Share News

Cold Bath Side Effects: ఈ వ్యాధులున్నవారు చల్లటి నీటితో స్నానం చేస్తే అంతే!

ABN , Publish Date - Sep 03 , 2025 | 08:29 PM

వేకువజామునే చల్లనీళ్లతో స్నానం చేయడం అనే సంప్రదాయాన్ని భారతదేశంలో అనాదిగా పాటిస్తూ వస్తున్నారు. ఈ అలవాటు మంచిదే అయినప్పటికీ.. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం కచ్చితంగా చల్ల నీటి స్నానానికి దూరంగా ఉండాల్సిందేనని డాక్టర్లు వార్నింగ్ ఇస్తున్నారు.

Cold Bath Side Effects: ఈ వ్యాధులున్నవారు చల్లటి నీటితో స్నానం చేస్తే అంతే!
Avoid Cold Water Showers If You Have these problems

చల్లని నీటితో స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా ఈ పద్ధతి పాటించడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. అందుకే చల్లని నీళ్లతో స్నానం చేశాక రిలాక్స్ గా అనిపిస్తుంది. రిఫ్రెష్ అవుతారు. తలకు రక్త ప్రసరణ మెరుగుపడి ఉత్సాహంగా, హాయిగా ఉంటారు. ఈ అలవాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. శారీరకంగా, మానసికంగా ఉత్తేజితులను చేస్తుంది. అయితే, చల్ల నీళ్ల స్నానం చేయడం అందరికీ సరిపోదు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి చల్లని స్నానం హానికరం అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మరి, ఎవరెవరు చల్ల నీళ్ల స్నానం చేయకూడదో తెలుసుకుందాం.


రేనాడ్స్ వ్యాధి

చలి లేదా ఒత్తిడికి గురైనప్పుడు రక్తనాళాలు సంకోచించి చేతులు, కాళ్లు ఒక్కసారిగా చల్లబడిపోతాయి. రక్తప్రవాహం తగ్గిపోవడం వల్ల కలిగే స్థితినే రేనాడ్స్ అంటారు. ఈ సమస్యతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ చల్ల నీళ్ల స్నానాలు చేయకూడదు. పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. తిమ్మిరి, తీవ్రమైన నొప్పి, హఠాత్తుగా శరీరం చల్లబడిపోవడం వంటి అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

గుండె జబ్బులు

హార్ట్ పేషెంట్స్ కూడా చల్ల నీటి స్నానాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమస్యలు ఉన్నవారి రక్త నాళాలు ఇరుకుగా అవుతాయని అనేక అధ్యయనాలు నిరూపించాయి. ఇదేగాక, చల్లని నీరు రక్తపోటు, హృదయ స్పందన రేటును మరింత పెంచుతుంది. అందుకే గుండె జబ్బులు ఉన్నవారు చల్లని స్నానాలకు దూరంగా ఉండాలి.

అధిక రక్తపోటు

ఈ రోజుల్లో చాలా మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ ప్రాబ్లెం ఉన్నవారు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల బీపీ అమాంతం పెరిగిపోతుంది. స్ట్రోక్, గుండెసమస్యలు వచ్చే ప్రమాదం రెట్టింపవుతుంది. అందుకే హై బీపీ ఉన్నవారు చల్ల నీటి స్నానానికి దూరంగా ఉండాలి.


ఆస్తమా

ఆస్తమాతో బాధపడేవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరు చలిగా ఉన్న వాతావరణంలో ఉన్నప్పుడు బ్రోంకోస్పాస్మ్ అనే పరిస్థితి తలెత్తుతుంది. ఇది శ్వాసకోశంలో వాయుమార్గాలను ఇరుకుగా చేస్తుంది. ఫలితంగా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. పొరపాటున ఆచారం, సంప్రదాయం అంటూ చల్ల నీటితో స్నానం చేశారంటే పరిస్థితి మరింత దిగజారవచ్చు.

తక్కువ రోగనిరోధక శక్తి

బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు చల్లని స్నానాలు చేయకూడదు. చల్ల నీళ్ల స్నానాలు చేయడం వల్ల జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అనారోగ్యం నుండి కోలుకుంటున్నవారు లేదా కీమోథెరపీ వంటి చికిత్స పొందుతున్నవారు కూడా చల్ల నీటి స్నానాలకు దూరంగా ఉండటం మంచిది. ఇది రోగనిరోధక వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది.

హైపోథైరాయిడిజం

హైపోథైరాయిడిజంతో బాధపడేవారు చల్లని స్నానాలకు దూరంగా ఉండాలి. వీరు చలి వాతావరణంలో ఎక్కువ సున్నితంగా ఉంటారు. ఒకవేళ తెలియక చల్లని నీటితో స్నానాలు చేస్తే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది. ఫలితంగా అలసట, చలిని తట్టుకోలేకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

పైనాపిల్ అందరికీ కాదండోయ్! ఈ 5 రకాల వాళ్లు దూరంగా ఉండాలి..

డెస్క్ వర్క్ చేసేవారికి షుగర్ కంట్రోల్ టెక్నిక్స్!

For More Health News

Updated Date - Sep 03 , 2025 | 09:04 PM