Gaza genocide: గాజాలో ఆగని ఆకలి చావులు.. 290 మంది మృతి
ABN , Publish Date - Aug 25 , 2025 | 08:11 AM
ఇజ్రాయెల్ ఆంక్షల నేపథ్యంలో గాజాలో ఆకలి చావులు నిరంతరాయం కొనసాగుతున్నాయి. ఈ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 62 వేల మందికి పైగా మరణించారు.
గాజా, ఆగస్టు 25: నిత్యవసర వస్తువుల సరఫరాపై ఇజ్రాయెల్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో గాజాగా ఆకలి చావులు కొనసాగుతున్నాయి. ఆకలి కారణంగా మరణించిన వారి సంఖ్య 290కు చేరుకొంది. వీరిలో 114 మంది పిల్లలు ఉన్నారు. ఈ మేరకు గాజాలోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ది గ్లోబల్ హంగర్ మానిటర్, ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ సైతం గాజాలోని కరువు పరిస్థితులను ఇప్పటికే నిర్ధారించింది.
అందులో భాగంగా ఉత్తర గాజా గవర్నరేట్ పరిధిలోని బీట్ హనూన్, జబాలియా తదితర నగరాల్లోని పరిస్థితులు దాదాపుగా అలాగే ఉన్నాయని.. కొన్ని ప్రదేశాల్లో అంతకంటే దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర గాజాలో ఆహార భద్రతపై తగినన్ని వివరాలు తమ వద్ద లేదని పేర్కొంది. కానీ ఈ ప్రాంతానికి అత్యవసరంగా ఆహారాన్ని అందించాల్సిన ఆవశ్యకత మాత్రం ఉందని స్పష్టం చేసింది.
ఇక దక్షిణ గాజాలోని రఫా గవర్నరేట్‌పై తాము విశ్లేషణలు చేయలేదని ఈ సంస్థ వివరించింది. అదీకాక ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ విస్తృతమైన సైనిక కార్యకలాపాలు కారణంగా.. విధ్వంసం అధికంగా ఉందని తెలిపింది. ఇక్కడ జనాభా సైతం అంతగా లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి గాజా గవర్నరేట్ పరిధిలో నివసిస్తున్న వారిలో 30 శాతం మంది మాత్రమే ఉన్నారని చెప్పింది.
వీరంతా ఫేజ్ 5 స్థాయి ఆహార లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించింది. అలాగే ఆ ప్రాంతంలోని వివిధ గవర్నరేట్ల పరిధిలోని ప్రజలు ఫేజ్ 4 అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. మరోవైపు సెంట్రల్ గాజాలోని డీర్ ఎల్ బాలా, దక్షిణాన ఖాన్ యూనిస్ గవర్నరేట్లకు సెప్టెంబర్ చివరి నాటికి కరువు పరిస్థితులు విస్తరిస్తాయని అంచనా వేసింది. అయితే పరిస్థితులు రోజురోజుకు దిగజారి పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది.
2023, అక్టోబర్ 7వ తేదీన గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకు మరణించిన వారి సంఖ్య 62,004కు చేరింది. అలాగే ఈ యుద్ధం కారణంగా 156,000 మంది గాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎక్కడ తక్కువకు వస్తే అక్కడే ఆయిల్ తీసుకుంటాం.. తేల్చి చెప్పిన వినయ్ కుమార్
మద్యం తాగి వేధిస్తున్నాడని భర్తపై భార్య దాడి
For More International News And Telugu News