకు దాదాపు 35 కిలోమీటర్ల పరిధిలో చాలా డీప్ కర్వులు ఉన్నాయి. ఈ మలుపుల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి రద్దీగా ఉండే ఈ జాతీయ రహదారిని నాలుగే లేన్లుగా విస్తరిస్తే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
పొంచి ఉన్న ప్రమాదాలు..
కదిరి నుంచి జిల్లా సరిహద్దుగా ఉన్న తనకల్లు మండలంలోని చీకటిమానుపల్లి వరకు అనేక మలుపులున్నాయి. ఈ మలుపుల్లో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. ముఖ్యంగా నల్లచెరువు మండలంలోని పెద్దయల్లంపల్లి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు పూర్తిగా కనిపించవు. ఈ మలుపు వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే పాత రైల్వేస్టేషన్ వద్ద కూడా ఇదే పరిస్థితి. గతంలో నల్లచెరువు. సాయిబాబా గుడి వద్ద మలుపులో జరిగిన ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కొల్పో యిన విషయం తెలిసిందే. తనకల్లు మండలంలోని పరాకు వాండ్లపల్లి, మండ్లిపల్లి, నల్లగుట్లపల్లి, గంగసాని పల్లి, కొక్కంటి క్రాస్ పెట్రోల్ బంక్, చీకటిమానుపల్లి వద్ద ప్రమాదకరమైన మలుపులున్నాయి. రాత్రి సమయంలో వాహనం దగ్గరికి వచ్చే వరకు గుర్తించే పరిస్థితి లేదు. దీంతో దగ్గరికి వచ్చిన సమయంలో వాహనాలను డ్రైవర్లు అదుపుచేయలేక ప్రమాదాలు జరుగుతున్నాయి.
కొన్ని ఊదాహరణలు ఇలా..
• తనకల్లు మండలంలో జాతీయ రహదారి మలుపుల కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
• పరాకువాండ్లపల్లి సమీపంలో రోడ్డు మలుపు ఉండటంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గత మూడునెలల్లో మూడుమార్లు ప్రమాదాలు జరిగాయి.
• మండ్లిపల్లి మిట్ట, మండ్లిపల్లి సమీపంలో రోడ్డు మలుపుల వల్ల గత మూడు నెలల్లో ఐదు ప్రమాదాలు జరిగి నలుగురు మృతి చెందారు.
• మండలంలోని గంగసానిపల్లి, నారేవాండ్లపల్లి మధ్య రెండు నెలల కిందట జరిగిన ప్రమాదంలో నల్లమాడకు చెందిన కూలీలు మృతి చెందారు. చీకటిమాను పల్లి, ఈదులవంక మధ్యలో మూడునెలలో నాలుగురు ద్విచక్ర వాహనదారులు మృతి చెందారు.
• నల్లచెరువు మండలంలోని పెద్దమల్లంపల్లి మలుపు వద్ద ఈ ఏడాది మే 11న ఆగి ఉన్న ఐషర్ వాహనాన్ని ఓ కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రిటైర్డ్ ఉద్యోగులు మృతి చెందారు.
• పాత రైల్వేస్టేషన్ మలుపు వద్ద ఈనెల 17న ఆటోను కారు ఢీకొంది. దీంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.
• సంత తోపు వద్ద కర్ణాటక రాష్ట్రంలోని చింతామణికి చెందిన బొలెరో వాహనం ఈనెల 7న గ్యాస్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్
హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి