CM Revanth vs BRS: బీఆర్ఎస్ అనే పాములో కాలకూట విషం ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Sep 03 , 2025 | 06:38 PM
బీఆర్ఎస్ ప్రజలను దోచుకున్న అనకొండ.. పంపకాల్లో తేడాలొచ్చి ఒకరితో ఒకరు కొట్టుకుంటూ మాపై ఎందుకు నిందలు వేస్తున్నారని అని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చంద్రుగొండ: బీఆర్ఎస్ విషనాగు. ఈ పాములో కాలకూట విషం ఉంది. అయితే, ప్రజలు దాని కోరలు ఎప్పుడో పీకేశారని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన చంద్రుగొండ దామరచర్ల బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారంటూ కవిత చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు.
పంపకాల్లో తేడాలొచ్చే కొట్లాటలు..
లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. పంపకాల్లో తేడాలు వచ్చి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. అక్క, అన్న, చెల్లి, బావ ఒకరినొకరు కత్తులతో పొడుచుకుంటున్నారు. దోపిడీ సొమ్ము వాళ్లింట్లో చిచ్చు పెట్టింది. సంపాదించుకున్న టీవీలు, పేపర్ల కోసం కొట్టుకుంటున్నారు. వాళ్లు వాళ్లు కొట్టుకుంటూ మాపై నిందలు వేస్తున్నారు. మీ పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు. చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం మాకేముంది. బీఆర్ఎస్ ను ప్రజలే బొందపెట్టారని సీఎం రేవంత్ మండిపడ్డారు.
ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామమే లేదు..
దామరచర్ల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, సొంతిల్లు అనేది ప్రతి పేదవాడి జీవితస్వప్నం అని.. గత పదేళ్లు పేదలకు ప్రభుత్వ ఇళ్లు దక్కలేదని అన్నారు. ఏటా 2 లక్షల ఇళ్లు కట్టినా పదేళ్లలో 20 లక్షల మందికి వచ్చేవని.. కానీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అంటూ గత ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కళ్లలో ఆనందం కనబడుతోంది. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామమే లేదని.. పేదల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. బీఆర్ఎస్ తెచ్చిన ధరణికి పాతరేసి భూభారతి తీసుకొచ్చి రైతుల సమస్యలు పరిష్కరించామని వెల్లడించారు. మునుపెన్నడూ లేని విధంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు. మన పిల్లలు బర్రెలు, గొర్రెలు కాచుకోవాలని కేసీఆర్ పార్టీ వాళ్లు అంటారని.. వాళ్ల పిల్లలు మాత్రం చదువుకుని రాజ్యం ఏలి దోచుకుంటారట అంటూ తీవ్రంగా విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డికి లంబాడీలపై చిత్తశుద్ధి లేదు..
మేడారం మహా జాతర నిర్వహణపై మంత్రుల సమీక్ష..
Latest Telangana News