Share News

Pineapple Side Effects: పైనాపిల్ అందరికీ కాదండోయ్! ఈ 5 రకాల వాళ్లు దూరంగా ఉండాలి..

ABN , Publish Date - Sep 03 , 2025 | 05:28 PM

తియ్యతియ్యగా, పుల్లపుల్లగా ఉండే పైనాపిల్ రుచి చాలా మందికి నచ్చుతుంది. విటమిన్-సి పుష్కలంగా ఉండే పైనాపిల్ ముక్కలు కాసిన్ని తిన్నా చాలు. తక్షణమే ఎనర్జీ వచ్చేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచి వ్యాధులను తరిమికొట్టే ఈ పండు అందరికీ మేలు చేయదు. ముఖ్యంగా ఈ 5 రకాల వాళ్లకి హానికరమని వైద్యులు సలహా ఇస్తున్నారు.

Pineapple Side Effects: పైనాపిల్ అందరికీ కాదండోయ్! ఈ 5 రకాల వాళ్లు దూరంగా ఉండాలి..
Never Eat Pineapple If You Have These Conditions Know Why

పైనాపిల్ చాలా రుచికరమైన, జ్యుసీ పండు. చూసేందుకే కాకుండా ఈ పండు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. పైనాపిల్‌ను నేరుగా జామ్, జ్యూస్ లేదా ఫ్రూట్ సలాడ్ రూపంలో తినవచ్చు. కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, విటమిన్ సి, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు, శక్తిమంతమైన అనేక పోషకాలు పైనాపిల్‌లో కనిపిస్తాయి. పైనాపిల్ తింటే జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే బరువును తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, అజీర్ణం, ఎసిడిటీ, వికారం, అధిక రక్తపోటును నియంత్రించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇన్నిరకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ పైనాపిల్ తినడం వల్ల కొంతమంది అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంతకీ, ఏఏ వ్యక్తులు పైనాపిల్ కు దూరంగా ఉండాలి? ఇది తింటే కలిగే నష్టాల ఏమిటో తెలుసుకుందాం...


1. గర్భిణీ స్త్రీలు

గర్భిణీ స్త్రీలు తగినంత పోషకాహారం పొందడానికి పండ్లు, కూరగాయలు తినమని డాక్టర్లు సలహా ఇస్తారు . ఇక గర్భధారణ సమయంలో బొప్పాయి తినకూడదని అనడం మామూలే. ఇదేగాక, పైనాపిల్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో తినకూడదని మీకు తెలుసా. ఎందుకంటే ఇది గర్భస్రావం జరిగే ప్రమాదాన్ని పెంచుతుంది.

2. రక్తంలో చక్కెర పెరగవచ్చు

పైనాపిల్ రసంలో సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును పెద్ద పరిమాణంలో తీసుకుంటే అధిక కేలరీలు, చక్కెర కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు హానికరం. కానీ, షుగర్ పేషెంట్లు పైనాపిల్ తినాలనుకుంటే మితంగా తినవచ్చు.

3. దంత సమస్యలు

పైనాపిల్ రసం సహజంగా ఆమ్లతత్వం కలిగి ఉంటుంది. ఇది దంతాల ఎనామిల్‌ను ప్రభావితం చేస్తుంది. దీన్ని ఎక్కువ పరిమాణంలో క్రమం తప్పకుండా తీసుకుంటే గనక దంతాలు బలహీనపడతాయి. దంత క్షయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా చిగుళ్ల నొప్పి, వాపు లేదా మరేదైనా దంత సమస్యలు ఉన్నవారు పైనాపిల్ అస్సలు తినకూడదు. ఎందుకంటే పైనాపిల్ తినడం వల్ల దంతాలపై తెల్లటి పొర ఏర్పడి దుర్వాసన వస్తుంది.


4. జీర్ణవ్యవస్థపై ప్రభావం

పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కానీ అధికంగా తీసుకుంటే అసిడిటీ, కడుపు నొప్పి, విరేచనాలు, వికారం వంటి సమస్యలకు దారితీస్తుంది .

5. కిడ్నీ ఆరోగ్యంపై ప్రభావం

అధిక పొటాషియం మూత్రపిండాలకు హానికరం. ఇప్పటికే ఏవైనా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు పైనాపిల్ జ్యూస్ తాగితే మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. కాబట్టి, వీలైనంత తక్కువ తీసుకోవడమే మేలు.

పై సమస్యలే గాక కొంతమందికి పైనాపిల్‌లో బ్రోమెలైన్ వల్ల దురద, దద్దుర్లు, వాపు లేదా తేలికపాటి చికాకు వంటి చర్మ సమస్యలు, అలెర్జీలు, గాయాలైనప్పుడు రక్తస్రావ ప్రమాదం, బలహీనత, తలతిరుగుడు, లో బీపీ సమస్యలు వచ్చేందుకు ఆస్కారముంది.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

ఈ పువ్వు షుగర్ పేషెంట్లకు దివ్యౌషధం!

డెస్క్ వర్క్ చేసేవారికి షుగర్ కంట్రోల్ టెక్నిక్స్!

For More Health News

Updated Date - Sep 03 , 2025 | 05:29 PM