Chanakya Niti on RelationShip: భర్తలోని ఈ 5 లక్షణాలే కాపురాలను కూలుస్తాయ్..!
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:06 PM
భార్యాభర్తల మధ్య అన్యోన్యత క్షీణించడానికి ఇరువురి తప్పులు కారణమవుతాయి. అయితే, భర్తలోని ఏ లక్షణాలు భార్యను దూరం చేస్తాయో చాణక్యుడు నీతి శాస్త్రంలో వివరించాడు. భర్తలోని ఈ 5 చెడు లక్షణాలు భార్యతో అతడి సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో స్పష్టం చేశాడు.
ఒక వ్యక్తి జీవితంలో సుఖ దుఃఖాలు అతిథిలా వస్తూ పోతూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అయితే, భార్యభర్తలు జీవితాంతం కలిసుండాలంటే కొన్నిసార్లు జీవనశైలిలో, స్వభావంలో ఇరువురూ కచ్చితంగా కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే. జీవితం సజావుగా సాగాలంటే ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని చాణక్యడు చెబుతున్నాడు. జీవనగమనంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలను నేర్పుగా దాటుకుంటూ ముందుకెళితే కచ్చితంగా దంపతులు సంతోషంగా జీవించగలరు. అయితే, వివాహం అనంతరం భార్య జీవితాన్ని అగమ్యగోచరంగా మార్చి చీకటిమయం చేసే చెడ్డ భర్తలకు ఉంటే కొన్ని లక్షణాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
సోమరితనం
చాణక్య నీతి ప్రకారం, వివాహానికి ముందు చాలామంది పురుషులకు ఇంటి బాధ్యతలపై ప్రత్యేక శ్రద్ధంటూ ఉండదు. వివాహం తర్వాత వారు కుటుంబ ఖర్చులతో పాటు భార్య, పిల్లల ఖర్చులను కూడా భరించాల్సి ఉంటుంది. కానీ సోమరితనం వల్ల చాలామంది భర్తలు నిజాయితీగా తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు ప్రయత్నించరు. ఎల్లప్పుడూ పనికి దూరంగా ఉండటమో లేదా వాయిదా వేయడమో చేస్తుంటారు. పొరపాటున్న ఎవరైనా పని పురమాయిస్తే అగ్గిమీద గుగ్గిలమవుతారు. ఏదైనా పని చెప్పినా విసుక్కుంటూ కుటుంబానికి భారంగా తయారవుతారు. వివాహం తర్వాత ఇంటి బాధ్యతలను పట్టించుకోని పురుషులు తమ భార్యలను మానసిక క్షోభకు గురిచేస్తారు. తీవ్ర ఆర్థిక సమస్యలకు కారణమవుతారు.
ఆర్థిక పరిస్థితి
వివాహం తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నించని పురుషులు ఎల్లప్పుడూ తమ ఖర్చులు, ఇంటి అవసరాల కోసం తమ భార్యపై ఆధారపడతారని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. దీని కారణంగా క్రమంగా వారి సంబంధంలో ఉద్రిక్తతలు పెరుగుతాయి. చేదు అనుభవాలు పెరుగుతూ పోయి వైవాహిక బంధం బలహీనపడుతుంది.
మాదకద్రవ్యాలకు బానిసైన వ్యక్తి
మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలైన పురుషులు వారి ఆరోగ్యానికి హాని చేసుకోవడమే కాకుండా కుటుంబంలో అశాంతిని రేకెత్తిస్తారు. ప్రేమ, గౌరవం మర్చిపోయి మత్తులో అయినవాళ్లకు హాని కలిగించే ప్రమాదమూ లేకపోలేదు. పురుషుల్లోని ఈ చెడు అలవాటు వివాహం తర్వాత భార్యాబిడ్డల దుఃఖానికి కారణమవుతుంది. వారి భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా పరిణమిస్తుంది.
కోపం
నిత్యం కోపంతో దహించుకుపోయే పురుషులు తమ స్వభావం కారణంగా భార్యలతో సత్సంబంధాలను కొనసాగించలేరు. ఇలాంటి వాళ్లు తమ భార్యలను అభద్రతా భావానికి గురి చేస్తూ మొత్తం కుటుంబంపై ఒత్తిడి పెంచుతారు. భయాందోళనలకు కారణమవుతారు.
బాధ్యతలు తప్పించుకునేవారు
వివాహం తర్వాత తమ కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడానికి వెనుకాడే పురుషులు తమ భార్యల బాగోగులపై శ్రద్ధ వహించరు. ఎప్పుడు ఏ పని చెప్తారోననే భావంతో దూరంగా మసలుకుంటూ ఉంటారు. ఇంటి సమస్యలను పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తారు. ఇలాంటి కుటుంబంపై తీవ్ర ఒత్తిడిని పెంచి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
అంజీర్ కొనేప్పుడు జాగ్రత్త! అసలైనదా? నకిలీదా? ఇలా తెల్సుకోండి!
కల్తీ పాలను ఎలా గుర్తించాలో తెలుసా?