Share News

Tomatoes and Kidney Stones: డైలీ టమోటాలు తింటే నిజంగా కిడ్నీలో రాళ్లు వస్తాయా?

ABN , Publish Date - Sep 04 , 2025 | 04:00 PM

టమోటాలు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వస్తాయని చాలా మంది అంటుంటారు. ఇంతకీ ఈ మాట నిజమేనా? లేకపోతే అపోహా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయ్..

Tomatoes and Kidney Stones: డైలీ టమోటాలు తింటే నిజంగా కిడ్నీలో రాళ్లు వస్తాయా?
Can Daily Eating Tomatoes Lead to Kidney Stones

రోజువారీ ఆహారంలో టమోటాలు లేకుండా వంట చేయడం అసాధ్యంగానే భావిస్తారు ఇండియన్స్. ఇంట్లో ఏ కూరగాయ ఉన్నా.. లేకున్నా.. టమోటా ఉండాలంటారు. ఉల్లిపాయల్లాగే పెద్ద పరిమాణంలో పప్పు, కూర, గ్రేవీ, పచ్చళ్లు తయారీలో ఉపయోగిస్తారు. వంటకానికి ప్రత్యేకమైన రుచిని తీసుకురావడమే టమోటాను విరివిగా వాడటానికి గల ముఖ్య కారణం. అదీగాక ఇతర కూరగాయల్లాగా కాకుండా టమోటా ఒక్క దాంతోనే వివిధ రకాల వంటకాలు చేయవచ్చు. అయితే, టమోటా వల్ల ఎన్ని లాభాలుంటాయో.. నష్టాలూ అంతే ఉంటాయని కొందరు అంటుంటారు. రోజూ తింటే మూత్రపిండాల్లో రాళ్లు వస్తాయని వార్నింగ్ ఇస్తుంటారు. ఇది ఎంతవరకు నిజం? రోజూ టమోటాలు తినడం వల్ల నిజంగా కిడ్నీలో రాళ్లు వస్తాయా? అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం...


టమోటా ప్రయోజనాలు

టమోటాల్లో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. దీనితో పాటు లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధిస్తుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి, బిపిని నియంత్రణకు సహకరిస్తుంది. టమోటాలోని విటమిన్ కె, ఫోలేట్, ఫైబర్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఎర్ర రక్త కణాల పెరుగుదలకు తోడ్పడతాయి. జీర్ణ శక్తిని పెంచుతాయి.


టమోటా వల్ల కలిగే నష్టాలు

టమోటాలు ఆరోగ్యానికి మంచివే కానీ.. కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. టమోటాలలో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. ఇవి శరీరంలోని కాల్షియంతో కలిసి స్ఫటికాలను ఏర్పరుస్తాయి. ఇవి రాళ్లలా గట్టిగా మారుతాయి. క్రమంగా మూత్రపిండాలలో పేరుకుపోతాయి. ఇదివరకే కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా టమోటాలు తింటే సమస్య మరింత తీవ్రమవుతుంది. ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలు ఉంటే పచ్చి టమోటాలు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.కిడ్నీ ప్రాబ్లెమ్స్ లేని వ్యక్తులు నిస్సంకోచంగా టమోటాలు తినవచ్చు. కానీ తగిన పరిమాణంలో తినాలి. అలాగే, టమోటాలతో పాటు ఇతర ఆహారాలను కూడా తప్పక తీసుకోవాలి.


అధ్యయనంలో ఏం తేలింది?

వంటకాన్ని టేస్టీగా చేస్తుందనే కారణంతో రోజువారీ ఆహారంలో టమోటా తప్పనిసరిగా వాడతారు. దీనిపై తాజా పరిశోధనల్లో ఊహించని నిజాలు వెల్లడయ్యాయి. టమోటాలు రోజూ తింటే బీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయని తేలింది. కానీ, కొంతమంది క్రమం తప్పకుండా టమోటా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు వస్తాయని కూడా రుజువైంది. ఒక అధ్యయనం ప్రకారం, 12 వారాల పాటు ప్రతిరోజూ 100 గ్రాముల కంటే ఎక్కువ టమోటాలు తినేవారిలో మూత్రపిండాల్లో రాళ్లు కనిపించాయి. ఈ రోగుల మూత్రంలో ఆక్సలేట్ స్థాయిలు పెరిగాయి. ఈ పెరుగుదల సాధారణమైనప్పటికీ టమోటాలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.


Also Read:

షాకింగ్ రిపోర్ట్.. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లు తాగకూడదు.!

ఈ వ్యాధులున్నవారు చల్లటి నీటితో స్నానం చేస్తే అంతే!

For More Latest News

Updated Date - Sep 04 , 2025 | 05:26 PM