Depression Causes and First Signs: డిప్రెషన్ ఎందుకొస్తుంది? ముందస్తు లక్షణాలేంటి?
ABN , Publish Date - Sep 04 , 2025 | 08:20 PM
డిప్రెషన్ అనేది ఒక మానసిక ఆరోగ్య సమస్య. అలా అని తేలిగ్గా తీసిపడేయద్దు. ఈ ఒక్క చిన్న సమస్య వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ ప్రాబ్లెం వల్లే కెరీర్లో పతనమయ్యారు. ఇంతకీ ఈ సమస్య ఎందుకొస్తుంది? ముందుగానే ఎలా గుర్తించాలి?
మానసిక సమస్యలు ఎంత ప్రమాదకరమైనవో నిపుణులు చెప్తున్నప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోరు. అందుకే ఎంతోమంది చదువులు, మార్కుల ఒత్తిడికి బలవుతున్నారు. కెరీర్, ఫ్యామిలీ పరంగా అన్నీ ఉన్నా కొందరు యువత డిప్రెషన్ సమస్యతో జీవితాన్నే అల్లకల్లోలం చేసుకున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే, పాప్ స్టార్లు జస్టిన్ బీబర్, కేటీ పెర్రీ ఇలా ఎందరో సెలబ్రిటీలు డిప్రెషన్ కారణంగా చీకటిలో మగ్గారు. ఒక వ్యక్తి ఆలోచనా విధానాన్ని అంతలా మార్చేస్తుంది డిప్రెషన్. ఈ సమస్య కేవలం సెలబ్రిటీలకే కాదు. సామాన్యులనూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ సమస్యకు మూల కారణాలేంటి? ఎలా అధిగమించాలి? ఈ స్టోరీలో చూద్దాం.
డిప్రెషన్ ఎందుకొస్తుంది?
డిప్రెషన్ అనేది ఒక మానసిక సమస్య. ఒక వ్యక్తి నిరంతరం విచారంగా ఉన్నా, అలసట, ప్రతికూల ఆలోచనలు చేస్తున్నా ఈ ప్రాబ్లెం ఉన్నట్లే. హార్మోన్ల అసమతుల్యత, మెదడులో రసాయన మార్పులు, ఒత్తిడితో కూడిన జీవిత పరిస్థితులు, దీర్ఘకాలిక అనారోగ్యం లేదా కోలుకోలేని నష్టం ఎదురైనప్పుడు డిప్రెషన్ బారిన పడవచ్చు. పేలవమైన జీవనశైలి, పని ఒత్తిడి, సోషల్ మీడియాను అధికంగా ఉపయోగించడం కూడా ఈ సమస్యను సృష్టిస్తున్యాయి. కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలు వల్ల డిప్రెషన్ వచ్చే ఛాన్సుంది. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స పొందడం చాలా ముఖ్యం. లేకుంటే జీవితాంతం అశాంతితోనే గడపాల్సి వస్తుంది.
డిప్రెషన్ రకాలు?
డిప్రెషన్‌లు అనేక రకాలు. మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ ఉన్న ఒక వ్యక్తి చాలా తీవ్ర బాధ అనుభవిస్తాడు. పెర్సిస్టెంట్ డిప్రెసివ్ డిజార్డర్ తేలికపాటి సమస్యే. కానీ దీర్ఘకాలికంగా వెంటాడుతుంది. ప్రసవానంతర డిప్రెషన్ తరచుగా మహిళల్లో కనిపిస్తుంది. దీనితో పాటు వాతావరణం మారినప్పుడు సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ కొంతమందికి రావచ్చు. మానసిక ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, దీర్ఘకాలిక వ్యాధులు లేదా జన్యపరంగా వ్యక్తులు డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు, టీనేజర్లు, వృద్ధులు త్వరగా డిప్రెస్ అవుతారు. అధికంగా మద్యం లేదా మాదకద్రవ్యాలు తీసుకునే వ్యక్తులు కూడా డిప్రెషన్ బారిన పడతారు.
డిప్రెషన్ ప్రారంభ లక్షణాలు ఏమిటి?
సాధారణంగా డిప్రెషన్ చిన్న చిన్న లక్షణాలతోనే మొదలవుతుంది. నిరంతర విచారం, నిరాశ, నిద్ర సమస్యలు, చిరాకు, అలసట, ఏ పనిపైనా ఆసక్తి లేకపోవడం డిప్రెషన్ ప్రారంభ సంకేతాలు. అలాగే, ఆహారపు అలవాట్లలో మార్పు కూడా రావచ్చు. ఎక్కువగా తిన్న తర్వాతా ఆకలిగా అనిపించడం ఓ లక్షణం. అలాగే, ఆత్మవిశ్వాసం లేకపోవడం, ప్రతికూల ఆలోచనలు, తనను తాను పనికిరానివాడిగా భావించడం కూడా డిప్రెషన్ ప్రారంభ లక్షణాలే.
ఎలా రక్షించుకోవాలి?
పోషకారం ఆహారం తీసుకోవడంపై శ్రద్ధ చూపాలి.
వ్యాయామం, యోగాను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి.
తగినంత నిద్ర పోవడం అవసరం. నిద్రపోయే, మేల్కొనే సమయం రోజూ ఒకేలా ఉండాలి.
ఒత్తిడిని తగ్గడానికి ధ్యానం చేయండి.
వ్యసనాలకు దూరంగా ఉండండి.
మీ ఆలోచనలు, భావాలను కుటుంబం లేదా స్నేహితులతో పంచుకోండి.
అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
షాకింగ్ రిపోర్ట్.. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లు తాగకూడదు.!
డైలీ టమోటాలు తింటే నిజంగా కిడ్నీలో రాళ్లు వస్తాయా?
For More Latest News